Supreme Court: ప్రభాకర్‌రావును ఇంకెంత విచారిస్తారు?
ABN , Publish Date - Jan 17 , 2026 | 05:42 AM
ఫోన్ ట్యాపింగ్ కేసులో ఎస్‌ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్‌రావు ముందస్తు బెయిల్ పిటిషన్‌పై విచారణను సుప్రీంకోర్టు వాయిదా వేసింది.
ముందస్తు బెయిలిస్తే స్వేచ్ఛ ఇచ్చినట్లు కాదు: సుప్రీంకోర్టు
న్యూఢిల్లీ, జనవరి 16 (ఆంధ్రజ్యోతి): ఫోన్ ట్యాపింగ్ కేసులో ఎస్‌ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్‌రావు ముందస్తు బెయిల్ పిటిషన్‌పై విచారణను సుప్రీంకోర్టు వాయిదా వేసింది. ఈ కేసు దర్యాప్తులో న్యాయపరమైన అంశాలు ముడిపడి ఉన్నాయని, ప్రభాకర్‌రావు విచారణను తప్పించుకుంటూ పారిపోయి విదేశాల్లో గడిపిన విషయాన్ని దృష్టిలో ఉంచుకోవాలని తెలంగాణ ప్రభుత్వ న్యాయవాది సిద్ధార్థ లూథ్రా శుక్రవారం కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. పరారీలో ఉన్న వ్యక్తిగా గుర్తింపు పొందిన వ్యక్తి ముందస్తు బెయిల్‌కు దరఖాస్తు చేసుకోవచ్చా? అని ఆయన ప్రశ్నించారు. ప్రభుత్వ వాదనను పరిగణనలోకి తీసుకున్న జస్టిస్ నాగరత్న, జస్టిస్ మహదేవన్ ధర్మాసనం తదుపరి విచారణను మార్చి 10కి వాయిదా వేసింది. ప్రభాకర్‌రావును రెండు వారాల కస్టడీకి ఇప్పటికే అనుమతి ఇచ్చామని.. ఇంకెంత కాలం విచారణ కొనసాగిస్తారని జస్టిస్ నాగరత్న ప్రశ్నించారు. ముందస్తు బెయిల్ ఇచ్చామంటే ప్రభాకర్‌రావుకు స్వేచ్ఛ ఇచ్చినట్లు కాదని, రాష్ట్ర పోలీసులు ఆయన్ను ప్రశ్నించేందుకు పిలవొచ్చని పేర్కొన్నారు. ఆయన్ని విచారించడం ద్వారా మీ ప్రయోజనం నెరవేరిందా లేదా? మళ్లీ జైల్లో పెట్టాలనుకుంటున్నారా? అని ప్రశ్నించారు. ‘లొంగిపోయిన తర్వాత ఆయన విచారణకు సహకరిస్తున్నారు. మీ విచారణ, దర్యాప్తు పూర్తయింది. ఇక అదనపు విచారణ అవసరం లేదు. ఆయన్ను జైల్లో పెట్టేంతవరకూ విచారణ సాగించాలనుకుంటున్నారు. ఆర్టికల్ 142 కింద ఆయనకిచ్చిన మధ్యంతర ఊరటను పూర్తి స్వేచ్ఛగా మారుస్తాం’ అని పేర్కొన్నారు. అయితే, ప్రభాకర్‌రావు కస్టడీలో ఉన్నప్పుడు ముందస్తు బెయిల్ పొందే అర్హత ఉందా? లేదా? అన్నది ముఖ్యమని, న్యాయపరమైన అంశాల తీవ్రతను దృష్టిలో ఉంచుకుని నిర్ణయం తీసుకోవాలని లూథ్రా కోరడంతో.. ధర్మాసనం విచారణను మార్చి 10కి వాయిదా వేసింది. అంతవరకు ఆయనకు మఽధ్యంతర ఊరట కొనసాగుతుందని, కఠిన చర్యలు తీసుకోవద్దని పేర్కొంది.