Share News

సబ్సిడీ విత్తనాలు పక్కదారి పట్టించిన ఫలితం ఆ సాగు అధికారులపై వేటు!

ABN , Publish Date - Jun 14 , 2026 | 04:06 AM

రైతులకు రాయితీతో పంపిణీ చేయాల్సిన వేరుశనగ విత్తనాలను పక్కదారి పట్టించి.. సొమ్ము చేసుకున్న వ్యవసాయ అధికారులపై ఉన్నతాధికారులు కఠిన చర్యలకు ఉపక్రమించారు

సబ్సిడీ విత్తనాలు పక్కదారి పట్టించిన ఫలితం ఆ సాగు అధికారులపై వేటు!

  • మెట్లకుంట్ల, గోకఫస్లాబాద్‌ ఏఈవోలు సర్వీసు నుంచి తొలగింపు

  • దుద్యాల మండల ఏవోపై సస్పెన్షన్‌ వేటు

  • వేరుశనగ విత్తనాల రైతులకు ఇవ్వకున్నా పంపిణీ చేసినట్లుగా నమోదు

వికారాబాద్‌, జూన్‌ 13 (ఆంధ్రజ్యోతి)/కొడంగల్‌: రైతులకు రాయితీతో పంపిణీ చేయాల్సిన వేరుశనగ విత్తనాలను పక్కదారి పట్టించి.. సొమ్ము చేసుకున్న వ్యవసాయ అధికారులపై ఉన్నతాధికారులు కఠిన చర్యలకు ఉపక్రమించారు. ఈ మేరకు వికారాబాద్‌ జిల్లా కొడంగల్‌ డివిజన్‌ పరిధిలో ఇద్దరు ఏఈవో (వ్యవసాయ విస్తరణ అధికారులు)లను సర్వీసు నుంచి తొలగించారు. అలాగే దుద్యాల మండల వ్యవసాయాధికారిని సస్పెండ్‌ చేశారు. కొడంగల్‌ ఏడీఏను కమిషనరేట్‌కు అటాచ్‌ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. రాయితీ వేరుశనగ విత్తనాల పంపిణీలో అక్రమాలకు పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న మరికొందరిపైనా చర్యలు తీసుకునే అవకాశాలు ఉన్న ట్లు తెలుస్తోంది. నిరుడు యాసంగి సీజన్‌లో జిల్లాలో నూనె గింజల సాగును ప్రోత్సహించేందుకు జాతీయ నూనె గింజల ఉత్పత్తి పథకం కింద వికారాబాద్‌ జిల్లాలో 2,404 మంది రైతులకు 3,479 క్వింటాళ్ల వేరుశనగ విత్తనాలు పంపిణీ చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. 1,777 మంది రైతులకు 100శాతం రాయితీపై 2,535 క్వింటాళ్లు, 627 మంది రైతులకు 50శాతం సబ్సిడీతో 944 క్వింటాళ్ల వేరుశనగ విత్తనాలు సరఫరా చేయాల్సి ఉంది. పంట సాగు చేసే రైతులకు సరఫరా చేయాల్సిన రాయితీ వేరుశనగ విత్తనాలను వ్యవసాయ శాఖ అధికారులు పక్కదారి పట్టించి సొమ్ము చేసుకున్నారు. దీనిపై గత ఏడాది అక్టోబరు 17న ‘విత్తన పంపిణీలో గోల్‌మాల్‌..!’, ‘పక్కదారి పట్టిన సబ్సిడీ వేరుశనగ విత్తనాలు’ అనే శీర్షికన ‘ఆంధ్రజ్యోతి’లో ప్రచురితమైన కథనంపై అప్పట్లో ఉన్నతాధికారులు విచారణ జరిపినా నివేదికను తొక్కిపెట్టినట్లు తెలుస్తోంది. ఇటీవల నాడు విత్తనాల పంపిణీలో చోటు చేసుకున్న అక్రమాల గురించి కొందరు రైతులు జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేయడంతో ఆయన ఈ వ్యవహారంపై సమగ్ర విచారణకు ఆదేశించారు. జిల్లా అదనపు కలెక్టర్‌ ఉమాశంకర్‌ ప్రసాద్‌ నేతృత్వంలో అధికారుల బృందాలు జరుపుతున్న విచారణలో వ్యవసాయ శాఖ అధికారుల అక్రమాలు వెలుగు చూస్తున్నాయి.


రైతులకు రాయితీ వేరుశనగ విత్తనాలను ఇవ్వకుండానే పంపిణీ చేసినట్లుగా రికార్డుల్లో నమోదు చేసినట్లుగా విచారణలో గుర్తించినట్లు సమాచారం. దుద్యాల, బొంరా్‌సపేట్‌, దౌల్తాబాద్‌ మండలాల్లో రాయితీ విత్తనాలు పక్కదారి పట్టడంలో పాత్ర ఉన్నట్లు గుర్తించిన అధికారులపై చర్యలు తీసుకున్నారు. బొంరా్‌సపేట్‌ మండలం, మెట్లకుంట క్లస్టర్‌ ఏఈవో జగదీశ్వర్‌రెడ్డి, దౌల్తాబాద్‌ మండలం, గోక ఫస్లాబాద్‌ క్లస్టర్‌ ఏఈవో మమతను సర్వీసు నుంచి తొలగిస్తూ ఉన్నతాధికారులు నిర్ణయం తీసుకున్నారు. దుద్యాల మండల వ్యవసాయ అధికారి నాగరాజును సస్పెండ్‌ చేశారు. కొడంగల్‌ ఏడీఏ శంకర్‌ రాథోడ్‌ను కమిషనరేట్‌కు సరెండర్‌ చేస్తూ జిల్లా కలెక్టర్‌ దీపక్‌తివారీ ఉత్తర్వులు జారీ చేశారు. కాగా దోమ, కులకచర్ల, బషీరాబాద్‌, యాలాల్‌ మండలాల పరిధిలో కూడా ఆదే పరిస్థితి నెలకొందన్న ఆరోపణలు ఉన్నాయి. కొన్ని మండలాల్లో విచారణ పూర్తి కాగా, ఇంకా కొన్ని మండలాల్లో క్షేత్ర స్థాయిలో విచారణ కొనసాగుతోంది. విచారణ పూర్తయ్యే వరకు మరికొందరు అధికారులపై వేటు పడే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

Updated Date - Jun 14 , 2026 | 04:06 AM