kumaram bheem asifabad- ఇంటిపై సౌరకాంతులు
ABN , Publish Date - Oct 11 , 2026 | 10:35 PM
వినియోగదారులకు విద్యుత్ బిల్లుల భారం తగ్గించేలా కేంద్ర ప్రభుత్వం పీఎం సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజన పథకం ప్రవేశ పెట్టింది. ఈ పథకంలో రాయితీ సదుపాయాన్ని కల్పించింది. ఈ పథకంతో వినియోగదారులకు ఆదాయంతో పాటు విద్యుత్తు పంపిణీ సంస్థలపై భారం తగ్గుతుంది. జిల్లా వ్యాప్తంగా సోలార్ సిస్టం ద్వారా విద్యుత్తు ఉత్పత్తి చేసేలా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.
- అవగాహన కల్పిస్తున్న అధికారులు
- జిల్లా వ్యాప్తంగా 330 సోలార్ కనెక్షన్స్
- ఉచిత విద్యుత్తుతో పాటు ఆదాయం
కాగజ్‌నగర్ టౌన్, అక్టోబరు 11 (ఆంధ్రజ్యోతి): వినియోగదారులకు విద్యుత్ బిల్లుల భారం తగ్గించేలా కేంద్ర ప్రభుత్వం పీఎం సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజన పథకం ప్రవేశ పెట్టింది. ఈ పథకంలో రాయితీ సదుపాయాన్ని కల్పించింది. ఈ పథకంతో వినియోగదారులకు ఆదాయంతో పాటు విద్యుత్తు పంపిణీ సంస్థలపై భారం తగ్గుతుంది. జిల్లా వ్యాప్తంగా సోలార్ సిస్టం ద్వారా విద్యుత్తు ఉత్పత్తి చేసేలా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ఇందులో భాగంగా డివిజన్‌ల వారీగా అవగాహన కల్పిస్తున్నారు. ఇప్పటికే చాలామంది విద్యుత్తు ఉత్పత్తి కోసం సోలార్ ప్లేట్స్‌ను ఏర్పాటు చేసుకొని మిగులు విద్యుత్తు నుంచి ఆదాయం పొందుతున్నారు. ఇందులో భాగంగా సోలార్ సేవా సేతు పేరిట ఈనెల 1 నుంచి 3 వరకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు.
అవగాహన కల్పించడంతో..
జిల్లా వ్యాప్తంగా సోలార్ విద్యుత్తుపై అవగాహన కల్పిస్తుండడంతో మంచి ఆదరణ లభిస్తోందని అధికారులు తెలిపారు. ఇప్పటికే జిల్లాలో 330 సోలార్ విద్యుత్ కనెక్షన్స్‌ను వినియోగదారులు అమర్చుకున్నారని ప్రకటించారు. కాగజ్‌నగర్ డివిజన్ కార్యాలయంతో పాటు జిల్లాలో సోలార్ విద్యుత్తు వాడకంపై కలిగే ప్రయోజనాలు, తదితర విషయాలు, వాటి ప్రత్యేకతలు, ప్రయోజనాలపై శిబిరాలు ఏర్పాటు చేసి అవగాహన కల్పిస్తున్నారు. జిల్లాలోని ఆసిఫాబాద్ డివిజన్‌లో 121 సోలార్ కనెక్షన్స్ (782కిలో వాట్స్), కాగజ్‌నగర్ డివిజన్‌లో 209 కనెక్షన్స్ (1264 కె.వా) ఏర్పాటు అయ్యాయి. దీంతో నెల వారీగా కాగజ్‌నగర్‌లో 76,284, ఆసిఫాబాద్‌లో 72,998 యూనిట్ల విద్యుత్ ఉత్పత్తి జరుగుతోందని అధికారులు తెలిపారు. ఆయా యూనిట్లకు లక్షలాది రూపాయలు వినియోగదా రులకు ఆదాయంగా లభిస్తోంది. ఇంకా వినియోగదారులు ముందుకు వచ్చినట్లయితే ఆయా బ్యాంకర్లు రుణాలు ఇవ్వనున్నారు. దీంతో సోలార్ విద్యుత్ వాడకం పెరుగుతుంది. తద్వారా వినియోగదారులు, ప్రభుత్వంతో పాటు విద్యుత్ సంస్థలపై భారం తగ్గుతుంది.
పథకంలో భాగంగా..
పీఎం సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ పథకం కింద కేంద్ర ప్రభుత్వం 1 కిలో వాట్‌కు రూ. 30 వేలు, 2 కిలో వాట్‌కు రూ. 60 వేలు 3 కిలో వాట్‌కు గరిష్టంగా రూ. 78 వేలు రాయితీ ఇస్తోందని అఽధికారులు తెలిపారు. పీఎం సూర్య ఘర్ ముఫ్త్ బిజిలీ కింద మిగులు విద్యుత్తుకు కిలో వాట్‌కు రూ. 436, 2 కిలో వాట్‌కు రూ. 1328, 3 కిలో వాట్‌కు రూ. 2300 ఆదాయం రానుంది. నెట్ మీటరింగ్ ద్వారా వినియోగదారులు ఎంత విద్యుత్తు వినియోగించుకున్నారు, మిగులు విద్యుత్తు ఎన్ని యూనిట్లు ఉందని తెలియజేస్తుంది. రోట్ మీటరింగ్ ద్వారా వినియోగదారులు మిగులు యూనిట్‌కు రూ. 2.75 ఎన్‌పీడిసీఎల్ చెల్లిస్తుంది.
సద్వినియోగం చేసుకోవాలి
-ఉత్తమ్ జాడె, ఎస్‌ఈ,
ప్రజలు సద్వినియోగం చేసుకోఆలి పీఎం సూర్యఘర్ సేవా సేతుపై అక్టోబరు 1 నుంచి 3 వరకు మూడు రోజుల పాటు కాగజ్‌నగర్ డివిజన్ ఆఫీస్ ఆవరణలో అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేశాం. వినియోగదారుల రిజిస్ట్రేషన్ ప్రక్రియ చేపట్టాం. ఈ అవకాశాన్ని ప్రతీ ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలి. కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన పీఎం సూర్య ఘర్ ముఫ్త్ బిజిలీ పథకం ద్వారా వినియోగదారులకు ఉచిత విద్యుత్తు సదుపాయంతో పాటు ఆదాయం లభిస్తుంది. సౌర విద్యుత్తు వినియోగదారుల వలన ఎన్‌పీడీసీఎల్‌పై భారం తగ్గుతుంది.