నచ్చకపోతే వదిలేయొచ్చుగా!
ABN , Publish Date - Jun 28 , 2026 | 03:09 AM
హనీమూన్‌కు వెళ్లి ప్రియుడితో కలిసి భర్త రాజా రఘువంశీని చంపేసిన సోనమ్ గురించి మరువకముందే.. పుణెకు చెందిన సియా అనే యువతి తన కాబోయే భర్త కేతన్ అగర్వాల్‌ను లోయలోకి తోసి....
దేశంలో ప్రతి 32 గంటలకూ భార్య/ప్రియురాలి చేతిలో ఒక పురుషుడి మరణం.. అధ్యయనంలో వెల్లడి
గత ఏడాది దేశంలో ఇలాంటివి 280-300 కేసులు
వ్యక్తిత్వ లోపమే ప్రధాన కారణం: సైకియాట్రిస్టులు
దీన్నో సామాజిక సమస్యగానే చూడాలి తప్ప స్త్రీలను ఆడిపోసుకోవడం సరికాదు: సామాజిక శాస్త్రవేత్తలు
స్త్రీలు తమ అభిప్రాయాల్ని స్వేచ్ఛగా తెలిపే పరిస్థితి ఉన్నప్పుడే ఇలాంటి ఘటనలు తగ్గుతాయని వెల్లడి
చంపడం ఏ సమస్యకూ పరిష్కారం కాదని సినిమాలు,సాహిత్యం ద్వారా అర్థమయ్యేలా చేయాలని సూచన
గృహహింస కారణంగా దేశంలో ప్రతి 90 నిమిషాలకూ ఓ మహిళ హత్య.. వాటి సంగతేంటని కొందరి ప్రశ్న
హైదరాబాద్ సిటీ, జూన్ 27 (ఆంధ్రజ్యోతి): హనీమూన్‌కు వెళ్లి ప్రియుడితో కలిసి భర్త రాజా రఘువంశీని చంపేసిన సోనమ్ గురించి మరువకముందే.. పుణెకు చెందిన సియా అనే యువతి తన కాబోయే భర్త కేతన్ అగర్వాల్‌ను లోయలోకి తోసి చంపిన ఉదంతం దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. ఇవే కాదు.. నచ్చిన వ్యక్తితో కలిసి బతకడానికి అడ్డు అనుకున్న తన ముగ్గురు పిల్లలను గొంతునులిమి చంపిన తల్లి... భర్తను చంపి డ్రమ్ములో కుక్కి సిమెంటుతో కప్పెట్టిన ఇల్లాలు... బీమా సొమ్ము కోసం మగడి ప్రాణాలు తీసిన గృహిణి.. ప్రియుడి ఆకర్షణలో పడి వరుడిని కిరాయి గూండాలతో చంపించిన వధువు.. సహజీవనం చేస్తున్న వ్యక్తితో కలిసి తల్లిదండ్రులను, చెల్లెలిని చంపిన యువతి.. ఇలా ఇటీవలికాలంలో వరుస ఘటనలు సంచలనానికి కారణమవుతున్నాయి!! ‘‘కారణాలేవైనాగానీ.. కట్టుకున్నవాడిని, కన్నబిడ్డలను.. చివరికి కన్నవారిని సైతం కడతేర్చేంత కర్కశంగా మారడమేంటి? నచ్చకపోతే వదిలేయచ్చు కదా! చంపడమేమిటి?’’ అనేది మెజారిటీ సమాజం వాదన. ఇలాంటి ఘటనల సంఖ్య పెరుగుతున్న మాట నిజమేగానీ.. వాటి వెనుక కారణాలను, మూలాలను లోతుగా ఆలోచించడానికి, అర్థం చేసుకోవడానికి ఎవరూ సిద్ధంగా లేకపోవడం బాధాకరమని సామాజిక వేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దేశంలో ప్రతి 90 నిమిషాలకు ఒక మహిళ వరకట్నం, గృహహింస కారణంగా హత్యకు గురవుతుంటే.. పట్టించుకోని సమాజం ఈ కేసులను మాత్రం భూతద్దంలో చూడడం ఎంతవరకూ సమంజసమని మరికొందరు ప్రశ్నిస్తున్నారు.
గణాంకాలు ఇలా..
