Share News

హుస్సేన్‌ సాగర్‌ భూములపై సమగ్ర విచారణ అవసరం

ABN , Publish Date - May 09 , 2026 | 06:24 AM

హైదరాబాద్‌ నగరం నడిబొడ్డున, హస్సేన్‌ సాగర్‌ పరిసరాల్లో ఉన్న అత్యంత విలువైన భూముల వివాదంపై సమగ్ర విచారణ అవసరమని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది.

హుస్సేన్‌ సాగర్‌ భూములపై సమగ్ర విచారణ అవసరం

  • సుప్రీంకోర్టు అభిప్రాయం

  • అవి శిఖం భూములు, ప్రభుత్వానివే

  • ట్రయల్‌ కోర్టు తీర్పు ఏకపక్షం

  • హైకోర్టు దానిని సమర్థించడం చెల్లదు

  • హెచ్‌ఏండీఏ వాదన

న్యూఢిల్లీ, మే 8 (ఆంధ్రజ్యోతి): హైదరాబాద్‌ నగరం నడిబొడ్డున, హస్సేన్‌ సాగర్‌ పరిసరాల్లో ఉన్న అత్యంత విలువైన భూముల వివాదంపై సమగ్ర విచారణ అవసరమని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. భూములు తమవేనంటూ ప్రయివేటు వ్యక్తులు, హెచ్‌ఏడీఏలు కూడా ఆధారాలు చూపిస్తున్న నేపథ్యంలో ఈ అభిప్రాయాన్ని వ్యక్తం చేసిం ది. హుస్సేన్‌సాగర్‌ పరిసరాల్లోని దాదాపు 19 ఎకరాల 23 గుంటలు తమదేనంటూ బి.విజయా రెడ్డితోపాటు మరికొందరు హక్కులు కోరుతూ వస్తున్నారు. గతంలో ట్రయల్‌ కోర్టుతో పాటు హైకోర్టు వారికి అనుకూలంగా తీర్పునిచ్చింది. ఆ తీర్పును హైదరాబాద్‌ మెట్రోపాలిటన్‌ డెవల్‌పమెంట్‌ అథారిటీ(హెచ్‌ఎండీఏ) 26 జూన్‌ 2024న సుప్రీంకోర్టులో సవాల్‌ చేసింది. ఈ భూములు పూర్తిగా ప్రభుత్వానివేనని, ఇవి హుస్సేన్‌ సాగర్‌ ముంపు ప్రాంతం (శిఖం) పరిధిలోకి వస్తాయని హెచ్‌ఎండీఏ పేర్కొంది. ఆ పిటిషన్‌ శుక్రవారం జస్టిస్‌ విక్రమ్‌ నాథ్‌ నేతృత్వంలోని జస్టిస్‌ సందీప్‌ మెహతాల ద్విసభ్య ధర్మాసనం విచారించింది. హెచ్‌ఎండీఏ తరపున సీనియర్‌ న్యాయవాది గౌరవ్‌ అగర్వాల్‌, ప్రతివాదుల తరఫున సీనియర్‌ న్యాయవాది శ్యామ్‌ దివాన్‌ హాజరయ్యారు. గౌరవ్‌ అగర్వాల్‌ వాదనలు వినిపిస్తూ.. ఈ భూము లు సాగర్‌ గరిష్ఠ నీటిమట్టం (ఎఫ్‌టీఎల్‌) పరిధిలోకి వచ్చే ‘శిఖం’ భూములని, వీటిపై పూర్తి హక్కులు ప్రభుత్వానివేనని తెలిపారు. నీటి మట్టం పెరిగినప్పుడు ముంపునకు గురయ్యే ఈ భూమి పూర్తిగా ప్రభుత్వానిదేనని స్పష్టం చేశారు. శిఖం భూమిపై ప్రైవేటు వ్యక్తులకు హక్కు ఎలా ఉంటుందని ప్ర శ్నించారు.


ప్రైవేటు వ్యక్తులు 1928 నాటి పట్టా ఆధారంగా యాజమాన్య హక్కులు కోరుతున్నారని తెలిపారు. అయితే.. దావా వేసిన తర్వాత వారే ఏకపక్షంగా రెవెన్యూ రికార్డులను మార్చారని ధర్మాసనం దృష్టికి తీసుకెళ్లారు. ట్రయల్‌ కోర్టు ఏకపక్షంగా తీర్పునిస్తే, హైకోర్టు సైతం తమ వాదనలు వినకుండానే ఆ తీర్పును సమర్థించిందని తెలిపారు. ఈ భూమికి సంబంధించి ల్యాండ్‌ గ్రాబింగ్‌ చట్టం కింద కోర్టులో కేసు పెండింగ్‌లో ఉన్న విషయాన్ని, దానికి సంబంధించిన పత్రాలను హైకోర్టు పరిగణనలోకి తీసుకోలేదని తెలిపారు. ప్రతివాదుల తరఫున శ్యామ్‌ దివాన్‌ వాదిస్తూ ఈ భూమికి సంబంధించి పట్టా కాగితాలు తమ వద్ద ఉన్నాయని తెలిపారు. దాంతో సమగ్ర విచారణ అవసరమని అభిప్రాయపడ్డ ధర్మాసనం కేసును ఈ నెల 19వ తేదీకి వాయిదా వేసింది.

Updated Date - May 09 , 2026 | 06:25 AM