Share News

Study Warns Antibiotics: యాంటీబయాటిక్స్‌ పనిచేయట్లేదు!

ABN , Publish Date - Jan 04 , 2026 | 03:59 AM

మానవాళికి వరంలా అందివచ్చిన యాంటీబయాటిక్స్‌.. మన విచ్చలవిడి, విచక్షణ రహిత వినియోగం కారణంగా క్రమంగా శక్తిని కోల్పోతున్నాయి! వైద్యులు సిఫారసు చేసిన రీతిలో .....

Study Warns Antibiotics: యాంటీబయాటిక్స్‌ పనిచేయట్లేదు!

  • విచ్చలవిడి వినియోగం కారణంగా వాటికి నిరోధకతను సంతరించుకుంటున్న క్రిములు

  • ఎండోస్కోపీ చేయించుకునే ప్రతి 10 మందికి 8 మందిలో మల్టీ డ్రగ్‌ రెసిస్టెంట్‌ బ్యాక్టీరియా

  • వాటిపై పనిచేయని తొలి 3 లైన్ల మందులు

  • నాలుగో లైన్‌లోనూ పనిచేస్తున్నవి 2 రకాలే

  • అవి కూడా పనిచేయకపోతే ఇక ప్రమాదమే

  • ఏఐజీ ఆస్పత్రి విస్తృత అధ్యయనంలో వెల్లడి

(హైదరాబాద్‌ సిటీ-ఆంధ్రజ్యోతి)

మానవాళికి వరంలా అందివచ్చిన యాంటీబయాటిక్స్‌.. మన విచ్చలవిడి, విచక్షణ రహిత వినియోగం కారణంగా క్రమంగా శక్తిని కోల్పోతున్నాయి! వైద్యులు సిఫారసు చేసిన రీతిలో కాకుండా ఇష్టం వచ్చినట్టుగా వాడటం, పూర్తి కోర్సు వాడకుండా సగంలో ఆపేయడం వంటి కారణాల వల్ల బ్యాక్టీరియాలు.. యాంటీ బయాటిక్స్‌ నిరోధకతను సంతరించుకుని బలంగా మారుతున్నాయి!! మరీ ముఖ్యంగా మన దేశంలో ఈ సమస్య మరింత ఎక్కువగా ఉందని.. ఎండోస్కోపీ చేయించుకోవడానికి ఆస్పత్రికి వస్తున్న 83శాతం మంది (ప్రతి 10 మంది పేషెంట్లలో.. సగటున 8మంది) శరీరంలో మల్టీ డ్రగ్‌ రెసిస్టెంట్‌ బ్యాక్టీరియా (అంటే.. రకరకాల యాంటీబయాటిక్స్‌ మందులకు లొంగని సూక్ష్మజీవులు) ఉంటున్నట్టు తాజాగా వెల్లడైంది. భారత్‌, అమెరికా, ఇటలీ, నెదర్లాండ్స్‌లో ఏసియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ గ్యాస్ట్రో ఎంటరాలజీ ఈ అధ్యయనాన్ని నిర్వహించింది. ఆ నివేదిక ప్రకారం.. మందులకు లొంగని సూక్ష్మజీవులను కలిగి ఉన్న పేషెంట్ల సంఖ్య ఇటలీలో 31.5 శాతం (ప్రతి పదిమందిలో ముగ్గురు) ఉండగా.. అమెరికాలో 20.1 శాతం, నెదర్లాండ్స్‌లో కేవలం 10.8 శాతం ఉన్నారు. భారత్‌లో యాంటీబయాటిక్‌ రెసిస్టెన్స్‌ తీవ్రత ఏ స్థాయిలో ఉందో వెల్లడించే ఈ అధ్యయన వివరాలు ఇటీవల వెల్లడయ్యాయి. ఈ అధ్యయనంలో భాగంగా నాలుగు దేశాల్లో 1,200 మంది పేషెంట్ల నమూనాలను పరిశీలించారు. వారిలో భారతీయుల్లోనే అత్యధికంగా మందులకు లొంగని బ్యాక్టీరియా ఉన్నట్టు గుర్తించారు. భారతీయ పేషెంట్లలో 70.2 శాతం మందిలో ‘ఈఎ్‌సబీఎల్‌ ప్రొడ్యూసింగ్‌ ఆర్గానిజమ్స్‌’.. 23.5 శాతం మందిలో ‘కార్బాపెనమ్‌ రెసిస్టెంట్‌ బ్యాక్టీరియా’ ఉన్నట్టు గుర్తించారు. ఈఎ్‌సబీఎల్‌ ప్రొడ్యూసింగ్‌ ఆర్గానిజమ్స్‌ అంటే.. ఎక్స్‌టెండెడ్‌ స్పెక్ట్రమ్‌ బీటా లాక్టమేజ్‌ అనే ఎంజైమ్‌ను తయారుచేసే సూక్ష్మజీవులు ఇవి. ఈ ఎంజైము.. పెన్సిలిన్‌, సెఫాలోస్పోరిన్‌ వంటి ముఖ్యమైన యాంటీబయాటిక్స్‌ను విరిగిపోయేలా చేసి, అవి పనిచేయకుండా చేస్తుంది. ఇక కార్బాపెనెమ్‌ అంటే.. చివరి అవకాశంగా ఉపయోగించే యాంటీబయాటిక్‌ ఔషధాల వరుస.


