kumaram bheem asifabad- మూగ జీవాలకు వేసవి ముప్పు
ABN , Publish Date - May 06 , 2026 | 11:28 PM
వేసవిలో మనుషులే కాదు మూగజీవాలు కూడా వడదెబ్బకు గురవుతుంటాయి. ఎండలవేళ పశుపోషణలో మెళకువలు పాటించకపోతే వాటి ప్రాణానికి ప్రమాదమే. యజమానులకు నష్టమే మిగులుతుంది. అధిక ఉష్ణోగ్రతలు, గాలి ప్రసరణ సరిగా లేకపోవడం, పాకల్లో అధిక సంఖ్యలో జీవాలను కిక్కిరిసి ఉంచడం, నీళ్లు అందుబాటులో లేకపోవడం వల్ల పశువులు, గొర్రెలు, మేకలు వడదెబ్బకు గురవుతాయి.
జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యుల సూచన
- జిల్లాలో 7.52 లక్షల పశుసంపద
ఆసిఫాబాద్, మే 6 (ఆంధ్రజ్యోతి): వేసవిలో మనుషులే కాదు మూగజీవాలు కూడా వడదెబ్బకు గురవుతుంటాయి. ఎండలవేళ పశుపోషణలో మెళకువలు పాటించకపోతే వాటి ప్రాణానికి ప్రమాదమే. యజమానులకు నష్టమే మిగులుతుంది. అధిక ఉష్ణోగ్రతలు, గాలి ప్రసరణ సరిగా లేకపోవడం, పాకల్లో అధిక సంఖ్యలో జీవాలను కిక్కిరిసి ఉంచడం, నీళ్లు అందుబాటులో లేకపోవడం వల్ల పశువులు, గొర్రెలు, మేకలు వడదెబ్బకు గురవుతాయి. వడదెబ్బకు గురైన పశువులు క్రమంగా నీరసించి బలహీనంగా మారుతాయి. వాటి చర్మం పొడిబారుతుంది. పశువులు సరిగా నడవలేక తూలుతూ ఉంటాయి. జీవక్రియ తగ్గిపోయి ఆకలి మందగిస్తుంది. దీంతో ఆహారం తక్కువగా తీసుకుంటాయి. పశువులు ఎదకు రాకపోగా చూడికట్టే అవకాశాలు తగ్గిపోతాయి. రోగనిరోధక శక్తి తగ్గడం వల్ల ఇతర వ్యాదులు, పరాన్న జీవులు ఆశించే అవకాశం ఉంటుంది. చూడి పశువుల్లో గర్భస్రావాలు సంభవిస్తాయి. ఎండవేడిమికి దాణ సరిగా తినకపోవడం మూలంగా పాల దిగుబడి తగ్గిపోతుంది. ఎండ నుంచి పశువులను రక్షించుకుంటేనే పాడి పోషణ లాభదాయకంగా ఉంటుంది.
- జిల్లా వ్యాప్తంగా..
జిల్లా వ్యాప్తంగా 15మండలాల పరిధిలో మొత్తం ఆవులు,ఎడ్లు 2,32,402, బర్రెలు ( గేదెలు) 41,538, గొర్రెలు 1,66,392, మేకలు3, 11,708, పందులు 374, కుక్కలు 856, ఇతర జంతువులు, పశువులు ఉన్నాయి. పశువుల పాకల్లో పైకప్పులకు తెల్లరంగు వేసి ఆపై గడ్డి, తాటి, కొబ్బరి వంటి ఆకుల్ని పరచడం లాంటి చర్యల ద్వారా ఎండవేడి షెడ్లలోకి ఎక్కువగా ప్రవేశించకుండా చూడవచ్చు. మధ్యాహ్న సమయంలో పాకల చుట్టూ గోతాలు, పరదాలు వేలాడదీసి తరుచూ నీటితో తడపడం మంచిది. అత్యధిక పాలిచ్చే సంకరజాతి ఆవులు, ముర్రా గేదెలకు ప్యాన్లను ఏర్పాటు చేయడం ఎంతో అవసరం. పశువుల పాకలను ఎప్పటికప్పుడు శుభ్రం చేస్తూ గాలి దారాళంగా ప్రసరించే విధంగా చూడాలి. పశువులను రోజుకు రెండు, మూడుసార్లు చల్లని నీటితో కడగాలి.
- మెళకువలు పాటించాలి..
