kumaram bheem asifabad- గంజాయి తరలిస్తే కఠిన చర్యలు
ABN , Publish Date - May 15 , 2026 | 10:18 PM
గంజాయి పండించినా, విక్రయించినా, అక్రమం గా రవాణా చేసినా కఠిన చర్యలు తప్పవని డీఎస్పీ అశోక్ హెచ్చరించారు. స్థానిక పోలీస్ స్టేషన్‌లో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డీఎస్పీ మాట్లాడారు. గ్రామీణ ప్రాంతాల్లో గిరిజనులు గంజాయి సాగు చేయడం వల్ల యువత గంజాయికి బానిసై నేరాలకు పాల్పడే అవకాశాలు ఉంటాయన్నారు.
వాంకిడి, మే 15 (ఆంధ్రజ్యోతి): గంజాయి పండించినా, విక్రయించినా, అక్రమం గా రవాణా చేసినా కఠిన చర్యలు తప్పవని డీఎస్పీ అశోక్ హెచ్చరించారు. స్థానిక పోలీస్ స్టేషన్‌లో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డీఎస్పీ మాట్లాడారు. గ్రామీణ ప్రాంతాల్లో గిరిజనులు గంజాయి సాగు చేయడం వల్ల యువత గంజాయికి బానిసై నేరాలకు పాల్పడే అవకాశాలు ఉంటాయన్నారు. మాదక దృవ్యాలకు బానిసై కుటుంబాలు బజారున పడే పరిస్థితులు ఉంటాయని చెప్పారు. రైతులు గంజాయి పంటల జోలికి పోవద్దన్నారు. మహారాష్ట్ర నుంచి అక్రమంగా పశువులను రవాణా చేసిన వారిపై పీడీ యాక్టు అమలు చేసి కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. వాంకిడి సరిహద్దులో అక్రమంగా రవాణా జరుగకుండా కట్టుదిట్టమైన చర్యలు చేపడుతున్నామని తెలిపారు. గ్రామాల్లో అన్ని వర్గాల ప్రజలు కలిసిమెలిసి ఉండాలని సూచించారు. డీజేలు పెట్టడం పూర్తిగా నిషేధమని చెప్పారు. ఎవరైనా డీజేలు వినియోగిస్తే సీజ్ చేసి కేసు నమోదు చేస్తామని తెలిపారు. గ్రామీణ ప్రాంతాల యువకులు వ్యసనాలవైపు వెళ్ల కుండా చదువుపై ఎక్కువ దృష్టి సారించాలన్నారు. గ్రామాల్లో ఎవరైనా కొత్త వ్యక్తులు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని సూచించారు. ఎక్కడైనా గంజాయి విక్రయించినా, రవాణా చేసినా, పేకాట ఆడినా, నిషేధిత వస్తువులు తరలించినా ప్రజలు సమాచారం అందించి సహకరించాలని ఆయన కోరారు. కార్యక్రమంలో సీఐ వేణుగోపాల్, ఎస్సై మహేందర్ పాల్గొన్నారు.