Minister Ponguleti Srinivas Reddy: ప్రభుత్వ సొమ్ము దుర్వినియోగం చేస్తే సహించం
ABN , Publish Date - Jan 12 , 2026 | 03:57 AM
ప్రభుత్వ సొమ్ము దుర్వినియోగానికి పాల్పడిన వారిపై అత్యంత కఠినంగా వ్యవహరించాలని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి అధికారులను ఆదేశించారు.
పక్కదారి పట్టిన స్టాంప్ డ్యూటీని అణాపైసాతో సహా వసూలు చేస్తాం
ధరణిలో లొసుగులతో అక్రమాలకు పాల్పడిన వారిని వదిలిపెట్టేది లేదు
రాష్ట్రవ్యాప్తంగా ఆడిటింగ్ నిర్వహిస్తాం
రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి
హైదరాబాద్, జనవరి 11(ఆంధ్రజ్యోతి): ప్రభుత్వ సొమ్ము దుర్వినియోగానికి పాల్పడిన వారిపై అత్యంత కఠినంగా వ్యవహరించాలని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి అధికారులను ఆదేశించారు. ఆదివారం మంత్రుల క్వార్టర్స్‌లోని తన నివాసంలో రెవెన్యూ అధికారులతో సమావేశమైన ఆయన జనగాం తదితర ప్రాంతాల్లో బయటపడిన స్టాంప్ డ్యూటీ సొమ్ము చెల్లింపుల్లో అక్రమాలపై సమీక్షంచారు. గత ఐదేళ్ల లావాదేవీలపై ఆడిట్ నిర్వహించగా మొత్తం 52 లక్షల లావాదేవీల్లో 4,800 లోపాలు గుర్తించామని తెలిపారు. వీటిలో దాదాపు 3,000 లోపాలు రంగారెడ్డి, యాదాద్రి జిల్లాల్లో ఉన్నాయన్నారు. వీటికి సంబంధించిన సొమ్మును రికవరీ చేస్తామని తెలిపారు. రెవెన్యూ యంత్రాంగం ఇటీవల రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించిన ఆడిటింగ్‌లో భూముల రిజిస్ట్రేషన్ కోసం ప్రజలు చెల్లించిన స్టాంప్ డ్యూటీ, రిజిస్ట్రేషన్ చలాన్ సొమ్ము పక్కదారి పట్టిన విషయాన్ని గుర్తించారని తెలిపారు. గత ప్రభుత్వం తీసుకొచ్చిన ధరణి పోర్టల్‌లో ఆడిటింగ్ విధానం లేకపోవడమే అక్రమాలకు ప్రధాన కారణమని ప్రాథమికంగా గుర్తించామని తెలిపారు. ధరణి పోర్టల్ అమలులోకి వచ్చిన నాటి నుంచి రాష్ట్రవ్యాప్తంగా జరిగిన అన్ని లావాదేవీలపై సమగ్ర ఆడిటింగ్ నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. ప్రభుత్వ భూముల ఆక్రమణలకు ప్పాలడినా, ప్రభుత్వానికి రావలసిన ఒక్కపైసా పక్కదారి పట్టినా సహించేది లేదని హెచ్చరించారు. ప్రజల సొమ్ముతో ఆడుకున్న వారిని చట్టం ముందు నిలబెట్టి కఠినంగా శిక్షస్తామని, ఇలాంటి అక్రమాలకు ఇకపై తావు ఉండదన్నారు.