Share News

ముర్రు పాలను పారబోస్తున్నారు!

ABN , Publish Date - Feb 11 , 2026 | 02:14 AM

శిశువు జన్మించగానే ముర్రుపాలు పట్టాలి.. ఆరు నెలల దాకా తల్లి పాలు తప్ప మరేమీ తాగించకూడదు.. అనే వైద్యుల మాటలను మాతృమూర్తులు పెడచెవిన పెడుతున్నారు.

ముర్రు పాలను పారబోస్తున్నారు!

  • మూఢ నమ్మకాలతో పిల్లల పోషణకు ఎసరు.. పుట్టిన శిశువులకు తేనె, నీళ్లు ఇస్తున్న తల్లులు

  • పిల్లలు పెరగకపోవడానికి ఇదే ప్రధాన కారణం

  • కాళోజీ వర్సిటీ వైద్యుల అధ్యయనం

హైదరాబాద్‌, ఫిబ్రవరి 10 (ఆంధ్రజ్యోతి): శిశువు జన్మించగానే ముర్రుపాలు పట్టాలి.. ఆరు నెలల దాకా తల్లి పాలు తప్ప మరేమీ తాగించకూడదు.. అనే వైద్యుల మాటలను మాతృమూర్తులు పెడచెవిన పెడుతున్నారు. మూఽఢ నమ్మకాలతో బిడ్డల ఆరోగ్య భవిష్యత్తును దెబ్బతీస్తున్నారు. ముర్రుపాలను చేతులారా పారబోస్తున్నారు. బిడ్డకు సుస్తీ చేస్తే.. వారి నోటికి తాళం వేసి.. తిండిపెట్టడం మానేస్తున్నారు. ఇలాంటి అపోహల కారణంగానే పిల్లలు పోషకాహారలోపంతో బాధ పడుతున్నారని, ఎత్తుకు తగ్గ బరువు పెరగడం లేదని తాజా అధ్యయనంలో వెల్లడైంది. కాళోజీ నారాయణరావు ఆరోగ్య విశ్వవిద్యాలయంలోని చిన్నపిల్లల విభాగానికి చెందిన వైద్య బృందం చేసిన పరిశోధనలో విస్తుపోయే విషయాలు వెలుగులోకి వచ్చాయి. డాక్టర్‌ టి. సోలోమన్‌ సంపత్‌ (ప్రొఫెసర్‌, హెడ్‌ ఆఫ్‌ డిపార్ట్‌మెంట్‌), డాక్టర్‌ అస్మా ఫాతిమా (అసోసియేట్‌ ప్రొఫెసర్‌), డాక్టర్‌ అశోక్‌ గౌడ్‌ (అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌), డాక్టర్‌ కీర్తన అజిత్‌(పీజీ వైద్య విద్యార్థిని) కలిసి ‘‘భారతదేశంలో శిశు పోషణలో ఉన్న అపోహలు, నమ్మకాలు’’ అనే అంశంపై లోతైన పరిశోధన చేశారు. 2000- 2025 మధ్య దేశంలో పిల్లల పెంపకం, తల్లుల అలవాట్లపై వచ్చిన ప్రతి శాస్ర్తీయ అధ్యయనాన్ని క్షుణ్ణంగా పరిశీలించారు. ఇందుకోసం లక్షలాది మంది డేటాను స్టడీ చేశారు. ఇందులో నేషనల్‌ ఫ్యామిలీ హెల్త్‌ సర్వే-5, యూనిసెఫ్‌, ప్రపంచ ఆరోగ్య సంస్థ నివేదికలను ప్రామాణికంగా తీసుకుని విశ్లేషించారు. దేశవ్యాప్తంగా లక్షలాది మంది తల్లుల నుంచి సేకరించిన సమాచారాన్ని సేకరించారు. ఈ వివరాలను ‘ఇంటర్నేషనల్‌ జర్నల్‌ ఫర్‌ మల్టీడిసిప్లినరీ రీసెర్చ్‌’ జనవరి 2026 సంచికలో పబ్లిష్‌ చేసింది.

ప్రధాన అపోహలు ఇవే

బిడ్డ పుట్టిన వెంటనే తల్లి ఇచ్చే ముర్రు పాలు శిశువుకు తొలి టీకాలా పని చేస్తాయి. కానీ, ఈ పాలు చెడ్డవనీ, జీర్ణం కావని, చీము పాలని భావించి చాలామంది తల్లులు వాటిని పారబోస్తున్నారు. దీంతో పుట్టిన బిడ్డకు రక్షణ కవచం లేకుండా పోతుంది. ఒక రకంగా నవజాతశిశువుకు లభించే అమృతాన్ని పారబోస్తున్నారు. అలాగే ముర్రుపాలకు ముందే తేనె, నెయ్యి లేదా నీళ్లను శిశువు పెదాలకు అద్దుతున్నారు. ఇలా చేయడం వల్ల అప్పుడే పుట్టిన బిడ్డ పేగుల్లో ఇన్ఫెక్షన్లు చేరి, విరోచనాలు అవుతున్నాయని, తల్లి పాలు తాగే ఆసక్తి తగ్గుతోందని స్టడీ తేల్చింది. ఆరు నెలలు నిండకముందే ఆవు పాలు, డబ్బా పాలు, నీళ్లు తాపుతున్నారు. దీని వల్ల బిడ్డ బరువు తగ్గిపోతుందని అధ్యయనంలో గుర్తించారు. ఇక, జ్వరం వస్తే పిల్లలను ఉపవాసం ఉంచుతున్నారు. పిల్లలకు జ్వరం, దగ్గు, విరోచనాలు అయినప్పుడు.. పాలు ఇవ్వడం, అన్నం పెట్టడం ఆపేస్తున్నారు. ‘‘పాలు ఇస్తే కఫం పెరుగుతుంది’’, ‘‘గుడ్డు పెడితే వేడి చేస్తుంది’’ అని బిడ్డను పస్తులు ఉంచుతున్నారు. అయితే, సుస్తీ చేసినప్పుడే శిశువుకు ఎక్కువ శక్తి కావాలని, ఆహారం ఆపేయడంతో పిల్లలు నీరసించిపోతున్నారని ఈ అధ్యయనం విశ్లేషించింది.


పిల్లల ఆరోగ్యంపై పెనుప్రభావం

ఈ మూఢనమ్మకాల వల్ల పిల్లల్లో ఎదుగుదల లోపం నెలకొంటుందని కాళోజీ హెల్త్‌ వర్సిటీ వైద్య బృందం వివరించింది. దేశంలో 35శాతం మంది పిల్లలు వయస్సుకు తగ్గ ఎత్తు పెరగట్లేదని, 32 శాతం మంది పిల్లలు ఉండాల్సిన బరువు కంటే తక్కువ ఉన్నారని వెల్లడించింది. గుడ్లు, పాలు, ఆకుకూరలు పెట్టకపోవడం వల్ల 58శాతం మంది పిల్లల్లో రక్తం తక్కువగా ఉందని తెలిపింది. బిడ్డకు తల్లి పాలు ఇవ్వాలంటే కేవలం తల్లికి చెప్తే సరిపోదని, ఇంట్లో పెత్తనం చేసే అత్తమామలకు, అమ్మమ్మలకు, భర్తలకు కౌన్సెలింగ్‌ ఇవ్వాలని, ఈ మూఢ నమ్మకాలు పాటించకుండా ఇంటింటా ఆశ కార్యకర్తలు, అంగన్‌వాడీ టీచర్లు అవగాహన కల్పించాలని కోరింది.

Updated Date - Feb 11 , 2026 | 02:14 AM