మల్లారెడ్డికి సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ
ABN , Publish Date - Feb 25 , 2026 | 02:12 AM
మాజీ మంత్రి సీహెచ్ మల్లారెడ్డి, ఆయన కుమారుడు మహేందర్ రెడ్డి, అల్లుడు మర్రి రాజశేఖర్ రెడ్డిలకు సుప్రీంకోర్టు ఎదురుదెబ్బ తగిలింది.
జీడిమెట్ల భూ సర్వేపై దక్కని ఊరట
హైకోర్టు ఉత్తర్వుల్లో జోక్యానికి నిరాకరణ
న్యూఢిల్లీ, ఫిబ్రవరి 24 (ఆంధ్రజ్యోతి): మాజీ మంత్రి సీహెచ్ మల్లారెడ్డి, ఆయన కుమారుడు మహేందర్ రెడ్డి, అల్లుడు మర్రి రాజశేఖర్ రెడ్డిలకు సుప్రీంకోర్టు ఎదురుదెబ్బ తగిలింది. జీడిమెట్ల భూ సర్వే వ్యవహారంలో సుప్రీంకోర్టును ఆశ్రయించగా వారికి ఊరట దక్కలేదు. హైకోర్టు ఉత్తర్వుల్లో జోక్యానికి సర్వోన్నత న్యాయస్థానం నిరాకరించింది. మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా కుత్బుల్లాపూర్ మండలం జీడిమెట్లలోని సర్వే నం 82/1/ఈఈలో భాగమైన 0.33 గుంటల విస్తీర్ణంలోని భూమి హద్దులు నిర్ణయించేలా రెవెన్యూ అధికారులను ఆదేశించాలని కోరుతూ శేరి శ్రీనివాస్ రెడ్డి హైకోర్టులో పిటిషన్ వేశారు. తమ హక్కులను ఉల్లంఘించేలా కుత్బుల్లాపూర్ తహసీల్దార్ జారీ చేసిన లేఖను ఆయన కోర్టులో సవాల్ చేశారు. అదే సర్వే నంబర్‌లోని మిగిలిన భూమిలోకి వెళ్లే దారిని పూర్తిగా మూసివేశారని పేర్కొన్నారు. దీనిపై విచారణ చేపట్టిన సింగిల్ జడ్జి.. దరఖాస్తు అందిన తేదీ నుంచి 45 పనిదినాల్లో చట్టప్రకారం సర్వే పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.దీనిపై మల్లారెడ్డి తదితరులు డివిజన్ బెంచ్ ఎదుట సవాల్ చేశారు. ద్విసభ్య ధర్మాసనం కూడా సింగిల్ జడ్జి ఉత్తర్వులను సమర్థించింది. హైకోర్టు తీర్పును వారు సుప్రీంకోర్టులో సవాల్ చేశారు. ఆ పిటిషన్‌పై మంగళవారం జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా, జస్టిస్ ఎన్.వి. అంజరియాలతో కూడిన ధర్మాసనం విచారణ జరిపింది. సర్వే ప్రక్రియ ఇప్పటికే పూర్తయిన నేపథ్యంలో తాము జోక్యం చేసుకోలేమని తేల్చిచెప్పింది.