Share News

kumaram bheem asifabad- ఎస్సీ, ఎస్టీల అభివృద్ధికి చేయూతనివ్వాలి

ABN , Publish Date - Jul 17 , 2026 | 10:45 PM

జిల్లాలో షెడ్యూల్డ్‌ కులాలు, షెడ్యూల్డ్‌ తెగల వారికి రాజ్యంగం కల్పించిన చట్టాల ప్రకారం అభివృద్ధికి అధికారులు చేయూతనివ్వాలని రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్‌ చైర్మన్‌ బక్కి వెంకటయ్య అన్నారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్‌లో శుక్రవారం ఎస్సీ, ఎస్టీలకు సంక్షేమ పథకాల అమలు, అట్రాసిటీ కేసులు, భూ సమస్యలు, ఆశ్రమ పాఠశాలలు, గురుకులలోని విద్యార్థులకు మెనూ ప్రకారం భోజనం, ఎస్సీ, ఎస్టీ గ్రామాలలో మౌలిక వసతుల కల్పనపై జిల్లా కలెక్టర్‌ కె హరిత, ఎస్పీ నితికా పంత్‌, అదనపు కలెక్టర్‌ డేవిడ్‌, డీఎఫ్‌వో బాలమణి, ఎమ్మెల్యే కోవ లక్ష్మి, ఎస్సీ, ఎస్టీ కమిషన్‌ సభ్యులు రేణిగుంట్ల ప్రవీణ్‌, రాంబాబు నాయక్‌, కుసుం నీలదేవిలతో కలిసి సమీక్ష సమావేశం నిర్వహించారు.

kumaram bheem asifabad- ఎస్సీ, ఎస్టీల అభివృద్ధికి చేయూతనివ్వాలి
మాట్లాడుతున్న రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్‌ చైర్మన్‌ బక్కి వెంకటయ్య, పాల్గొన్న అధికారులు, ప్రజాప్రతినిధులు

