Share News

kumaram bheem asifabad- నీట మునిగిన పంట చేలు

ABN , Publish Date - Jul 30 , 2026 | 11:01 PM

కాగజ్‌నగర్‌ పట్టణంలో రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలతో పెద్దవాగు ఉప్పొంగి ప్రవహిస్తోంది. అలాగే ఈ వాగు సమీపంలో ఉన్న పత్తి పంట పూర్తిగా నీట మునిగింది. పెద్దవాగు ఉదృతి పెరుగుతుండటంతో సమీప గ్రామాల ప్రజలను రెవెన్యూ అధికారులు అప్రమత్తంగా చేశారు.

kumaram bheem asifabad- నీట మునిగిన పంట చేలు
రెబ్బెన మండలం నారాయణపూర్‌లో నీట మునిగిన పత్తి

కాగజ్‌నగర్‌, జూలై 30 (ఆంధ్రజ్యోతి): కాగజ్‌నగర్‌ పట్టణంలో రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలతో పెద్దవాగు ఉప్పొంగి ప్రవహిస్తోంది. అలాగే ఈ వాగు సమీపంలో ఉన్న పత్తి పంట పూర్తిగా నీట మునిగింది. పెద్దవాగు ఉదృతి పెరుగుతుండటంతో సమీప గ్రామాల ప్రజలను రెవెన్యూ అధికారులు అప్రమత్తంగా చేశారు. చేపలు పట్టేందుకు ఎవరిని కూడా లోని పోనీయకుండా కట్టుదిట్టమైన చర్యలు చేపట్టారు.

రెబ్బెన, (ఆంధ్రజ్యోతి): రెబ్బెన మండలంలో వర్షాలకు పంటలు నీట మునియాయి. మండలంలోని నంబాలవాగు ఉదృతంగా ప్రవహించటంతో కిష్టాపూర్‌, నంబాల గ్రామాల మధ్య రాకపోకలు నిలిచి పోయాయి. ఎస్సై వెంకట్‌ కృష్ణ ఈ మార్గంలో రాకపోకలు సాగకుండా కట్టుదిట్టమైన చర్యలు చేపట్టారు. అలాగే వరద ఉధృతిని తహసీల్దార్‌ మల్లికార్జున్‌ పరిశీలించారు.

సిర్పూరు(టి), (ఆంధ్రజ్యోతి): సిర్పూరు(టి)లో రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలతో ప్రజలు ఇబ్బందులు పడ్డారు. సిర్పూరు(టి) వెంకట్రావుపేట పొడ్షా బ్రిడ్జి వద్ద పెన్‌గంగా ప్రవహాం ఉదృతి పెరిగింది. సిర్పూరు(టి) తహసీల్దార్‌ రహీమోద్దీన్‌ సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పెన్‌గంగా ఉధృతి పెరుగుతుండటంతో సంబంధిత కార్యదర్శులు అప్రమత్తంగా ఉండి, లోతట్టు ప్రాంతాల వాసులు, చేపలు పట్టేవారు వాగులోకి పోరాదని హెచ్చరికలు జారీ చేశారు.

కౌటాల, (ఆంధ్రజ్యోతి): మండలంలో రెండు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు పత్తి చేలల్లోకి వరదనీరు చేరింది. తుమ్మిడిహెట్టి వద్ద ప్రాణహిత పెన్‌గంగా ఉదృతంగా ప్రవహిస్తోంది. గురువారం స్నానపు మెట్ల వద్దకు వరద నీరు పెరిగింది.

చింతలమానేపల్లి, (ఆంధ్రజ్యోతి): మండలంలో కురుస్తున్న వర్షాలకు పంటలు నీట మునిగాయి. మండలంలోని బాబాసాగర్‌, నాయికపుగూడ, దిందా వాగులు ఉప్పొంగి ప్రవహించటంతో ప్రజలకు రాక పోకలు పూర్తిగా నిలిచి పోయాయి. ప్రజలు అత్యవసరమైన పనులుంటే బయటికి వెళ్లాల్సి వస్తోంది.