మన దేశంలో భార్య లేదా జీవిత సహచరి చేతిలో ప్రతి 32 గంటలకు ఒక పురుషుడు హత్యకు గురవుతున్నాడని అలీగఢ్ ముస్లిం వర్సిటీ న్యాయశాస్త్ర విద్యార్థి మొహమ్మద్ అదాన్ ఒక అధ్యయనం చేసి వెల్లడించారు. ఆయన అధ్యయనం ప్రకారం.. దేశవ్యాప్తంగా మీడియాలో గత సంవత్సరం రిపోర్టయిన కేసులను పరిశీలిస్తే 280 నుంచి 300 మంది పురుషుల హత్య వెనుక వారి జీవిత భాగస్వామి/ప్రియురాలి ప్రమేయం ఉన్నట్లు వెల్లడైంది. ఇలాంటి కేసులు 2022లో 271 నమోదు కాగా.. 2023లో 280 కేసులు, 2024లో 290 కేసులు మీడియా ద్వారా వెలుగుచూశాయి. ఈ కేసుల్లో 40 శాతం మంది విషప్రయోగం ద్వారా హత్యలకు పాల్పడగా.. 25 శాతం గొంతు నులిమి చంపారని.. 15ు కిరాయి గూండాలను ఆశ్రయించి హత్యచేయించారని అదాన్ తన నివేదికలో పేర్కొన్నారు. భార్యలు భర్తలను చంపిన కేసుల్లో 80 శాతం వివాహేతర సంబంధం, ప్రియుడి ప్రోద్బలం ప్రధాన కారణాలుగా ఉన్నట్లు ఆయన వివరించారు. జీవిత బీమా సొమ్ము కోసం కూడా హత్యలకు పాల్పడిన దాఖలాలున్నాయి.

వ్యక్తిత్వ లోపాలు...
జీవిత భాగస్వామిని, కన్నబిడ్డలను సైతం చంపడానికి వెనుకాడని నేరస్వభావం వెనుక చాలావరకు వ్యక్తిత్వ లోపమే ప్రధాన వాహకంగా పనిచేస్తుందని సీనియర్ సైకియాట్రిస్ట్ డాక్టర్ శ్రీలక్ష్మి పేర్కొన్నారు. మనుషుల్లో సాధారణంగా రెండు నుంచి నాలుగు శాతం మందిలో యాంటీ సోషల్ పర్సనాలిటీ డిజార్డర్ కనిపిస్తుందని.. పురుషులతో పోలిస్తే మహిళల్లో ఈ మానసిక రుగ్మత చాలా తక్కువగా 0.5 నుంచి 1.5 శాతం మందిలో మాత్రమే ఉంటుందని మనస్తత్వ నిపుణుల అంచనా. యాంటీ సోషల్ పర్సనాలిటీ డిజార్డర్ ఉన్నంత మాత్రాన హత్యలకు పాల్పడతారని కాదుగానీ.. కానీ అలాంటి వారిలో నేరస్వభావం పాళ్లు కాస్త ఎక్కువ అని వారు చెబుతారు. అయితే.. ‘‘స్త్రీలైనా, పురుషులైనా ఈ రకమైన సమస్య కలిగిన వ్యక్తులను గుర్తించడం చాలా కష్టమే’’ అంటారు సైకియాట్రిస్ట్ డాక్టర్ దివ్య దేవులపల్లి. ‘‘యాంటీ సోషల్ పర్సనాలిటీ డిజార్డర్ ఉన్న వ్యక్తులు సులువుగా అబద్ధాలు చెబుతారు. తాము అనుకున్నది చేయడం కోసం ఎంతటి సాహసానికైనా ఒడిగడతారు. ఒకవేళ తప్పుచేసినా పశ్చాత్తాపం చెందరు. అవతలి వ్యక్తి ఇబ్బందులకన్నా వారి అనుకూలతకే అధిక ప్రాధాన్యత ఇస్తారు. వారికి భావోద్వేగాలపై నియంత్రణ ఉండదు. ఈ లక్షణాలున్న వ్యక్తులకు అదే స్వభావం కలిగిన వారు తోడైతే అంతే సంగతులు. ఇద్దరూ కలిసి చీమను నలిపేసింత సులభంగా మనిషి ఊపిరి తీసేయగలరు. భర్తను లేదా సహచరుడిని చంపడం వెనుక దాదాపుగా ప్రతి కేసులో ఆమె ప్రియుడు లేదా మరొక పురుషుడు సూత్రధారిగా వ్యవహరించడం ఇందుకు ఉదాహరణ. తాము చేసే హత్యల తాలూకూ పర్యవసానాల గురించిన కనీస ఆలోచన నిందితుల్లో ఉండదు’’ అని దివ్య విశ్లేషించారు.
