వయసుడిగి..ఒంటరై..
ABN , Publish Date - Jul 07 , 2026 | 04:37 AM
దేశంలో వృద్ధుల జనాభా వేగంగా పెరుగుతోంది. దానికి సమాంతరంగా.. వారిని సామాజిక ఒంటరితనం వేధిస్తోంది. ‘ఇండియన్ జర్నల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్....
వృద్ధుల్లో పెరుగుతున్న ఒంటరితనం
పట్టణీకరణ, ఉమ్మడి కుటుంబాల విచ్ఛిన్నం, ఆర్థిక, అనారోగ్య సమస్యలే ప్రధాన కారణం
ఐజేఎంఆర్ తాజా అధ్యయనంలో వెల్లడి
వృద్ధులకు ప్రత్యేకంగా డే కేర్ సెంటర్లు, సామాజిక కార్యక్రమాలు నిర్వహించాలి
శారీరక, మానసిక ఆరోగ్య సంరక్షణ చర్యలు చేపట్టాలి: నిపుణులు
హైదరాబాద్, జూలై 6 (ఆంధ్రజ్యోతి): దేశంలో వృద్ధుల జనాభా వేగంగా పెరుగుతోంది. దానికి సమాంతరంగా.. వారిని సామాజిక ఒంటరితనం వేధిస్తోంది. ‘ఇండియన్ జర్నల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్’ దేశవ్యాప్తంగా 2015-25 మధ్యకాలంలో జరిగిన పలు అధ్యయనాలను విశ్లేషించి ఒక సమగ్ర పరిశోధన వ్యాసాన్ని జూలై సంచికలో ప్రచురించింది. చెన్నైకి చెందిన ప్రముఖ కమ్యూనిటీ హెల్త్ నిపుణులు నేహా మురళీధరన్, రాజేశ్వరన్ త్యాగేశన్, విజయప్రసాద్ గోపీచంద్రన్ సంయుక్తంగా రూపొందించిన ఈ వ్యాసంలో.. మన దేశంలోని వృద్ధుల మానసిక, సామాజిక స్థితిగతులపై ఆందోళనకరమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి. 2011 నాటికి దేశంలో 60 ఏళ్లకు పైబడిన వృద్ధుల సంఖ్య 10 కోట్లు ఉంటే.. 2036 నాటికి అది 23 కోట్లకు చేరుకుంటుందని అంచనా. ముఖ్యంగా కేరళ, తమిళనాడు, హిమాచల్ ప్రదేశ్‌లలో మొత్తం జనాభాలో వృద్ధుల వాటా 20 శాతం కంటే ఎక్కువగా ఉండబోతోంది. కాగా, దేశంలోని వృద్ధులలో అత్యధికులు గ్రామీణ ప్రాంతాల్లో, ఆర్థికంగా వెనుకబడిన పరిస్థితుల్లో జీవిస్తున్నారు. అంతేకాదు, వృద్ధులు సామాజికంగా, మానసికంగా ఒంటరితనానికి గురవుతున్నారు. ఒక వ్యక్తికి సమాజంతో లేదా కుటుంబంతో పరిచయాలు, సంబంధాలు పూర్తిగా తగ్గిపోవడాన్ని సామాజిక ఒంటరితనం అంటారు. అలాగే తాము కోరుకునే సామాజిక బంధాలకు, ప్రస్తుతం ఉన్న బంధాలకు మధ్య వ్యత్యాసం వల్ల కలిగే ఒక రకమైన బాధాకరమైన మానసిక భావనే మానసిక ఒంటరితనం. ఈ ఒంటరితనమనేది వృద్ధులలో పెరుగుతున్నట్లుగా తాజా వ్యాసం వెల్లడించింది. దేశవ్యాప్తంగా జరిగిన 20 వేర్వేరు అధ్యయనాలను పరిశీలించి పరిశోధకులు ఈ నిర్ధారణకు వచ్చారు. ‘లాంగిట్యూడినల్ ఏజింగ్ స్టడీ ఆఫ్ ఇండియా’ సర్వే ప్రకారం దేశంలో 60 ఏళ్లకు పైబడిన వారిలో 13.4ు మంది ఒంటరితనంతో బాధపడుతున్నారు. మరికొన్ని అధ్యయనాల ప్రకారం ఇది 27.6ు ఉంది. ఇంకొన్ని సర్వేలు ఏకంగా 55-66 శాతం వరకూ ఉందని వెల్లడించాయి.
