Share News

kumaram bheem asifabad- రహదారులకు మరమ్మతులు చేపట్టాలని విద్యార్థినుల నిరసన

ABN , Publish Date - Sep 22 , 2026 | 10:45 PM

రహదారులను బాగు చేయాలని పుస్తకాలు పట్టి, బడిబాట పట్టాల్సిన విద్యార్థినులు తమ ప్రాథమిక హక్కుల కోసం రోడ్డెక్కారు. మండలంలోని లోడ్‌పల్లి గ్రామంలో మంగళవారం రోడ్డుపై బైఠాయించారు. పెంచికల్‌పేట్‌ నుంచి బెజ్జూరు వెళ్లే ప్రధాన రహదారి దారుణంగా దెబ్బతినడంతో, విసిగి పోయిన విద్యార్థులు, గ్రామస్థులు పెద్ద ఎత్తున రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు.

kumaram bheem asifabad- రహదారులకు మరమ్మతులు చేపట్టాలని విద్యార్థినుల నిరసన
రోడ్డుపై బైఠాయించిన విద్యార్థినులు

పెంచికల్‌పేట్‌, సెప్టెంబరు 22 (ఆంధ్రజ్యోతి): రహదారులను బాగు చేయాలని పుస్తకాలు పట్టి, బడిబాట పట్టాల్సిన విద్యార్థినులు తమ ప్రాథమిక హక్కుల కోసం రోడ్డెక్కారు. మండలంలోని లోడ్‌పల్లి గ్రామంలో మంగళవారం రోడ్డుపై బైఠాయించారు. పెంచికల్‌పేట్‌ నుంచి బెజ్జూరు వెళ్లే ప్రధాన రహదారి దారుణంగా దెబ్బతినడంతో, విసిగి పోయిన విద్యార్థులు, గ్రామస్థులు పెద్ద ఎత్తున రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. ఈ ప్రధాన రహదారి పూర్తిగా గుంతలు, బురదమయంగా మారటంతో రాక పోకలు సాగించటం నరక ప్రాయంగా మారిందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు. దీనికి తోడు రోడ్డు దెబ్బతినడంతో పాటు ఇరువైపులా ఉన్న ముళ్లపొదలు చెట్లు రోడ్డుపైకి రావడంతో రాక పోకలకు తీవ్ర ఇబ్బంది పడుతున్నామని వాపోయారు. ముళ్లపొదల వల్ల ఎదురుగా వచ్చే వాహనాలు కన్పించక రోడ్డు ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. ముఖ్యంగా వర్షాకాలంలో ఈ రోడ్డు దుస్థితి వర్ణనాతీతంగా తయారైంది. పాఠశాలకు వెళ్లే చిన్న పిల్లలు, నిత్యం ప్రమాదాల బారిన పడుతున్నారని ప్రాణాలను అరచేతిలో పెట్టుకొని ప్రయాణించాల్సి వస్తోందని మండిపడ్డారు. బురదలో నడువలేక ఎంతో మంది విద్యార్థులు బడికి వెళ్లడమే మానేస్తున్నారని, దీంతో వారి బంగారు భవిష్యత్తు గుంతల పాలవుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. అధికారులు, ప్రజాప్రతినిధులకు ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా ఫలితం లేక పోవటంతో విద్యార్థులు, గ్రామస్తులు ఆటో యూనియన్‌ సభ్యులు రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. సంఘటన స్థలానికి చేరుకున్న ఎస్సై అనిల్‌కుమార్‌ విద్యార్థులతో, గ్రామస్తుతో మాట్లాడి వారిని అక్కడి నుంచి పంపించారు. ఇప్పటికైనా స్థానిక ప్రజాప్రతినిధులు, సంబంధిత అదికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని విద్యార్థులు, గ్రామస్తులు కోరారు.

Updated Date - Sep 22 , 2026 | 10:45 PM