రకరకాల ప్రభావాలు...
ఇప్పటితో పోలిస్తే ఒకప్పుడు కుటుంబంలోనూ, సమాజంలోనూ మహిళల పట్ల అణచివేత, నియంత్రణ, ఆంక్షలు లాంటివి ఎక్కువగా ఉండేవని.. అయితే హింసాత్మకమైన ప్రవర్తన కలిగిన ఆడవాళ్లు సైతం భర్తలను, అత్తింటివారిని వేరే విధంగా వేధించడం వరకే గానీ ప్రాణాలు తీసేంత సాహసానికి ఒడిగట్టే పరిస్థితులు, దానికి ప్రేరేపించే వాతావరణం అప్పట్లో దాదాపుగా ఉండేవి కావని ఆంత్రోపాలజిస్ట్ ప్రొఫెసర్ ఎన్. శ్రీనివాస్ పేర్కొన్నారు. ఈ స్మార్ట్‌ఫోన్ యుగంలో హింసను గొప్పగా చూపించే వీడియోలు, ఓటీటీలో క్రైం సినిమాలు.. కొందరిలో నేరప్రవృత్తికి ఆజ్యం పోస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ‘‘ఒకప్పటితో పోలిస్తే ఇప్పుడు ప్రతికూల ఆలోచనల దిశగా మనసును ప్రేరేపించే సాధనాలు బోలెడు. కుటుంబంలో ఒకరినొకరు అర్థంచేసుకోలేని పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో.. ఇలాంటి ధోరణులను ఒక సామాజిక సమస్యగా చూసి, పరిష్కారాలపై దృష్టి పెట్టాలి తప్ప.. మహిళలను ఆడిపోసుకోవడం సరికాదు’’ అంటారు సామాజిక శాస్త్రవేత్త ప్రొఫెసర్ అపర్ణ రాయప్రోలు.
స్వేచ్ఛకు చోటెక్కడ?...
మారిన కాలమానపరిస్థితుల్లో మహిళలు అన్నిరంగాల్లో రాణిస్తున్నా.. తమ జీవితానికి సంబంధించిన నిర్ణయాలు తీసుకోవడంలో స్వేచ్ఛ లేకపోవడం ఇలాంటి పరిణామాలకు దారితీస్తోందని సామాజిక శాస్త్రవేత్తలు అభిప్రాయపడుతున్నారు. ఉదాహరణకు.. అమీన్‌పూర్ ఘటనలో గ్రాడ్యుయేషన్ చదివిన అమ్మాయిని ఆమె కన్నా 20 ఏళ్లు పెద్దవాడైన, అంతగా చదువులేని వ్యక్తికి ఇచ్చి పెద్దలు బలవంతంగా పెళ్లి చేశారు. పదేళ్ల తర్వాత మళ్లీ కలిసిన మాజీ ప్రియుడు.. పిల్లలులేకుంటే పెళ్లి చేసుకుంటాననడంతో ఆమె వెనకాముందు ఆలోచించకుండా తన ముగ్గురు పిల్లలనూ చంపేసింది. పుణె కేసునే తీసుకుంటే.. తాను మరొక వ్యక్తిని ప్రేమిస్తున్నానని సియా తల్లిదండ్రులతో చెప్పినా వారు బలవంతంగా పెళ్లికి ఒప్పించినట్టు వెల్లడైంది. ఇలా చాలా కేసుల్లో మహిళల ఇష్టాయిష్టాలతో ప్రమేయం లేకుండా వివాహం చేయడం, ఆ వైవాహిక బంధం నుంచి బయటకు వచ్చి నచ్చినట్టుగా జీవించాలనుకున్నా.. ఆ విధమైన స్వేచ్ఛాయుత వాతావరణం కుటుంబంలో, సమాజంలో లేకపోవడం కూడా హత్యలవైపునకు పురిగొల్పేలా చేస్తున్నాయని ‘భూమిక’ ఉమెన్స్ కలెక్టివ్ నిర్వాహకురాలు కొండవీటి సత్యవతి పేర్కొన్నారు. ఇలాంటి నేరాల సంఖ్య పెరగడానికి కారణాలను సశాస్త్రీయంగా అధ్యయనం చేయకుండా అన్ని కేసులనూ ఒకే గాటన కట్టడం సరికాదని ఆమె అభిప్రాయపడ్డారు. ‘నచ్చకపోతే వదిలేయచ్చు కదా!’ అనడం చాలా తేలికేగానీ.. సమాజంలో అలా నచ్చని బంధాన్ని అంత తేలికగా వదులుకొనే పరిస్థితులు ఉన్నాయా? అని సామాజికశాస్త్రవేత్తలు ప్రశ్నిస్తున్నారు. అమ్మాయిలు స్వేచ్ఛగా తమ అభిప్రాయాలను వెల్లడించేందుకు అనువైన వాతావరణం ఉన్నప్పుడే ఇలాంటి నేరాలు తగ్గుముఖం పడతాయని అభిప్రాయపడుతున్నారు

థెరపీలతో ఫలితం ఉంటుంది
యాంటీ సోషల్ పర్సనాలిటీ డిజార్డర్ ఉన్నవారి ఆలోచనాధోరణి, ప్రవర్తన సాధారణ వ్యక్తుల కన్నా పూర్తి భిన్నంగా ఉంటుంది. అయితే ఇలాంటి నేర ప్రవర్తన మహిళలకన్నా మగవాళ్లలోనే ఎక్కువ. భర్తను లేదా తల్లిదండ్రులను, పిల్లలను చంపడం, హింసించడం లాంటి కేసుల్లో నిందితురాలి వెనుక ప్రధాన పాత్రధారిగా ఆమె ప్రియుడు లేదా సహచరుడు ఉండడం చాలా కేసుల్లో చూస్తున్నాం. సామాజిక మాధ్యమాలు, సినిమాలు కూడా మహిళలను ప్రభావితం చేస్తున్నాయి. నేరాలకు పురిగొల్పుతున్నాయి. ఈ డిజార్డర్ ఉన్న వ్యక్తుల్లో సమస్యను ముందే గుర్తించి, థెరపీలు, తగిన మందులు ఇవ్వడం ద్వారా కొంతమేరకు మార్పు తీసుకురావచ్చు. కొన్ని కేసుల్లో అనుమానంతో లేదంటే తాగొచ్చి భర్తపెట్టే హింసలు భరించలేక.. భార్య తిరగబడి కర్రతో కొట్టో, గొడ్డలితో నరికో చంపిన ఘటనలు చూస్తుంటాం. వీరిని యాంటీ సోషల్ పర్సనాలిటీ డిజార్డర్ కింద పరిగణించలేం.
- డా. దేవులపల్లి దివ్య, సైకియాట్రిస్ట్

కమ్యూనికేషన్ గ్యాప్‌ను తగ్గించడానికి ప్రయత్నించాలి
ఇలాంటి నేరాలను సామాజిక సమస్యగా గుర్తించాలి. పిల్లల పెంపకం గురించి కేవలం తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు మాత్రమే కాదు... రాజకీయ, సామాజిక వ్యవస్థలన్నీ ఆలోచించాలి. ఒక ఇంట్లో ఉంటున్నా, ఒకరి మనసులో ఏముందో మరొకరు తెలుసుకోలేనంతగా కమ్యూనికేషన్ గ్యాప్ పెరిగింది. దీన్ని తగ్గించడానికి ప్రయత్నించాలి. చంపడం సమస్యకు పరిష్కారం కాదని మన సినిమాలు, కథలు, సాహిత్యం ద్వారా అర్థమయ్యేలా చేయాలి. భార్య భర్తను చంపిందనగానే... ఇలాంటి కేసును మహిళలు వర్సెస్ పురుషులుగా చూడడం తగదు.
- ప్రొ. అపర్ణ రాయప్రోలు, సామాజిక శాస్త్రవేత్త, హెచ్‌సీయూ