Share News

సుకుమా అడవుల్లో నక్సల్స్‌ పాఠశాల

ABN , Publish Date - Feb 28 , 2026 | 03:29 AM

మావోయిస్టు పార్టీ దండకారణ్యంలో 20 ఏళ్ల పాటు జనతన సర్కార్‌ నడిపింది. అనుకున్న లక్ష్యాన్ని చేరుకునేందుకు సుమారు 16 రాష్ట్రాల్లో రెడ్‌ కారిడార్‌ను ఏర్పాటు చేసుకుంది.

సుకుమా అడవుల్లో నక్సల్స్‌ పాఠశాల

  • 14 ఏళ్ల పాటు నడిపిన జనతన సర్కార్‌

  • ప్రతీ ఏడాది 250 మంది పిల్లలకు విద్యాబోధన

  • తెలుగు, హిందీ, ఇంగ్లీ్‌షపై పాఠాలు

  • సాయుధ పోరాటంపై శిక్షణ

  • ఆపరేషన్‌ కగార్‌లో మూతపడిన స్కూల్‌

చర్ల, ఫిబ్రవరి 27 (ఆంధ్రజ్యోతి) : మావోయిస్టు పార్టీ దండకారణ్యంలో 20 ఏళ్ల పాటు జనతన సర్కార్‌ నడిపింది. అనుకున్న లక్ష్యాన్ని చేరుకునేందుకు సుమారు 16 రాష్ట్రాల్లో రెడ్‌ కారిడార్‌ను ఏర్పాటు చేసుకుంది. స్థానిక పిల్లలకు చదువు చెప్పేందుకు పాఠశాలలు కూడా నడిపింది. వందల మంది చిన్నారులకు 1 నుంచి 8 తరగతి వరకు నాలుగు భాష(హిందీ, ఇంగ్లీషు, తెలుగు, గోండు)ల్లో విద్యాబోధన చేశారు. సాయుధ పోరాటంపై శిక్షణ అందించారు. ఇలాంటి పాఠశాలలు వివిధ రాష్ట్రాల్లో మావోయిస్టులు నడిపించగా, దక్షిణ బస్తర్‌కు చెందిన పాఠశాలలను మాత్రం సుకుమా జిల్లా కర్కనగూడెం గ్రామంలో 2010 నుంచి మావోయిస్టు పార్టీ నడిపించింది. గత ఏడాది బలగాల రాకతో పాఠశాల మూత పడింది. ప్రస్తుతం అక్కడ పూరి పాకలు, బ్లాక్‌ బోర్డులు కనిపిస్తున్నాయి. తెలంగాణ నుంచి సుమారు 60 కిలోమీటర్ల దూరంలో పాఠశాల ఉంది. కనీసం మోటార్‌సైకిల్‌ కూడా వెళ్లలేని ఆ ప్రాంతానికి సుమారు 5 గంటలు ప్రయాణించి ‘ఆంధ్రజ్యోతి’ చేరుకుంది. 2004లో మావోయిస్టు పార్టీ ఏర్పడిన సమయానికి అటవీ గ్రామాల్లో పాఠశాలలు లేవు. కొన్ని గ్రామాల్లో ఉన్నా మావోయిస్టుల రాకతో మూత పడ్డాయి. ఇక సల్వాజుడుం రాకతో పాఠశాలలు లేకుండాపోయాయి. దీంతో అడవుల్లో పిల్లల కోసం మావోయిస్టు పార్టీ వివిధ ప్రాంతాల్లో బడులు(అక్కడే భోజనం, అక్కడే చదువు) ఏర్పాటు చేసింది. దక్షిణబస్తర్‌లోని సుకుమా జిల్లా కర్కనగూడెం గ్రామంలో బడిని ప్రారంభించింది. ప్రతీ ఏడాది సుకుమా, బీజాపూర్‌, దంతెవాడ జిల్లాకు చెందిన చిన్నారులకు అక్కడ పాఠాలు నేర్పించారు. బడిలో 250 మంది పిల్లలు ఉండేవారని అక్కడ చదువుకున్న స్థానికులు, మావోయిస్టులు టీచర్లుగా పని చేశారని స్థానికులు చెబుతున్నారు. పిల్లలతో విప్లవ సాహిత్య పుస్తకాలను చదివించేవారు. ఉదయం లేచిన దగ్గర నుంచి రన్నింగ్‌, జంపింగ్‌, శత్రువులు దాడి చేస్తే ఎలా తప్పించుకోవాలనే దానిపై కఠోర శిక్షణ అందించేవారు. ప్రతీ విద్యార్థికి దుస్తులు, భోజనం, అక్కడే వసతి కల్పించేవారని, పోలీసులు వస్తున్నారని తెలిస్తే పిల్లలు అక్కడి నుంచి వెళ్లిపోయేవారని స్థానికులు తెలిపారు. మావోయిస్టులు కూడా ఈ ప్రాంతంలోనే ఉండేవారని ‘ఆంధ్రజ్యోతి’కి తెలిపారు.

Updated Date - Feb 28 , 2026 | 03:29 AM