Share News

గాలివాన బీభత్సం

ABN , Publish Date - May 04 , 2026 | 04:05 AM

రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఆదివారం సాయంత్రం కురిసిన అకాలవర్షం రైతులకు నష్టం మిగిల్చింది. కల్లాల్లో, కొనుగోలు కేంద్రాల వద్ద ఉన్న ధాన్యం, మొక్కజొన్న తడిసిపోయాయి.

గాలివాన బీభత్సం

  • తడిసిముద్దయిన ధాన్యం, మొక్కజొన్న

  • నిప్పులు చెరిగిన ఎండ.. అంతలోనే వాన

  • హుస్నాబాద్‌లో వడగండ్ల వర్షం

  • రాష్ట్రంలో వడదెబ్బకు ఇద్దరు, పిడుగుపాటుకు ఒకరి మృతి

(ఆంధ్రజ్యోతి న్యూస్‌ నెట్‌వర్క్‌)

రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఆదివారం సాయంత్రం కురిసిన అకాలవర్షం రైతులకు నష్టం మిగిల్చింది. కల్లాల్లో, కొనుగోలు కేంద్రాల వద్ద ఉన్న ధాన్యం, మొక్కజొన్న తడిసిపోయాయి. కళ్లెదుటే చేతికందిన పంట తడిసిపోవటంతో రైతులు కన్నీరుమున్నీరయ్యారు. ఈదురుగాలులకు పలుచోట్ల విద్యుత్‌ స్తంభాలు, చెట్లు కూలిపోయాయి. మామిడికాయలు నేలరాలాయి. ఉదయం నుంచీ నిప్పులు చెరిగే ఎండ, వడగాల్పులు ఉక్కిరిబిక్కిరి చేయగా సాయంత్రం వాతావరణం మారి గాలివాన బీభత్సం సృష్టించింది. భారీ వర్షంతో ఉమ్మడి నల్లగొండ జిల్లాలో పలుచోట్ల కేంద్రాల్లోని ధాన్యం రాశులు తడిసిముద్దయ్యాయి. కాంటాలు వేసిన ధాన్యం బస్తాలు కూడా తడిసిపోయాయి. నల్లగొండ, నకిరేకల్‌, తిప్పర్తిలో గాలిదుమారానికి నార్కట్‌పల్లి-అద్దంకి రహదారిపై చెట్లు కూలడంతో అరగంట పాటు వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. సూర్యాపేట మండలం యండ్లపల్లిలో రోడ్డుపై ఆరబోసిన ధాన్యం నీటిపాలైంది. ఈదురుగాలులకు తోడు వడగండ్ల వానతో తిరుమలగిరి, ఆత్మకూర్‌ (ఎస్‌) మండలంలో మామిడికాయలు నేలరాలాయి. నిమ్మ, బత్తాయి తోటలకు నష్టం వాటిల్లింది. సూర్యాపేట, హజూర్‌నగర్‌, నడిగూడెంలో పలుచోట్ల విద్యుత్‌ స్తంభాలు నేలకొరిగాయి. పెన్‌పహాడ్‌ మండలంలో రహదారులపై చెట్లు విరిగిపడ్డాయి. కోదాడ మండలం దోరకుంటలో పిడుగుపాటుకు మసీదు పాక్షికంగా దెబ్బతింది. మహబూబాబాద్‌ జిల్లా కురవి మండలం సూదనపల్లి కొనుగోలు కేంద్రంలో తడుస్తున్న ధాన్యాన్ని రక్షించుకునేందుకు టార్పాలిన్‌ కప్పుతుండగా పిడుగుపాటుకు గురై రైతు నీలం వెంకన్న(45) మృతిచెందాడు. కేసముద్రం మండలం తాళ్లపూసపల్లిలో రూ.లక్ష విలువైన రెండు పశువులు మృతిచెందాయి. మహబూబాబాద్‌, కే సముద్రంతో పాటు అన్ని మండలాల్లో కొనుగోలు కేంద్రాల్లోని ధాన్యం, మొక్కజొన్న తడిసిసోయాయి. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కూడా అకాల వర్షంతో రైతులు నష్టపోయారు. తెల్దారుపల్లిలో రైతులు తడసిన మొక్కజొన్నకు నష్టపరిహారం చెల్లించాలని ధర్నాకు దిగారు. కొత్తగూడెం జిల్లాలో పలుచోట్ల, మంచిర్యాల జిల్లా మందమర్రిలో విద్యుత్‌ స్తంభాలు, రోడ్లపై చెట్లు కూలిపోయాయి. విద్యుత్‌ తీగలు తెగి పడి మంట చెలరేగి జైపూర్‌ మండలం కాన్కూర్‌లోని ఓ పొలంలో వడ్లు, పెద్దపల్లి జిల్లా ఓదెల మండలం జీలకుంటలో మొక్కజొన్న పంట దగ్ధమైంది. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్‌లో వేల క్వింటాళ్ల వరి, మొక్కజొన్న ధాన్యం తడిసి ముద్దయ్యింది.

2.jpg


నిప్పులు చెరిగిన భానుడు

రాష్ట్రంలో ఎండలు నిప్పులు చెరుగుతున్నాయి. ఆదివారం సిద్దిపేట జిల్లా తుక్కాపూర్‌లో అత్యధికంగా 45.9 డిగ్రీలు, తర్వాత నిజామాబాద్‌ జిల్లా బాల్కొండలో 45.8 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఇంకా అనేకచోట్ల 45 డిగ్రీలు దాటింది. ఎండల తీవ్రతతో సిద్దిపేట జిల్లాకు రెడ్‌ అలర్ట్‌ ప్రకటించారు. ఉదయం నుంచి వీస్తున్న వడగాలులతో గ్రేటర్‌ హైదరాబాద్‌ వాసులను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. ఆదివారం ముషీరాబాద్‌లో అత్యధికంగా 42.6 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. హైదరాబాద్‌, రంగారెడ్డి, మేడ్చల్‌-మల్కాజిగిరి జిల్లాల్లో మరో మూడు రోజుల పాటు వర్ష సూచన ఉందని వాతావరణ శాఖ తెలిపింది. కాగా, రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలం రాయపోల్‌లో ఆదివారం రాపోల్‌ (మంగలి) గౌరయ్య(64) అనే రైతు వడదెబ్బ తగిలి మరణించాడు. కొనుగోలు కేంద్రం వద్ద ధాన్యాన్ని ఆరబెట్టిన గౌరయ్య.. సాయంత్రం 4గంటల సమయంలో మబ్బులు పడుతుండడంతో ధాన్యాన్ని కుప్పనూరుస్తూ కుప్పకూలిపోయాడు. ఆదిలాబాద్‌ జిల్లా భీంపూర్‌ మండలం వడగవ్‌కు చెందిన సలాం మాణిక్‌ రావ్‌(53) అనే పారిశుధ్య కార్మికుడు మృతిచెందాడు.

1.jpg

Updated Date - May 04 , 2026 | 04:05 AM