kumaram bheem asifabad- ఇక అంగన్‌వాడీల పర్యవేక్షణ
ABN , Publish Date - Jan 28 , 2026 | 11:06 PM
అంగన్‌వాడీ కేంద్రాల్లో అక్రమాలకు తావు లేకుండా పర్యవేక్షించే బాధ్యతలను సర్పంచ్‌లకు అప్పగించనున్నారు. రెండేళ్లపాటు సర్పంచ్‌లు లేక కమిటీలు నామమాత్రం గానే కొనసాగాయి. కానీ పలు చోట్ల కేంద్రాల టీచర్లు, సహాయకులు ఇష్టారాజ్యాంగా వ్యవహారిస్తున్నారని, పోహకాహారాన్ని పక్కదారి పట్టిస్తున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తాయి
వాంకిడి, జనవరి 28 (ఆంధ్రజ్యోతి): అంగన్‌వాడీ కేంద్రాల్లో అక్రమాలకు తావు లేకుండా పర్యవేక్షించే బాధ్యతలను సర్పంచ్‌లకు అప్పగించనున్నారు. రెండేళ్లపాటు సర్పంచ్‌లు లేక కమిటీలు నామమాత్రం గానే కొనసాగాయి. కానీ పలు చోట్ల కేంద్రాల టీచర్లు, సహాయకులు ఇష్టారాజ్యాంగా వ్యవహారిస్తున్నారని, పోహకాహారాన్ని పక్కదారి పట్టిస్తున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ క్రమంలోనే సర్పంచ్‌లు కొలువుదీ రడంతో నూతన పర్యవేక్షణ కమిటీల ఏర్పాటుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. అంగన్‌వాడీ స్థాయి పర్యవేక్షణ, సహాయ కమిటీ(ఏఎల్‌ఎంఎస్‌సీ) లను కొత్తగా ఎన్నికైన సర్పంచ్‌లతో పునర్నిర్మించేందుకు మహిళాశిశు సంక్షేమశాఖ కసరత్తు చేస్తోంది.
- పదకొండు మంది సభ్యులతో..
పదకొండు మంది సభ్యులతో ప్రభుత్వం కమిటీని ఏర్పాటు చేయనుంది. ఈ కమిటీకి సర్పంచ్ చైర్మన్‌గా అంగన్‌వాడీ టీచర్ కన్వీనర్‌గా, సైన్స్ బోధించే ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయుడు, విశాంత ఉద్యోగి, ఏఎన్‌ఎం, చిన్నారుల తల్లులు సభ్యులుగా ఉంటారు. జిల్లాలో 973 అంగన్‌వాడీ కేంద్రాలు ఉన్నాయి. వీటికి సర్పంచ్ చైర్మన్‌గా కమిటీలు ఏర్పాటు చేయాల్సి ఉంది. వీరు ప్రభుత్వం నుంచి సరఫరా అవుతున్న సరకులు ప్రతినెలా కేంద్రానికి సక్రమంగా చేరుతున్నాయో లేదో పర్యవేక్షిస్తారు. వాటి నాణ్యత పరిశీలిస్తారు. ఆరోగ్యలక్ష్మి పథకం ద్వారా గర్భిణులు, బాలింతలకు అందించే భోజనాన్ని పరిశీలించాల్సి ఉంటుంది. పిల్లలు, గర్భిణులు కేంద్రాలకు వచ్చే ప్రజలకు అవగాహన కల్పిస్తారు.
- లోపాలు గుర్తించి ఫిర్యాదు..
అంగన్‌వాడీ కేంద్రాలకు వచ్చే గర్భిణులు, బాలింతలు, చిన్నారుల కోసం స్త్రీ శిశు సంక్షేమశాఖ నుంచి ప్రతి నెలా రూ. లక్ష్లల్లో ఖర్చు చేసి వారికి పాలు, గుడ్లు, కందిపప్పు, బియ్యం, బాలామృతం తదితరాలను పోషకాహారంగా అందిస్తున్నారు. చాలా గ్రామాల్లో కేంద్రాల ద్వారా అవి లబ్ధిదారులకు పూర్తిస్థాయిలో అందడం లేదు. దీన్ని పర్యవేక్షణ కమిటీ గుర్తించి ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయాలి. ఇందుకు నెలకో సారి సమావేశాలు నిర్వహించడంతో పాటు దస్త్రంలో సంతకాలు చేయాల్సి ఉంటుంది. ఉన్నతాధికారుల ఆ దేశాల మెరకు కొత్త సర్పంచ్‌లతో అంగన్‌వాడీ స్థాయి పర్యవేక్షణ కమిటీ (ఏఎల్‌ఎంఎస్‌సీ)లను ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటామని జిల్లా సమగ్ర శిశుసంక్షేమ అధికారి భాస్కర్ తెలిపారు.
- జిల్లాలో అంగన్‌వాడీ కేంద్రాల వివరాలు..
అంగన్‌వాడీ కేంద్రాలు: 973
0-6 నెలల పిల్లలు: 3,457
7 నెలల నుంచి 3 ఏళ్లు : 20,357
3 నుంచి 6 ఏళ్లు: 20,100
గర్భిణులు: 4,600
బాలింతలు: 3,390