ఇలాంటివాటికి సైతం నిరోధకత సంతరించుకున్న సూక్ష్మజీవుల కారణంగా వచ్చే ఇన్ఫెక్షన్లకు చికిత్స చేయడం చాలా కష్టమవుతోంది. వీటిని లొంగదీయడానికి ఆస్పత్రుల్లో వైద్యనిపుణులు చాలా ఎక్కువగా కష్టపడాల్సి వస్తోంది. కొన్ని సందర్భాల్లో పేషెంట్లు ఐసీయూలో ఎక్కువ రోజులు ఉండాల్సి రావడంతో వారిపై ఆర్థిక భారం కూడా భారీగా పెరిగిపోతోంది. బ్యాక్టీరియల్‌ ఇన్ఫెక్షన్ల చికిత్సలో భాగంగా వాడే మొదటి మూడు లైన్ల మందులూ ఈ తరహా బ్యాక్టీరియాపై పనిచేయడంలేదని.. దీంతో నాలుగో లైన్‌ మందులు వాడాల్సిన పరిస్థితి ఏర్పడుతోందని వైద్యులు చెబుతున్నారు. అందులో కేవలం రెండు రకాలు మాత్రమే ఉన్నాయని.. అవీ పనిచేయని పరిస్థితి వస్తే ఇక చేసేదేమీ ఉండదని హెచ్చరిస్తున్నారు. ఈ అధ్యయన ఫలితాలు లాన్సెట్‌ జర్నల్‌లో ఇటీవల ప్రచురితమయ్యాయి.

కారణాలు ఇవి...

ఎవరు పడితే వారు సులువుగా, సొంతంగా మందులు తీసుకోవడం, వైద్యులు సూచించిన కోర్సు ప్రకారం యాంటీ బయాటిక్స్‌ వినియోగించకపోవడం. మనదేశంలో ప్రిస్ర్కిప్షన్‌ లేకున్నా యాంటీ బయాటిక్స్‌ను ఓవర్‌ ది కౌంటర్‌ విధానంలో మందుల దుకాణానికి వెళ్లి ఎవరైనా కొనుక్కునే వీలుండడమే ఈ సమస్యకు ప్రధాన కారణం. కాగా.. నానాటికీ ఆందోళనకరంగా మారుతున్న యాంటీబయాటిక్‌ రెసిస్టెన్స్‌పై.. తాము నిర్వహించిన ఈ అధ్యయన ఫలితం ఇప్పటి వరకూ వినని అతిపెద్ద అలారంగా డాక్టర్‌ డి. నాగేశ్వర్‌ రెడ్డి అభివర్ణించారు. ఎండోస్కోపీ కోసం వచ్చే పేషెంట్లలోనే 80 శాతానికి పైగా మందులకు లొంగని బ్యాక్టీరియా ఉందంటే.. ఈ సమస్య ఆస్పత్రులకే పరిమితం కాదని, సమాజంలో, నిత్య జీవితంలో భాగమైనట్టేనని ఆందోళన వ్యక్తం చేశారు. పరిస్థితి ఇలాగే కొనసాగితే సమీప భవిష్యత్తులోనే.. చిన్నచిన్న ఇన్ఫెక్షన్లు సైతం చికిత్సకు లొంగని పరిస్థితి వస్తుందని హెచ్చరించారు. ‘‘యాంటీబయాటిక్స్‌ వినియోగంపై అవగాహన కోసం ఒక జాతీయ ఉద్యమం అవసరం’’ అని ఆయన పేర్కొన్నారు.

ఏఐజీలో రెండేళ్ల పాటు అధ్యయనం

రెండేళ్ల పాటు నిర్వహించిన ఈ అధ్యయనంలో భాగంగా ఏఐజీ ఆస్పత్రికి వచ్చిన రోగుల్లో 18 ఏళ్లు పైబడినవారిని పరీక్షించామని.. పిల్లలపై ప్రత్యేక అధ్యయనం చేయనున్నామని డాక్టర్‌ నాగేశ్వర్‌రెడ్డి వివరించారు. వైద్యుడు రాసిన మందుల చీటీ ఉన్నవారికి మాత్రమే యాంటీబయాటిక్‌ ఔషధాలను విక్రయించేలా కఠిన చట్టాలు తేవాల్సిన అవసరం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. దేశంలో యాంటీబయాటిక్‌ ఔషధాల వినియోగాన్ని డిజిటల్‌గా ట్రాక్‌ చేయాలని సూచించారు.

ప్రజలు పాటించాల్సిన 6 సూత్రాలు

  • యాంటీబయాటిక్స్‌ వినియోగానికి సంబంధించి డాక్టర్‌ నాగేశ్వర్‌ రెడ్డి సూచించిన ఆరు సూత్రాలు ఇవీ..

  • వైద్యులు సిఫారసు చేయకుండా యాంటీబయాటిక్స్‌ తీసుకోవద్దు

  • వైరల్‌ ఇన్ఫెక్షన్లకు యాంటీబయాటిక్స్‌ ఇవ్వాలని అడగొద్దు.

  • యాంటీబయాటిక్‌ మందులను.. పూర్తి కోర్సు వేసుకోవాలి. అంటే.. వైద్యులు ఎన్ని రోజులు వాడాలని సూచిస్తే అన్ని రోజులూ వాడాలి. రోగం తగ్గింది కదాని మధ్యలోనే ఆపేయకూడదు.

  • శుభ్రత పాటించాలి.

  • టీకాలు సమయానికి వేయించుకోవాలి.

  • పెంపుడు జంతువులు, పశువులకు వైద్యుల సలహా లేకుండా యాంటీబయాటిక్స్‌ ఇవ్వొద్దు. దేశవ్యాప్తంగా అందరూ వీటిని పాటిస్తే యాంటీబయాటిక్‌ రెసిస్టెన్స్‌ను గణనీయంగా తగ్గించవచ్చని డాక్టర్‌ నాగేశ్వర్‌ రెడ్డి తెలిపారు.

Updated Date - Jan 04 , 2026 | 03:59 AM