Share News

గురుకుల పాఠశాల విద్యార్థిని ఆత్మహత్య

ABN , Publish Date - Mar 30 , 2026 | 04:55 AM

మంచిర్యాల జిల్లా చెన్నూరులోని సాంఘిక సంక్షేమ బాలికల గురుకుల పాఠశాలలో ఏడో తరగతి విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడింది.

గురుకుల పాఠశాల విద్యార్థిని ఆత్మహత్య

  • ప్రిన్సిపాల్‌ వేధింపులే కారణమని తల్లిదండ్రుల ఆరోపణ

  • మంచిర్యాల జిల్లా చెన్నూరులో ఘటన

చెన్నూరు, మార్చి 29 (ఆంధ్రజ్యోతి): మంచిర్యాల జిల్లా చెన్నూరులోని సాంఘిక సంక్షేమ బాలికల గురుకుల పాఠశాలలో ఏడో తరగతి విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడింది. చెన్నూరు మండలం గంగారం గ్రామానికి చెందిన రాళ్లబండి రమేష్‌-చంద్రకళ దంపతుల కూతురు శ్రీవింధ్య(13).. ఈ నెల 25న పాఠశాల వసతి గృహంలోనే గడ్డిమందు తాగింది. గమనించిన పాఠశాల యాజమాన్యం వెంటనే ఆమెను చెన్నూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా, పరిస్థితి విషమించడంతో శనివారం మంచిర్యాలలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఆదివారం మృతి చెందింది. పాఠశాల ప్రిన్సిపాల్‌, ఉపాధ్యాయులు తమ కుమార్తెను చదువు విషయంలో తరచూ దూషించడం వల్లే.. మనస్తాపానికి గురై ఆత్మహత్య చేసుకుందని బాలిక తల్లిదండ్రులు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. గురుకులంలోకి గడ్డిమందు ఎలా వచ్చిందని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. 20 రోజుల క్రితం విద్యార్థులు ఔటింగ్‌కు వెళ్లిన సమయంలో శ్రీవింధ్య స్టీల్‌ బాటిల్‌ కొనుక్కుందని, అందులోనే గడ్డి మందు తెచ్చి దాచి ఉండవచ్చని పాఠశాల సిబ్బంది అంటున్నారు. విద్యార్థిని గడ్డిమందు తాగిన విషయాన్ని రహస్యంగా ఉంచడం, పోలీసులకు సమాచారం ఇవ్వకుండానే ఆస్పత్రికి తరలించడం పలు అనుమానాలకు తావిస్తోంది. ఈ విషయంపై ప్రిన్సిపాల్‌ స్రవంతిని వివరణ కోరేందుకు ప్రయత్నించగా ఆమె అందుబాటులోకి రాలేదు.

Updated Date - Mar 30 , 2026 | 04:55 AM