పెంచికల్‌పేట్‌(ఆంధ్రజ్యోతి): మండలంలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో ప్రాణహిత పెద్దవాగు ఉచ్చమల్ల వాగులతో ఆయా గ్రామాల పరిధిలో ఉన్న ఒర్రెలు ఉదృతంగా ప్రవహిస్తున్నాయి. పెద్దవాగు ప్రాణహిత పరివాహక ప్రాంతాల్లో వందల ఎకరాల్లో పంట చేనులు నీటమునిగాయి. బొక్కివాగు ప్రాజెక్టు నిండికుండలా మారి మత్తడి ఉదృతంగా ప్రవహిస్తోంది కొండపల్లి సమీపంలోని గొల్లవాగులో ఓ బులెరో వాహనం వరదలో చిక్కుకోగా ఎక్స్‌కవేటర్‌ సహాయంతో బయటకు తీశారు. దరోగపల్లి గ్రామానికి చెందిన సంతోష్‌ ఇంటి గోడ కూలి పోయింది. తహసీల్దార్‌ రవీందర్‌ సంఘటన స్థలాన్ని పరిశీలించారు. ఎస్సై అనిల్‌కుమార్‌ మాట్లాడుతూ లోతట్టు ప్రాంతాలను ప్రజల అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

దహెగాం(ఆంఽధ్రజ్యోతి): మండల కేంద్రంలోని గత రెండ్రోజులుగా ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తుండటంతో కల్వాడలోని పాల్వాయి పురుషోత్తం రావు ప్రాజెక్టు మత్తడి నుంచి వరద నీరు పోతోంది. అలాగే కుంటలు, చెరువులు నిండిపోతోంది. పత్తి పంట, వరి పొలాలు నీటమునిగాయి. పాల్వాయి పురుషోత్తం రావు ప్రధాన కాల్వకు కుంచవెల్లి గ్రామ సమీపంలోని విద్యుత్‌ సబ్‌ స్టేషన్‌ సమీపంలో ప్రధాన కాల్వకు గండి పడింది. ఎస్పీ నితికా పంత్‌ మండలంలో పర్యటించి వరద తీవ్రతను అడిగి తెలుసుకున్నారు. ఎస్పీ వెంట డీఎస్పీ వహిదుద్దీన్‌, సీఐ కుమార స్వామి, ఎస్సైలు రమేశ్‌, అనిల్‌, సిబ్బంది ఉన్నారు.

జైనూర్‌, (ఆంధ్రజ్యోతి): మండలంలో మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలకు పంట చేలల్లో వరదనీరు నిలిచింది. వరద నీరు పంట పోలాల్లో చేరడంతో పంటలకు నష్టం వాటిల్లుతుందని రైతులు ఆందోళన చెందుతున్నారు. మంలంలోని చిత్తకర్ర, తాడిలొద్ది గ్రామాల ప్రజలు వాగు ఉప్పొంగి ప్రవహించడంతో రాక పోకలకు ఇబ్బందులు పడ్డారు.

కెరమెరి, (ఆంధ్రజ్యోతి): వర్షాలకు సావర్‌కేడా గ్రామానికి వెళ్లే దారుల్లో ఉన్న లోలెవల్‌ వంతెనపై వాగు నీటి ప్రవాహం పెరిగింది. దీంతో రాక పోకలు పూర్తిగా నిలిచి పోయాయి. అలాగే సాంగ్వీ, కెలి(బి) గ్రామాల మధ్య ఉన్న లోలెవల్‌ వంతెనపై నుంచి వరద నీరు ఉదృతంగా ప్రవహించింది. వాగులు దాటకుండా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.

తిర్యాణి, (ఆంధ్రజ్యోతి): మండల కేంద్రంలో ఎడతెరిపి లేకుండా వర్షం కురువడంతో వాగులు, వంకలు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. పంటచేలల్లో వరద నీరు చేసింది.

Updated Date - Jul 30 , 2026 | 11:01 PM