Share News

బాబోయ్‌ ‘సన్‌’ స్ట్రోక్!

ABN , Publish Date - May 18 , 2026 | 03:32 AM

మండు వేసవి కదా.. ఎండల్లో తిరిగితే సన్‌స్ట్రోక్‌ (వడదెబ్బ) బారినపడి తీవ్ర ఆరోగ్య సమస్యలతో ఇబ్బందులు పడాల్సి వస్తుంది. మాడుపగిలేలా దంచుతున్న ఈ ఎండల్లో ఇంటి గడపదాటి...

బాబోయ్‌ ‘సన్‌’ స్ట్రోక్!

  • కుమారుల కారణంగా రాజకీయ నేతలకు తలనొప్పులు

హైదరాబాద్‌, మే 17 (ఆంధ్రజ్యోతి): మండు వేసవి కదా.. ఎండల్లో తిరిగితే సన్‌స్ట్రోక్‌ (వడదెబ్బ) బారినపడి తీవ్ర ఆరోగ్య సమస్యలతో ఇబ్బందులు పడాల్సి వస్తుంది. మాడుపగిలేలా దంచుతున్న ఈ ఎండల్లో ఇంటి గడపదాటి బయటకు వెళ్లకపోతే సమస్యే ఉండదు! మరి.. ఎండలకు సంబంధం లేకుండానే ‘సన్‌’ స్ట్రోక్‌ బారినపడితే? అదెంతటి శరాఘాతమనేది కొందరు రాజకీయ నేతలకు బాగా తెలుసు! ఒక్కో ఇటుక పేర్చి ఆకాశహార్మ్యం నిర్మించుకున్నట్లుగా రాజకీయాల్లో క్షేత్రస్థాయి నుంచి అంచెలంచెలుగా అత్యున్నత స్థాయికి ఎదిగిన నేతల్లో కొందరు ఒక్కసారిగా తగిలిన ‘సన్‌’ స్ట్రోక్‌తో తల పట్టుకుంటున్నారు. అప్పటిదాకా ప్రజల్లో ఉన్న ఆదరణ, రాజకీయపరంగా అత్యున్నత హోదా, పరపతి అంతా కూడా తనయుల కారణంగా రాత్రికిరాత్రే ప్రమాదంలో పడిన నేతలు ఉన్నారు. ఇటీవల కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌ కుమారుడిపై పోక్సో కేసు నమోదు కావడంతో గతంలో పలువురు నేతలకు రాజకీయంగా తగిలిన ‘సన్‌’ స్ట్రోక్‌లు రాజకీయ వర్గాల్లో చర్చకు వస్తున్నాయి.

  • ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుగా ఉన్న కె. కేశవరావు (కేకే) ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్‌ పార్టీ రాజకీయాల్లో చక్రం తిప్పిన ముఖ్య నాయకుల్లో ఒకరు. కేకే పీసీసీ చీఫ్‌గా ఉన్న రోజుల్లో అంటే 2007లో ఆయనకు ‘సన్‌’ స్ట్రోక్‌ తగిలింది. ఆ ఏడాది సెప్టెంబరు 9న కేకే కుమారుడు వెంకట్‌ నివాసంలో ఆయన వ్యాపార భాగస్వామి అయిన ప్రశాంత్‌, బుల్లెట్‌ గాయాలతో మృతిచెందారు. అది ఆత్మహత్యేనని వెంకట్‌ కుటుంబసభ్యులు వాదించగా, హత్యేనంటూ ప్రశాంత్‌ తరఫువారు ఆరోపించారు. ఈ ఘటన అప్పట్లో తెలుగునాట సంచలనమైంది. ఫలితంగా కేశవరావు పీసీసీ చీఫ్‌ పదవికి రాజీనామా చేయాల్సి వచ్చింది.

  • ఉమ్మడి రాష్ట్రంలో పీసీసీ అధ్యక్షుడిగా రెండుసార్లు పనిచేసిన ధర్మపురి శ్రీనివాస్‌ కూడా ‘సన్‌’స్ట్రోక్‌ బాధితులే! ఆయన కుమారుడు ధర్మపురి సంజయ్‌పైన 2018లో లైంగిక వేధింపులు, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు నమోదయ్యాయి. ఈ కేసుల్లో సంజయ్‌ అరెస్టయ్యారు. ఒకానొక దశలో సీఎం పోస్టుకూ పోటీ పడిన ధర్మపురి శ్రీనివాస్‌ రాజకీయ జీవితం.. కుమారుడిపై నమోదైన కేసు కారణంగా కొంత ఒడిదుడుకులకు లోనైందన్న అభిప్రాయాలు ఉన్నాయి. సంజయ్‌పై ఆరోపణలకు సంబంధించిన కేసుల్లో సరైన సాక్ష్యాలు లేకపోవడంతో 2020లో న్యాయస్థానం కొట్టివేసింది.