ఆసిఫాబాద్‌రూరల్‌, జూలై 17 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో షెడ్యూల్డ్‌ కులాలు, షెడ్యూల్డ్‌ తెగల వారికి రాజ్యంగం కల్పించిన చట్టాల ప్రకారం అభివృద్ధికి అధికారులు చేయూతనివ్వాలని రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్‌ చైర్మన్‌ బక్కి వెంకటయ్య అన్నారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్‌లో శుక్రవారం ఎస్సీ, ఎస్టీలకు సంక్షేమ పథకాల అమలు, అట్రాసిటీ కేసులు, భూ సమస్యలు, ఆశ్రమ పాఠశాలలు, గురుకులలోని విద్యార్థులకు మెనూ ప్రకారం భోజనం, ఎస్సీ, ఎస్టీ గ్రామాలలో మౌలిక వసతుల కల్పనపై జిల్లా కలెక్టర్‌ కె హరిత, ఎస్పీ నితికా పంత్‌, అదనపు కలెక్టర్‌ డేవిడ్‌, డీఎఫ్‌వో బాలమణి, ఎమ్మెల్యే కోవ లక్ష్మి, ఎస్సీ, ఎస్టీ కమిషన్‌ సభ్యులు రేణిగుంట్ల ప్రవీణ్‌, రాంబాబు నాయక్‌, కుసుం నీలదేవిలతో కలిసి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్‌ చైర్మన్‌ మాట్లాడుతూ జిల్లాలో 1,33,627 మంది షెడ్యూల్డ్‌ తెగలు, 81,596 మంది షెడ్యూల్డ్‌ కులాల వారు ఉన్నారని చెప్పారు. రాజ్యంగం కల్పించిన హక్కుల ప్రకారం సంక్షేమ పథకాలు వర్తించే విధంగా అధికారులు చర్యలు తీసుకోవాలని తెలిపారు. ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్‌ కింద రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసే నిధులను రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీ ఎమ్మెల్యేలకు ఎక్కువగా కేటాయించేలా చర్యలు తీసుకుంటామని బక్కి వెంకటయ్య అన్నారు. ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్‌ కింద గతేడాది రూ.600 కోట్లు మంజూరు చేశామని చెప్పారు. ఈ ఏడాది రూ. వేయి కోట్లు విడుదల చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తుందన్నారు. వీటిలో ఎక్కువగా ఎస్సీ, ఎస్టీ ప్రజాప్రతినిధులు ఉన్న నియోజకవర్గాలకు కేటాయించేలా చర్యలు తీసుకుంటామని వివరించారు. ప్రతినెల చివరి వారంలో గ్రామాల్లో సివిల్‌ రైట్స్‌ డేను నిర్వహించాలని సూచించారు. దీనికి ఎస్సై, తహసీల్దార్లు హాజరయ్యేలా చర్యలు తీసుకోవాలని చెప్పారు. దీని ద్వారా చట్టాలపై అవగాహన కలుగుతుందన్నారు. తనపై అనుచితంగా మాట్లాడడని ఎమ్మెల్యే కోవ లక్ష్మి చేసిన ఫిర్యాదు మేరకు జోడేఘాట్‌ రేంజ్‌ అధికారి రమేశ్‌ను ఈనెల 25న హైదరాబాద్‌లోని కమిషన్‌ కార్యాలయంలో హాజరు కావాలని ఆదేశించారు. వ్యవస్థకు విరుద్ధంగా అధికారులు పనిచేయాల్సిన అవసరంలేదని చెప్పారు. అదే సందర్భంలో వారికంటూ ఉన్న లక్ష్మణరేఖ దాటకూడదని సూచించారు. గ్రామాల్లో అభివృద్ధికి అటవీ అధికారులు అడ్డు తగులుతున్నారని ఫిర్యాదులు వస్తున్నాయని వివరించారు. అభివృద్ధికి ఆటంకంగా అధికారులు మారకూ డదన్నారు. అటవీ చట్టం ప్రకారం వ్యవహరించడంతో పాటు కొన్ని సందర్భాల్లో మానవతా దృక్పథంతో ప్రవర్తించాలన్నారు. ఎస్సీ, ఎస్టీలకు సంబందించి వివిధ శాఖలో పెండింగ్‌ పనులు వెంటనే పూర్తి చేయాలని సూచించారు. విజిలెన్స్‌ మానిటరింగ్‌ కమిటీ సభ్యులు హాస్టళ్లను సందర్శించి విద్యార్థులకు అందుతున్న వసతులను తెలుసుకోవాలని ఆదేశించారు. జిల్లాలో పలు అట్రాసిటీ కేసులు రద్దు చేయడానికి గల కారణాలను పోలీసులను అడిగి తెలుసుకున్నారు. కలెక్టర్‌ కె హరిత మాట్లాడుతూ ఎస్సీ, ఎస్టీ కమిషన్‌ చైర్మన్‌ జిల్లాలో పర్యటించడంతో కొన్ని సమస్యలు ఇక్కడే పరిష్కారం అవుతాయన్నారు. ఆలా పరిష్కారం కానీ సమస్యలను రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరించే అవకాశం ఉంటుందని తెలిపారు. జిల్లాలో అన్ని శాఖల ద్వారా కూడా ఎస్సీ, ఎస్టీల సంక్షేమం కోసం కృషి చేస్తున్నట్లు వివరించారు. ఎమ్మెల్యే కోవ లక్ష్మి మాట్లాడుతూ జిల్లాలో అటవీ అధికారులు అభివృద్ధికి అడ్డుతగులుతున్నారన్నారు. పలు గ్రామాలకు ఇప్పటికి రహదారి సౌకర్యాలు లేవని చెప్పారు. కనీసం రహదారి నిర్మించుకునే అవకాశం కల్పించుకునే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. గిరిజనేతరులపై పోడు సాగు విషయంలో ఇబ్బందులు పెడుతున్నారని అన్నారు. ప్రస్తుత సంవత్సరానికి వాటి జోలికి రాకుండా అధికారులను ఆదేశించాలని కోరారు. ఎస్పీ నితికా పంత్‌ మాట్లాడుతూ జిల్లాలోని ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసుల పట్ల ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. జిల్లా అటవీశాఖ అధికారి బాలామణి మాట్లాడుతూ ఆర్‌వోఎఫ్‌ఆర్‌ చట్టం ప్రకారం జిల్లాలోని అటవీశాఖ అధికారులు ప్రవర్తిస్తున్నారని అన్నారు. చట్టానికి లోబడి పని చేస్తున్నట్లు తెలిపారు. పోడు భూములకు సంబందించి పట్టాలు ఉన్నవాటి జోలికి వెళ్లడంలేదని తెలిపారు. సమావేశంలో డీఆర్వో వేణు, ఆర్డీవోలు లోకేశ్వర్‌రావు, కృష్ణయ్య, డీఎస్పీలు అశోక్‌, వహీదుద్దీన్‌, డీఆర్‌డీవో, ఆయా శాఖల అధికారులు పాల్గొన్నారు. అంతకు ముందు జిల్లా కేంద్రానికి వచ్చిన చైర్మన్‌కు కలెక్టర్‌ హరిత, ఎస్పీ నితికాపంత్‌, ఎమ్మెల్యే కోవ లక్ష్మితో పాటు ఇతర అధికారులు ఘనస్వాగతం పలికారు. అనంతరం పోలీసుల నుంచి గౌరవ వందనం స్వీకరించారు.

Updated Date - Jul 17 , 2026 | 10:45 PM