భావప్రకటన స్వేచ్ఛను హరిస్తున్న మోదీ
ABN , Publish Date - Aug 17 , 2026 | 06:18 AM
పాలకులను ప్రశ్నించే వారిని దిమాగీ నక్సల్స్ అని ప్రధాని మోదీ పేర్కొనడం ప్రజల భావ ప్రకటనాస్వేచ్ఛను కాల రాయడమేనని సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి బి.సుదర్శన్‌రెడ్డి విమర్శించారు.
సామాజిక, ఆర్థిక అసమానతలతో ప్రజాస్వామ్యానికే ముప్పు
రాజ్యాంగ పరిరక్షణ వేదిక సదస్సులో జస్టిస్ బి.సుదర్శన్‌రెడ్డి ఆందోళన
సర్ బాధితులు సంఘటిత పోరాటం చేయాలి: పరకాల ప్రభాకర్
హైదరాబాద్ సిటీ, ఆగస్టు16(ఆంధ్రజ్యోతి): పాలకులను ప్రశ్నించే వారిని దిమాగీ నక్సల్స్ అని ప్రధాని మోదీ పేర్కొనడం ప్రజల భావ ప్రకటనాస్వేచ్ఛను కాల రాయడమేనని సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి బి.సుదర్శన్‌రెడ్డి విమర్శించారు. రాజ్యాంగ పరిరక్షణ వేదిక ఆధ్వర్యంలో ఆదివారం కూకట్‌పల్లి జేఎన్‌టీయూ ఆడిటోరియంలో ‘భారత రాజ్యాంగం - సామాజిక న్యాయం’ అంశంపై జరిగిన సదస్సులో ఆయన కీలకోపన్యాసం చేస్తూ.. కార్పొరేట్ల దోపిడీని నిలదీస్తున్న వారిని అభివృద్ధి సహించని వ్యక్తులని దుష్ప్రచారం చేయడం పరిపాటైందన్నారు. నదులు పూజలందుకుంటున్న పవిత్ర దేశంలో కోకాకోలా కంపెనీకి ఓ నదినే విక్రయించారని ఎద్దేవా చేశారు. రాజ్యసభలో సీపీఎం ఎంపీని ‘లుంగీవాలా’ అని బీజేపీ ఎంపీ హేళన చేస్తే, కమ్యూనిస్టులు ‘అబద్దాల కోరులు’ అని ఆర్థిక మంత్రి విమర్శించడం వంటి అప్రజాస్వామిక ధోరణులు ఏ విలువలకు ప్రస్థానం అని ప్రశ్నించారు. కొద్ది మంది చేతిలో ప్రకృతి వనరులు కేంద్రీకృతమైనంత కాలం ఆర్థిక అంతరాలు తగ్గడం సాధ్యమేనా? అని ప్రశ్నించిన జస్టిస్ సుదర్శన్ రెడ్డి.. సామాజిక, ఆర్థిక అసమానతలు కొనసాగితే ప్రజాస్వామ్యానికే ప్రమాదమని అంబేడ్కర్ హెచ్చరించారని గుర్తుచేశారు. ఆర్థిక, రాజకీయ విశ్లేషకుడు పరకాల ప్రభాకర్ ‘పౌరసత్వంపై ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (సర్) ప్రభావం’ అంశంపై ప్రసంగిస్తూ.. దీనివల్ల దేశమంతటా 16కోట్లకు పైగా ఓట్లు తొలగించే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. ఎన్‌ఆర్సీ- సీఏఏలతో చేయలేని పౌర ప్రక్షాళనను ‘సర్’ ద్వారా పూర్తి చేస్తున్నారని దుయ్యబట్టారు. సర్ బాధితులంతా దేశవ్యాప్తంగా సంఘటితమై ఉద్యమించాలని పరకాల పిలుపునిచ్చారు.