Share News

గర్భాన్ని కొనసాగించాలని బలవంతం చేయలేం

ABN , Publish Date - Apr 25 , 2026 | 07:28 AM

ఇష్టానికి వ్యతిరేకంగా గర్భాన్ని కొనసాగించాలంటూ ఒక మహిళను మరీ ముఖ్యంగా మైనర్‌ను ఏ న్యాయస్థానం కూడా బలవంతం చేయలేదంటూ సుప్రీంకోర్టు పేర్కొంది.

గర్భాన్ని కొనసాగించాలని బలవంతం చేయలేం

  • 15 ఏళ్ల బాలిక 7 నెలల గర్భవిచ్ఛిత్తికి సుప్రీం అనుమతి

న్యూఢిల్లీ, ఏప్రిల్‌ 24: ఇష్టానికి వ్యతిరేకంగా గర్భాన్ని కొనసాగించాలంటూ ఒక మహిళను మరీ ముఖ్యంగా మైనర్‌ను ఏ న్యాయస్థానం కూడా బలవంతం చేయలేదంటూ సుప్రీంకోర్టు పేర్కొంది. 15 ఏళ్ల బాలిక 7 నెలల గర్భాన్ని వైద్యపరంగా తొలగించుకునేందుకు జస్టిస్‌ బీవీ నాగరత్న, జస్టిస్‌ ఉజ్జల్‌ భుయాన్‌ల ధర్మాసనం అనుమతినిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ కేసులో సదరు బాలిక తన అవాంఛిత గర్భాన్ని కొనసాగించడం ఇష్టం లేక రెండు సార్లు ప్రాణాలు తీసుకునేందుకు ప్రయత్నించింది. ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణించిన ధర్మాసనం.. ‘ఇష్టం లేని గర్భాన్ని మోయమని బలవంతం చేయడమంటే రాజ్యాంగ హక్కులను ఉల్లంఘించడమే అవుతుంది. గర్భాన్ని కొనసాగించడం వల్ల సదరు బాలిక మానసిక ఆరోగ్యం, విద్యావకాశాలు, సామాజిక స్థితిగతులపైనా తీవ్ర ప్రభావం చూపుతుంది’ అని ఆందోళన వ్యక్తం చేసింది. ఏడో నెలలో గర్భవిచ్ఛిత్తి ప్రమాదకరమని, బిడ్డ పుట్టాక దత్తత ఇప్పించే ఏర్పాట్లు చేస్తామని కేంద్రం తరఫున సొలిసిటర్‌ జనరల్‌ తుషార్‌ మోహతా చెప్పారు. దీనిపై జస్టిస్‌ నాగరత్న ఘాటుగా స్పందించారు. బిడ్డను దత్తత ఇవ్వవచ్చనే కారణంతో ఓ మైనర్‌ను బిడ్డకు జన్మనివ్వమని ఎలా నిర్బంధిస్తారంటూ ప్రశ్నించారు.

Updated Date - Apr 25 , 2026 | 07:29 AM