kumaram bheem asifabad- ఎండాకాలం.. జీవాలు పైలం
ABN , Publish Date - Apr 02 , 2026 | 10:28 PM
ప్రస్తుతం వేసవి ఉష్ణోగ్రతలు అధికంగా నమో దవుతున్నాయి. ఎండల తీవ్రత, వడగాలుల కారణం గా పశువులు అనారోగ్యానికి గురయ్యే అవకాశం ఉంటుంది. పెంపకం దారులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని పశువైద్యాధికారులు సూచిస్తున్నారు.
- చల్లటి ప్రాంతాల్లో ఉంచేలా ఏర్పాట్లు చేయాలి
- వడదెబ్బ నుంచి రక్షణ కల్పించాలి
ప్రస్తుతం వేసవి ఉష్ణోగ్రతలు అధికంగా నమో దవుతున్నాయి. ఎండల తీవ్రత, వడగాలుల కారణం గా పశువులు అనారోగ్యానికి గురయ్యే అవకాశం ఉంటుంది. పెంపకం దారులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని పశువైద్యాధికారులు సూచిస్తున్నారు.
బెజ్జూరు, ఏప్రిల్ 2 (ఆంధ్రజ్యోతి): వేసవిలో మనుషులే కాదు మూగజీవాలు కూడా వడదెబ్బకు గురవుతుంటాయి. ఎండలవేళ పశుపోషణలో జాగ్ర త్తలు పాటించకపోతే వాటి ప్రాణానికి ప్రమాదమే. యజమానులకు నష్టమే మిగులుతుంది. అధిక ఉష్ణోగ్రతలు, గాలి ప్రసరణ సరిగా లేకపోవడం, పాకల్లో అధిక సంఖ్యలో జీవాలను కిక్కిరిసి ఉంచడం, నీళ్లు అందుబాటులో లేకపోవడం వల్ల పశువులు, గొర్రెలు, మేకలు వడదెబ్బకు గురవుతాయి. వడదెబ్బకు గురైన పశువులు క్రమంగా నీరసించి బలహీనంగా మారుతాయి. వాటి చర్మం పొడిబారుతుంది. పశువులు సరిగా నడవలేక తూలుతూ ఉంటాయి. జీవక్రియ తగ్గిపోయి ఆకలి మందగిస్తుంది. దీంతో ఆహారం తక్కువగా తీసుకుంటాయి. పశువులు ఎదకు రాకపోగా చూడికట్టే అవకాశాలు తగ్గిపోతాయి. రోగనిరోదక శక్తి తగ్గడం వల్ల ఇతర వ్యాధులు, పరాన్న జీవులు ఆశించే అవకాశం ఉంటుంది. చూడి పశువుల్లో గర్భస్రావాలు సంభవిస్తాయి. ఎండవేడిమికి దాణ సరిగా తినకపోవడం మూలంగా పాల దిగుబడి తగ్గిపోతుంది. ఎండ నుంచి రక్షించుకుంటేనే పాడి పోషణ లాభదాయకంగా ఉంటుంది.
- పాకల్లో చల్లదనం కోసం..
పశువుల పాకల్లో పైకప్పులకు తెల్లరంగు వేసి ఆపై గడ్డి, తాటి, కొబ్బరి వంటి ఆకుల్ని పరచడం లాంటి చర్యల ద్వారా ఎండవేడి షెడ్లలోకి ఎక్కువగా ప్రవేశించకుండా చూడవచ్చు. మధ్యాహ్న సమయంలో పాకల చుట్టూ గోతాలు, పరదాలు వేలాడదీసి తరచు నీటితో తడపడం మంచిది. అత్యధిక పాలిచ్చే సంకరజాతి ఆవులు, ముర్రా గేదెలకు ప్యాన్లను ఏర్పాటు చేయడం ఎంతో అవసరం. పశువుల పాకలను ఎప్పటికప్పుడు శుభ్రం చేస్తూ గాలి దారాళంగా ప్రసరించే విధంగా చూడాలి. పశులును రోజుకు రెండు, మూడుసార్లు చల్లని నీటితో కడగాలి. కాగా వేసవిలో పశువులకు అందించే మేత, దాణాలో జాగ్రత్తలు పాటిస్తేనే పాడిపోషణ లాభదాయకంగా ఉంటుంది. ఉదయం, సాయంత్రం వేళల్లో మేతకు తీసుకెళ్లాలి. వేసవి తాపంతో పశువుల్లో జీర్ణక్రియ మందగిస్తుంది. అందువల్ల సులువుగా జీర్ణించుకునే పిండి పదార్థాలైన గంజి, జావ లాంటివి అందించాలి. ఎక్కువ శాతం పచ్చిగడ్డి అందించాలి. మాగుడు గడ్డి ఉంటే సంవృద్ధిగా అందించాలి. పచ్చిగడ్డిని ఉదయం, ఎండు గడ్డిని రాత్రి సమయాల్లో కత్తిరించి ఇవ్వాలి. అధిక పాలు ఇచ్చే పశువులకు దాణాలో నీటిని కలిపి ఇవ్వాలి. మినరల్ మిక్చర్, ఉప్పు కలిపిన ద్రావణం ఇవ్వడం మరీ మంచిది. అలాగే పశువుల్లో తాగునీటి అవసరాలు రెట్టింపవుతాయి. చల్లని శుభ్రమైన నీటిని పశువులకు ఎప్పుడూ అందుబాటులో ఉంచాలి. నీటితొట్లను నీడలో ఉంచాలి. సాధ్యమైనంతవరకు ఎక్కువ నీళ్లు తాగేలా చూడాలి.
- వడదెబ్బ లక్షణాలు..
వడదెబ్బకు గురైన పశువుల్లో నాలుక బయట పెట్టడం, నీరు తాగకపోవడం, మేత తినకపోవడం, మూత్ర విసర్జన ఆగిపోవడం లాంటి లక్షణాలు కనిపిస్తాయి. ముట్టెపై చెమట లేకపోవడం,కళ్లల్లో ఎర్రటి దారలు, నెమరు వేయకపోవడం తదితర లక్షణాలు ఉంటాయి. ఈ లక్షణాలు పశువుల్లో కనిపించిన వెంటనే ఉప్పు, బెల్లం కలిపిన ద్రావణం తాగించాలి. నిత్యం నాలుగైదు సార్లు చల్లని నీటిని తాగించాలి. పశు వైద్యుడి సహాయంతో చికిత్స అందించాలి. అలాగే ఎండాకాలంలో పశువుల్లో వ్యాది నిరోదక శక్తి తగ్గుతుంది. దీంతో పశువులు సులువుగా జబ్బుల బారిన పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. గొంతు. జబ్బవాపు, గాలికుంటు వంటి వ్యాధులు రాకుండా టీకా ఇప్పించాలి. అంతర, పరాన్న జీవుల నిర్మూళనకు నట్టల మందులు తాగించాలి.