Students Protest: ఉపాధ్యాయురాలి తిట్లు భరించలేక..
ABN , Publish Date - Jan 09 , 2026 | 04:35 AM
మహిళా ఉపాధ్యాయురాలు చెప్పలేని రీతిలో బూతులు తిడుతున్నారని ఆరోపిస్తూ గురుకుల విద్యార్థినులు రోడ్డెక్కి నిరసన తెలిపారు.
రోడ్డెక్కిన గురుకుల విద్యార్థినులు!
నెలలుగా బూతులు తిడుతున్నారని ఆరోపణ
ఎడపల్లి, జనవరి 8(ఆంధ్రజ్యోతి): మహిళా ఉపాధ్యాయురాలు చెప్పలేని రీతిలో బూతులు తిడుతున్నారని ఆరోపిస్తూ గురుకుల విద్యార్థినులు రోడ్డెక్కి నిరసన తెలిపారు. నిజామాబాద్ జిల్లా ఎడపల్లిలోని బాలికల గురుకుల పాఠశాల/కళాలశాలలో ఇంగ్లిషు ఉపాధ్యాయురాలు రజని తమను బూతులు తిడుతున్నారంటూ.. గురుకులం ఎదుట రోడ్డుపైకి చేరుకొని నిరసన తెలిపారు. గమనించిన సిబ్బంది.. విద్యార్థులను బతిమాలి పాఠశాల ఆవరణలోకి తీసుకెళ్లి గేటుకు తాళం వేశారు. పాఠశాల ప్రిన్సిపాల్ వచ్చే వరకు లోనికి వెళ్లేదిలేదంటూ విద్యార్థులు గేటు వద్దే బైఠాయించారు.11:30కు పాఠశాలకు చేరుకున్న ప్రిన్సిపాల్.. విద్యార్థులతో మాట్లాడి వారిని పాఠశాల గదులల్లోకి పంపించారు. అనంతరం విద్యార్థుల పట్ల అనుచితంగా మాట్లాడిన ఉపాధ్యాయురాలిని ఇంటికి పంపించేశారు. ఘటనపై వివరణ కోరగా గత రెండు రోజులుగా తాను సెలవులో ఉన్నట్లు ప్రిన్సిపాల్ చెప్పారు. గురుకుల సొసైటీ కార్యదర్శి శుక్రవారం వస్తారని, అప్పటిదాకా టీచర్ రజనిని ఇంటికి పంపాలని తనకు ఉన్నతాధికారులు సూచించారని చెప్పారు.