kumaram bheem asifabad- మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీని ఆదరించాలి
ABN , Publish Date - Feb 08 , 2026 | 12:01 AM
మున్సిపల్, కార్పొరేషన్ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్ధులకు పట్టం కట్టాలని, అప్పుడే గణనీయమైన అభివృద్ధి మచ్చలేని పాలన అందించేందుకు వీలు ఉంటుదని మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ అన్నారు. కాగజ్‌నగర్ ఎస్పీఎం క్రీడా మైదానంలో ఏర్పాటు చేసిన విజయ సంకల్ప సభలో ఆయన మాట్లాడారు.
- మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్
కాగజ్‌నగర్, ఫిబ్రవరి 7 (ఆంధ్రజ్యోతి): మున్సిపల్, కార్పొరేషన్ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్ధులకు పట్టం కట్టాలని, అప్పుడే గణనీయమైన అభివృద్ధి మచ్చలేని పాలన అందించేందుకు వీలు ఉంటుదని మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ అన్నారు. కాగజ్‌నగర్ ఎస్పీఎం క్రీడా మైదానంలో ఏర్పాటు చేసిన విజయ సంకల్ప సభలో ఆయన మాట్లాడారు. ఇటీవల జరిగిన మహారాష్ట్ర కార్పొరేషన్, మేయర్, మున్సిపాల్టీల్లో బీజేపీ 80 శాతం స్థానాల్లో గెలిచిందన్నారు. ఇదీ కేవలం పధాని నరేంద్ర మోదీ చేపట్టిన సంక్షేమ పథకాలతోనే సాధ్యమైందన్నారు. తెలంగాణను బీఆర్‌ఎస్, కాంగ్రెస్ పార్టీలు దోచుకుని ధనిక రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టేశాయని అన్నారు. తెలంగాణలో ఇప్పటి వరకు జరిగిన అభివృద్ధి మొత్తం కేంద్ర ప్రభుత్వం అందించిన నిధులతోనే సాధ్యమైందన్నారు. కేంద్రం సహకారం లేకపోతే రాష్ట్రంలో మౌలిక వసతులు అసాధ్యమని చెప్పారు. బీజేపీ పాలిత ప్రాంతాల్లో గణనీయమైన అభివృద్ధి స్పష్టంగా కన్పిస్తోందని, పారదర్శకపాలనతో ప్రజలకు మేలు జరుగుతోందని తెలిపారు. బీఆర్‌ఎస్, కాంగ్రెస్ పార్టీలు అధికారంలో ఉన్న సమయంలో అవినీతి, అప్పులు పెరిగాయన్నారు. దీని భారాన్ని ప్రజలే మోస్తున్నారని చెప్పారు. దేశంలో 60 ఏళ్లలో జరుగని అభివృద్ధిని ప్రధాన మంత్రి కేవలం 15 ఏళ్లలోనే చేసి చూపారని అన్నారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఉద్యోగులు, ఉపాధ్యాయులు, రిటైర్డ్ ఉద్యోగులకు సమయానికి వేతనాలు, పెన్షన్లు, ఇతర బెనిఫిట్స్ అందుతున్నాయని వివరించారు. కమిషన్ల కాంగ్రెస్ పాలనతో ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు నలిగి పోతున్నారని చెప్పారు. ఇది కాంగ్రెస్ ప్రభుత్వ అసమర్థతకు నిదర్శనమని విమర్శించారు. ప్రధాని నరేంద్ర మోదీ పట్టణాలతో పాటు గ్రామాల అభివృద్ధికి ప్రత్యేక పథకాలను అమలు చేస్తున్నారని తెలిపారు. పట్టణాలు అభివృద్ధి చెందాలంటే మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీని ఆదరించాలని విజ్ఞప్తి చేశారు. 2015లో అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్, అధికారులు తుమ్మిడిహెట్టి ప్రాజెక్టు నిర్మించాలనే ప్రతిపాదనతో తమ వద్దకు చర్చలు జరిపారని అన్నారు. దీనికి తాము అంగీకరించామని చెప్పారు. భూములు ముంపునకు గురైనా తెలంగాణ రాష్ట్రం నుంచి పరిహారం కూడా ఇవ్వలేదన్నారు. తాను అధికారంలోకి రాగానే మళ్లీ ఆ నిధులను ఇచ్చినట్టు వివరించారు. రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం పన్నుల పేరిట వసూళ్లకు పాల్పడుతోందని చెప్పారు. బీజేపీ పాలనలోనే అన్ని వర్గాల ప్రజలకు న్యాయం జరుగుతుందన్నారు. ఒక్కసారి అవకాశం ఇవ్వాలని కోరారు. తెలంగాణను బీఆర్‌ఎస్, కాంగ్రెస్ పార్టీలు దోచుకుని ధనిక రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టేశాయన్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు మాట్లాడుతూ ప్రస్తుతం సీఎం కేవలం ఒక వర్గానికి కొమ్ము కాస్తున్నారన్నారు. పట్టణాలు అభివృద్ధి చెందాలంటే బీజేపీని ఆదరించాలని కోరారు. ఎంపీ గెడెం నగేష్ మాట్లాడుతూ ప్రధాని చేపట్టిన సంక్షేమ పథకాలు పేదలకు ఎంతగానో ఉపయోకరంగా ఉన్నాయన్నారు. కాగజ్‌నగర్ రైల్వే స్టేషన్‌కు రూ.40 కోట్ల నిధులు విడుదలైనట్టు తెలిపారు. ఎమ్మెల్యే హరీష్‌బాబు మాట్లాడుతూ ఈ ప్రాంత సమస్యలపై తాను అసెంబ్లీలో ప్రశ్నిస్తున్నట్టు తెలిపారు. పీఎం మోదీ దీవెనతో నిధులు మంజూరవుతున్నాయని తెలిపారు. సమావేశంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు దోని శ్రీశైలం, మాజీ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ శ్రీనివాస్, నాయకులు తదితరులు పాల్గొన్నారు.