Share News

మళ్లీ తెరపైకి సుల్తానాబాద్‌ నియోజకవర్గం!

ABN , Publish Date - Nov 30 , 2026 | 01:13 AM

దేశవ్యాప్తంగా రాజకీయ సమీకరణాలను మార్చే దిశగా కేంద్ర ప్రభుత్వం చేపట్టనున్న డీలిమిటేషన్‌ ప్రక్రియపై ఆసక్తికర చర్చకు తెరలేపుతోంది. నియోజకవర్గాల పునర్విభజన, అసెంబ్లీ స్థానాల పెంపు ప్రతిపాదనలు

మళ్లీ తెరపైకి  సుల్తానాబాద్‌ నియోజకవర్గం!
సుల్తానాబాద్‌ మున్సిపల్‌ కార్యాలయం

పెద్దపల్లి, నవంబరు 29(ఆంధ్రజ్యోతి): దేశవ్యాప్తంగా రాజకీయ సమీకరణాలను మార్చే దిశగా కేంద్ర ప్రభుత్వం చేపట్టనున్న డీలిమిటేషన్‌ ప్రక్రియపై ఆసక్తికర చర్చకు తెరలేపుతోంది. నియోజకవర్గాల పునర్విభజన, అసెంబ్లీ స్థానాల పెంపు ప్రతిపాదనలు అమల్లోకి వస్తే రాష్ట్ర రాజకీయ ముఖచిత్రమే మారిపోయే అవకాశముంది. ప్రస్తుతం తెలంగాణలో 119గా ఉన్న అసెంబ్లీ స్థానాలు 179కు పెరగవచ్చనే అంచనాలు వినిపిస్తున్నాయి. లోక్‌సభ స్థానాల సంఖ్య కూడా ప్రస్తుత 17 నుంచి పెరిగే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో పెద్దపల్లి జిల్లాలో మరో కొత్త అసెంబ్లీ నియోజకవర్గం ఏర్పాటుపై చర్చ మొదలైంది.

ఫ నాలుగో నియోజకవర్గంగా సుల్తానాబాద్‌?

ప్రస్తుతం పెద్దపల్లి జిల్లాలో పెద్దపల్లి, రామగుండం, మంథని మూడు అసెంబ్లీ నియోజకవర్గాలున్నాయి. డీలిమిటేషన్‌లో అసెంబ్లీ స్థానాల సంఖ్య పెరిగితే జిల్లాలోనూ కొత్త నియోజకవర్గాల ఏర్పాటుకు అవకాశం ఉంటుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. భౌగోళిక విస్తీర్ణం, జనాభా, ఓటర్ల సంఖ్య, మండలాల వారీగా జనాభా పంపిణీ వంటి అంశాలను పరిగణనలోకి తీసుకుంటే సుల్తానాబాద్‌ కేంద్రంగా ప్రత్యేక అసెంబ్లీ నియోజకవర్గం ఏర్పాటు చేయాలనే ప్రతిపాదనకు ప్రాధాన్యం ఏర్పడుతోంది. సుల్తానాబాద్‌ చుట్టుపక్కల గ్రామాలు, మండలాలను కలుపుతూ కొత్త నియోజకవర్గం ఏర్పాటైతే స్థానిక ప్రజలకు రాజకీయ ప్రాతినిధ్యం మరింత చేరువయ్యే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం పెద్దపల్లి నియోజకవర్గ పరిధిలో ఉన్న సుల్తానాబాద్‌ ప్రాంతానికి ప్రత్యేక రాజకీయ గుర్తింపు లభించడంతో పాటు స్థానిక నాయకత్వానికి కొత్త అవకాశాలు ఏర్పడతాయి.

ఫ గతంలోనూ ప్రత్యేక నియోజకవర్గం

సుల్తానాబాద్‌ గతంలో ప్రత్యేక అసెంబ్లీ నియోజకవర్గంగా కొనసాగింది. 1957 ఎన్నికల్లో సుల్తానాబాద్‌ (ఎస్సీ) నియోజకవర్గం నుంచి బి. రాజారామ్‌ ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 1962 ఎన్నికల్లో సుల్తానాబాద్‌ నియోజకవర్గం నుంచి మల్లారెడ్డి స్వతంత్ర అభ్యర్థిగా విజయం సాధించారు. అనంతరం నియోజకవర్గాల పునర్విభజనలో సుల్తానాబాద్‌ ప్రత్యేక అసెంబ్లీ స్థానం కనుమరుగై పెద్దపల్లి నియోజకవర్గ పరిధిలోకి చేరింది. దశాబ్దాల క్రితమే ఎమ్మెల్యేను ఎన్నుకున్న నియోజకవర్గంగా గుర్తింపు పొందిన సుల్తానాబాద్‌కు మళ్లీ అదే హోదా దక్కుతుందా? అనే ఆసక్తి నెలకొంటోంది.

ఫ రాజకీయంగా కొత్త సమీకరణాలు

సుల్తానాబాద్‌ ప్రత్యేక నియోజకవర్గంగా ఏర్పడితే రాజకీయ పార్టీలకు కొత్త వేదిక అందుబాటులోకి వచ్చినట్లవుతుంది. ఇప్పటివరకు పెద్దపల్లి నియోజకవర్గ రాజకీయాల చుట్టూ తిరిగిన సుల్తానాబాద్‌ ప్రాంత రాజకీయాలు స్వతంత్రంగా రూపుదిద్దుకునే పరిస్థితి ఏర్పడుతుంది. స్థానిక సమస్యలు, అభివృద్ధి, సాగునీరు, రహదారులు, విద్య, వైద్యం వంటి అంశాలకు ప్రత్యేక ప్రాధాన్యం లభించే అవకాశం ఉంటుంది. డీలిమిటేషన్‌ బిల్లు ఆమోదం, తదుపరి నియోజకవర్గాల పునర్విభజన కమిషన్‌ నిర్ణయాలు, జనాభా ప్రాతిపదికన సరిహద్దుల ఖరారు అనంతరమే కొత్త నియోజక వర్గాలపై స్పష్టత రానుంది. అయినప్పటికీ ఒకప్పుడు ఎమ్మెల్యేను అందించిన సుల్తానాబాద్‌కు మళ్లీ ఆ రాజకీయ వైభవం వస్తుందా? చర్చ మొదలైంది.

Updated Date - Nov 30 , 2026 | 01:13 AM