  • రాష్ట్రంలో సంచలనం సృష్టించిన కేసుల్లో మాజీ ఎంపీ సిరిసిల్ల రాజయ్య కోడలు సారిక, ఆమె ముగ్గురు కుమారులు తీవ్ర అనుమానాస్పద స్థితిలో దుర్మరణం పాలైన కేసూ ఒకటి! 2015లో సిరిసిల్ల రాజయ్య నివాసంలో వారు సజీవ దహనమయ్యారు. అప్పటికే సారిక, తన భర్త అనిల్‌ కుమార్‌ వేధిస్తున్నాడంటూ పోలీసు కేసు పెట్టింది. ఈ క్రమంలో రాజయ్య కొడుకు, అనిలే భార్య సారికను, ముగ్గురు పిల్లలను హత్య చేశాడని సారిక కుటుంబసభ్యులు ఆరోపించారు. ఈ ఘటనకు కొన్నిరోజుల ముందే వరంగల్‌ లోక్‌సభ ఉప ఎన్నికలో కాంగ్రెస్‌ అభ్యర్థిగా రాజయ్య పేరును పార్టీ అధిష్ఠానం ప్రకటించింది. ఈ ఘటన తర్వాత ఆయన టికెట్‌ను రద్దు చేసి.. సర్వే సత్యనారాయణను ప్రకటించింది.

  • ‘సన్‌’ స్ట్రోక్‌ తగిలిన వారిలో బీఆర్‌ఎస్‌ మాజీ ఎమ్మెల్యే మహమ్మద్‌ షకీల్‌ కూడా ఉన్నారు. ఆయన కుమారుడు రహీల్‌ అమీర్‌.. 2022లో జూబ్లీహిల్స్‌లో నిర్లక్ష్యంగా కారు నడిపి ఓ మహిళ, ఆమె బిడ్డను ఢీ కొట్టాడన్న కేసులో విచారణను ఎదుర్కొంటున్నాడు. నాటి కారు ప్రమాదంలో ఆ మహిళ బిడ్డ మృతిచెందారు. నిర్లక్ష్యంగా కారు నడిపి ప్రగతి భవన్‌ వద్ద ప్రమాదానికి కారణమయ్యాడనే మరో కేసునూ అమీర్‌ ఎదుర్కొంటున్నాడు.

  • బీఆర్‌ఎస్ మాజీ ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వర్‌రావుకు కూడా ‘సన్‌’ స్ట్రోక్‌ గట్టిగానే తగిలింది. జనవరి 3, 2022లో కొత్తగూడెం జిల్లా పాల్వంచకు చెందిన వ్యాపారి తన భార్య, పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్నాడు. తమ మరణానికి కారణం వనమా వెంకటేశ్వర్‌రావు కుమారుడు వనమా రాఘవేంద్ర అంటూ ఓ సెల్ఫీ వీడియో సందేశాన్ని, సూసైడ్‌ నోట్‌ను ఆ వ్యాపారి విడుదల చేశాడు. ఈ కేసు అప్పట్లో రాష్ట్రంలో సంచలనం సృష్టించింది. రాఘవేంద్రను పోలీసులు అరెస్టు చేసినా, అతడిని బీఆర్‌ఎస్‌ పార్టీ నుంచి సస్పెండ్‌ చేసినా.. వనమాకు జరగాల్సిన రాజకీయ నష్టం జరిగి పోయింది.

  • హా మార్చి 28, 2022లో జూబ్లీహిల్స్‌ పెద్దమ్మగుడి వద్ద ఓ మైనర్‌ బాలికపై గ్యాంగ్‌ రేప్‌ జరిగిందన్న ఆరోపణలపై ఓ ఆరుగురు బాలురపై పోక్సో కేసు నమోదైంది. అయితే ఆరోపణలు ఎదుర్కొంటున్నవారిలో మజ్లిస్‌, బీఆర్‌ఎస్‌ పార్టీల ప్రజాప్రతినిధుల పిల్లలూ ఉన్నారంటూ అప్పట్లో పెద్ద ఎత్తున చర్చ జరిగింది. ఈ కేసు.. ఆయా పిల్లల తల్లిదండ్రుల రాజకీయ జీవితంపై ప్రభావం చూపింది.

Updated Date - May 18 , 2026 | 03:32 AM