వేసవిలో పశువులకు అందించే మేత, దాణాలో మెళకువలు పాటిస్తేనే పాడిపోషణ లాభదాయకంగా ఉంటుంది. ఉదయం, సాయంత్రం వేళల్లో మేతకు తీసుకెళ్లాలి. వేసవి తాపంతో పశువుల్లో జీర్ణక్రియ మందగిస్తుంది. అందువల్ల సులువుగా జీర్ణించుకునే పిండి పదార్థాలైన గంజి, జావ లాంటివి అందించాలి. ఎక్కువ శాతం పచ్చిగడ్డి అందించాలి. మాగుడు గడ్డి ఉంటే సంవృద్ధిగా అందించాలి. పచ్చిగడ్డిని ఉదయం, ఎండు గడ్డిని రాత్రి సమయాల్లో కత్తిరించి ఇవ్వాలి. అధిక పాలు ఇచ్చే పశువులకు దాణాలో నీటిని కలిపి ఇవ్వాలి. మినరల్ మిక్చర్, ఉప్పు కలిపిన ద్రావణం ఇవ్వడం మరీ మంచిది. అలాగే పశువుల్లో తాగునీటి అవసరాలు రెట్టింపవుతాయి. చల్లని శుభ్రమైన నీటిని పశువులకు ఎప్పుడూ అందుబాటులో ఉంచాలి. నీటితొట్లను నీడలో ఉంచాలి. సాధ్యమైనంతవరకు ఎక్కువ నీళ్లు తాగేలా చూడాలి.
వడదెబ్బ లక్షణాలు..
-వడదెబ్బకు గురైన పశువులు క్రమంగా నీరసించి,బలహీనంగా మారతాయి
-పశువులు సరిగ్గా నడవలేక తూలుతూ పడుకోవడానికి ప్రయత్నిస్థాయి
-జీవక్రియ తగ్గిపోవడం.ఆకలి మందగించడం, ఆహరం తక్కువగా తీసుకోవడం వలన ఉత్పత్తి గణనీయంగా తగ్గిపోతుంది
-వ్యాధి నిరోధక శక్తి తగ్గటం వలన ఇతర వ్యాధులు,పరాన్నజీవులు ఆశించే అవకాశం పెరుగుతుంది.
- కొన్ని సమయాల్లో దాహంతో ఉన్న పశు వులు, మురికి గుంటల్లో ఉన్న నీటిని తాగడం వల్ల పారుడు వంటి జీర్ణకోశ వ్యాధులు సంభవిస్తాయి
- చూడి పశువులలో గర్ఛశ్రావాలు సంభ వించే అవకాశాలున్నాయి.
-వడదెబ్బకు గురైన వాటిలో దాహం పెరుగుతుంది.
- తూలుతూ నడుస్తూ పడిపోవడం, రొప్పు తూ, శ్వాస కష్టమవడంతో ఒక్కసారిగా అప స్మారక స్థితికి వెళ్లి మరణించే అవకాశం ఉంది.
నివారణ చర్యలు..
-షెడ్లల్లో గాలి ప్రసరణ సరిగా జరిగేలా చూడాలి
- పశువులను కిక్కిరిసిగా ఉంచకూడదు
- తగిన నీటి సౌకర్యం కల్పించాలి
- నీడ ఉండే ప్రదేశంలో ఉంచాలి
- ఉష్ణోగ్రత ఎక్కువగా ఉన్న సమయంలో పశువులకు చల్లని నీరు చల్లాలి
- శుభ్రమైన తాగునీరు ఎప్పుడూ అందు బాటులో ఉంచాలి
- మినరల్ మిశ్రమాలు,ఎలక్టోలైట్స్ ఇవ్వాలి
- ఆహరంలో పచ్చి గడ్డి,పీచు పదార్థాల శాతం పెంచాలి
- అధిక శ్రమ కలిగే పనులు ఉష్ణోగ్రత తక్కువగా ఉన్న సమయంలో చేయాలి.
పశువులకు వెంటనే చికిత్స చేయించాలి..
-మురళికృష్ణ, పశువైధ్యాధికారి, ఆసిఫాబాద్
వడదెబ్బకు గురైన పశువులను వెంటనే చల్లని గాలి వచ్చే ప్రదేశంలోకి తీసుకెళ్లాలి. శరీర ఉష్ణోగ్రతను తగ్గించేందుకు పలుమార్లు నీటితో కడగాలి. చల్లని గోనె సంచిని కప్పడం లాంటివి చేయాలి. పశువైద్యుడి పర్యవేక్షణలో చికిత్స అందించాలి.వైద్యాధికారుల సలహాలు, సూచనలు పాటించాలి.