Share News

Sugar Trade in Medaram Fair: టెండర్లూ లేవు.. కట్టడీ లేదు!

ABN , Publish Date - Jan 09 , 2026 | 04:38 AM

కోట్లాది మంది భక్తుల విశ్వాసాలకు ప్రతీక మేడారం మహా జాతర. నాలుగు రోజుల పాటు సాగే జాతరలో భక్తులు తల్లులకు పవిత్రంగా సమర్పించే బెల్లం ‘మాఫియా’ చేతికి చిక్కి కాసుల వర్షం కురిపిస్తోంది.

Sugar Trade in Medaram Fair: టెండర్లూ లేవు.. కట్టడీ లేదు!

  • 30 కోట్ల పైచిలుకు బెల్లం వ్యాపారం

  • 2022 నుంచి మేడారం జాతరలో టెండర్ల నిలిపివేత

  • ఐటీడీఏ ఆధ్వర్యంలో 18 గిరిజన సొసైటీలకు చాన్స్‌

  • సొసైటీల తెర వెనుక బెల్లం వ్యాపారుల మాఫియా మంత్రాంగం

  • భక్తుల విశ్వాసంతో చెలగాటం

  • కానుకలూ మాఫియా ఖాతాలోకే

  • భక్తుల మొక్కులు.. మాఫియాకు లాభాలు

(వరంగల్‌, ఆంధ్రజ్యోతి ప్రతినిధి)

కోట్లాది మంది భక్తుల విశ్వాసాలకు ప్రతీక మేడారం మహా జాతర. నాలుగు రోజుల పాటు సాగే జాతరలో భక్తులు తల్లులకు పవిత్రంగా సమర్పించే బెల్లం ‘మాఫియా’ చేతికి చిక్కి కాసుల వర్షం కురిపిస్తోంది. జాతరలో రూ.50 కోట్ల విలువైన బెల్లం విక్రయాలు జరుగుతాయని అంచనా. గతంలో బెల్లం విక్రయాలకు టెండర్లు నిర్వహించిన రాష్ట్ర దేవాదాయ, ధర్మాదాయశాఖ.. 2022 నుంచి ఆ విధానానికి తిలోదకాలిచ్చింది. ఈ నెల 28-31 తేదీల మధ్య జరిగే మహా జాతర సందర్భంగానూ తల్లులకు నైవేద్యంగా సమర్పించే బెల్లం విక్రయానికి టెండర్లు పిలవలేదు. ఈసారీ ఐటీడీఏ అనుమతితో రూ.3 లక్షల డిపాజిట్‌తో 18 గిరిజన సొసైటీలకు బెల్లం విక్రయానికి అవకాశం లభిస్తుంది. పేరుకు సొసైటీలు గిరిజనులవైనా.. తెర వెనక మంత్రాంగమంతా వ్యాపారుల ‘మాఫియా’దేనన్న విమర్శలున్నాయి. గద్దెలకు బెల్లం సమర్పించాక భక్తులు చిటికెడు బెల్లం మాత్రమే తీసుకుంటారు. తర్వాత బెల్లం వ్యాపారుల ‘మాఫియా’ అనుచరులు గోదాంనకు తరలిస్తారు. దెబ్బ తినని బెల్లం బుట్టలపై గల పసుపు, కుంకుమలను చెరిపేసి.. సరికొత్తగా ప్లాస్టిక్‌ కవరు బిగించి.. తిరిగి విక్రయించడం గత జాతరలో జోరుగా సాగిందనే విమర్శలున్నాయి. భక్తుల విశ్వాసంతో చెలగాటమాడుతున్న మాఫియా తీరుతో దేవస్థాన పవిత్రతపై మచ్చ పడుతోందన్న విమర్శలున్నాయి. టెండర్లు నిర్వహించక పోవడంతో సర్కారూ వచ్చే ఆదాయాన్ని కోల్పోతోందన్న మాటలూ వినిపిస్తున్నాయి. ఈ జాతరకైనా టెండర్లు నిర్వహించి.. అధిక ధరలకు బెల్లం అమ్మకుండా నియంత్రించాలని కోరుతున్నారు.