వృద్ధుల్లో ఒంటరితనానికి కారణాలు
పట్టణీకరణ కారణంగా ఉమ్మడి కుటుంబాలు విచ్ఛిన్నమై చిన్న కుటుంబాలు (న్యూక్లియర్ ఫ్యామిలీస్) పెరిగిపోయాయి. ఉద్యోగాల కోసం యువత ఇతర ప్రాంతాలకు వలస వెళ్లడంతో వృద్ధులు ఇళ్లలోనే ఉండిపోతున్నారు.
పెన్షన్, స్థిరమైన ఆదాయం లేకపోవడం. ఇతరులపై ఆర్థికంగా ఆధారపడటం.
వయసు పెరగడం.. ముఖ్యంగా 75 ఏళ్లకు పైబడిన వారిలో మధుమేహం వంటి దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలు, నడవలేని స్థితి శారీరకంగా వారిని ఒంటరిని చేస్తున్నాయి.
భార్య లేదా భర్త చనిపోవడం, ఒంటరిగా జీవించడం, కొడుకులు, కోడళ్లు లేదా కుమార్తెలతో సత్సంబంధాలు లేకపోవడం, వృద్ధాప్యంలో వేధింపులకు గురికావడం వల్ల మానసిక కుంగుబాటు, ఆందోళన పెరుగుతున్నాయి.
ఒంటరితనంతో బాధపడే వృద్ధులలో గుండె జబ్బులు, తీవ్రమైన డిప్రెషన్, జ్ఞాపకశక్తి తగ్గడం, ఆత్మహత్య ఆలోచనలు వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉందని పరిశోధనలు హెచ్చరిస్తున్నాయి.
పరిష్కారానికి మార్గాలు
భారతదేశంలో వృద్ధుల ఒంటరితనంపై జాతీయస్థాయిలో స్పష్టమైన, ప్రామాణికమైన అధ్యయనాలు జరగాల్సిన అవసరం ఉందని ఈ పరిశోధన పేర్కొంది. వృద్ధుల జీవితాలను సంతోషంగా, సంతృప్తిగా మలచటానికి నిపుణులు కొన్ని కీలక సూచనలు చేశారు.
కమ్యూనిటీ ప్రోగ్రామ్: వృద్ధుల కోసం ప్రత్యేక డే-కేర్ సెంటర్లు, క్లబ్‌లు, వినోద కార్యక్రమాలను స్థానికంగా ఏర్పాటు చేయడం ద్వారా వారిని సామాజికంగా చురుకుగా ఉండేలా చేయాలి.
ఆరోగ్య సంరక్షణ: వృద్ధుల శారీరక ఆరోగ్యంతో పాటు మానసిక ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల ద్వారా క్రమం తప్పకుండా వారి ఇళ్లను సందర్శించి ఉచిత వైద్య పరీక్షలు అందించాలి.
సామాజిక మద్దతు: ఒంటరిగా నివసించే వృద్ధులకు సామాజికంగా మద్దతు ఎంతో అవసరం. ఈ విషయంలో ఇరుగుపొరుగున ఉండేవారు మానవీయంగా స్పందించి, వారితో ఆప్యాయంగా మెలగాలి. స్వచ్ఛంద సంస్థలు కూడా ఈ విషయంలో సేవా కార్యక్రమాలు నిర్వహించవచ్చు.