బెల్లం టెండర్లకు మాఫియా అడ్డుకట్ట..?

మేడారం జాతరలో గల 40కి పైగా బెల్లం దుకాణాలకు బంగారం (బెల్లం) సరఫరా దారులు సదరు మాఫియా వ్యాపారులేనని సమాచారం. జీఎస్టీతోపాటు కిలో బెల్లం రూ.25-30 మధ్య మేడారానికి సరఫరా అవుతోంది. ముందస్తు మొక్కులు సమర్పించేందుకు భక్తులు తరలి రావడంతో మాఫియా రంగ ప్రవేశం చేసి ధరలు పెంచారని ప్రచారం ఉంది. 4 జిల్లాల (నలుగురు వరంగల్‌ పాత బీట్‌ బజార్‌ వ్యాపారులు, ముగ్గురు భద్రాద్రి - కొత్తగూడెం జిల్లా, ఇద్దరు పెద్దపల్లి, ఒక ఆదిలాబాద్‌ వ్యాపారి) వ్యాపారులు సిండికేటుగా మారి ధర రెండింతలు చేసినట్లు సమాచారం. పొరుగు రాష్ట్రాల నుంచి ఒక్కో లారీలో 10 టన్నుల బెల్లం దిగుమతి చేసుకుంటున్న వ్యాపారులు.. రూ.3 లక్షల పెట్టుడితో లారీలో 10 టన్నుల బెల్లం కొనుగోలు చేసి.. రూ.80-120 మధ్య కిలో బెల్లం విక్రయిస్తున్నారు. జాతర ప్రారంభానికి ముందే 50 లారీల బెల్లం విక్రయాలు జరుగుతాయని తెలుస్తోంది. ఒక్కో లారీకి రూ.5-9 లక్షల చొప్పున ముందస్తు మొక్కులపైనే వ్యాపారులు కనీసం రూ.6 కోట్ల వ్యాపారం చేస్తే రూ.4.5 కోట్ల లాభాలు గడిస్తారని తెలుస్తోంది. జాతర ప్రారంభమయ్యాక పర్మినెంట్‌ దుకాణాల మూసివేతతో ఐటీడీఏ షాపుల్లో ఒక్కో షాపు నుంచి జాతర ముగిసేలోగా రమారమీ 20 లారీల బెల్లం విక్రయాలు అంటే మొత్తం 360 లారీల బెల్లం విక్రయాలు జరుగుతాయి. అంటే 18 షాపులకు రూ.18 కోట్ల వరకు లాభాలుంటాయన్న చర్చ సాగుతోంది. ఇక అనధికార, ముందస్తు జాతర విక్రయాలతో కలిపి బెల్లం వ్యాపారుల లాభాలు రూ.25-30 కోట్ల మధ్య ఉంటుందని సమాచారం.

వారి ఖాతాల్లోకే కానుకలు

తల్లుల గద్దెలపై భక్తులు బంగారం (బెల్లం)తోపాటు చెల్లించే ముడుపుల్లో బియ్యంతోపాటు డబ్బు, బంగారం, వెండి వంటి విలువైన కానుకలుంటాయి. బెల్లాన్ని వేరుచేసే క్రమంలో కానుకలు కాంట్రాక్టర్‌ల చేతికి చిక్కుతున్నాయన్న చర్చ జరుగుతోంది. దీనివల్ల విలువైన కానుకలు గిరిజన పూజారులు, ప్రభుత్వానికి దక్కకుండా పోతున్నాయన్న విమర్శలున్నాయి. మేడారం మహా జాతరలో భక్తులు సమర్పించే బెల్లం.. ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీకాకుళం, అనకాపల్లి, మహరాష్ట్రలోని నాగ్‌పూర్‌, నాందేడ్‌ తదితర ప్రాంతాల నుంచి దిగుమతి చేసుకుంటారు.

Updated Date - Jan 09 , 2026 | 04:38 AM