Share News

Drug Control Administration: నకిలీ మందుల మాఫియాపై ఉక్కుపాదం

ABN , Publish Date - Jan 01 , 2026 | 07:49 AM

ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతోన్న నకిలీ మందుల మాఫియాపై తెలంగాణ ఔషధ నియంత్రణ విభాగం(డీసీఏ) 2025లో ఉక్కుపాదం మోపింది.

Drug Control Administration: నకిలీ మందుల మాఫియాపై ఉక్కుపాదం

  • 2025లో రాష్ట్రంలోని 28,816చోట్ల ఔషధ నియంత్రణ విభాగం తనిఖీలు

  • 27 సంస్థల ఉత్పత్తి అనుమతులు రద్దు

  • 217 మందికి శిక్ష.. 140 మందిపై కేసు

  • డీసీఏ వార్షిక నివేదికలో వెల్లడి

హైదరాబాద్‌, డిసెంబరు 31 (ఆంధ్రజ్యోతి): ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతోన్న నకిలీ మందుల మాఫియాపై తెలంగాణ ఔషధ నియంత్రణ విభాగం(డీసీఏ) 2025లో ఉక్కుపాదం మోపింది. ఆ విభాగం బుధవారం విడుదల చేసిన వార్షిక నివేదిక ప్రకారం.. రాష్ట్రవ్యాప్తంగా 2025లో 28,816చోట్ల తనిఖీలు చేపట్టి, రూ.139 కోట్ల విలువైన అక్రమ మందులను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఆరు భారీ నకిలీ మందుల రాకెట్ల గుట్టు రట్టు చేసి.. 5,278 మందిపై చర్యలు తీసుకున్నారు. వారిలో 217 మందికి కోర్టుల్లో శిక్షలు పడ్డాయి. అలాగే.. ఇతర రాష్ట్రాల నుంచి హైదరాబాద్‌ మీదుగా సాగుతున్న అంతరాష్ట్ర నెట్‌వర్క్‌లను డీసీఏ అధికారులు పట్టుకున్నారు. డీసీఏ చరిత్రలోనే తొలిసారిగా నకిలీ మందుల కేసుల్లో నలుగురు డీలర్లను అరెస్టు చేసి జైలుకు పంపారు. డీసీఏ ఈ ఏడాది సేకరించిన 4,801 నమూనాలను విశ్లేషించగా, అందులో 84 రకాల మందులు నాణ్యత లేనివి అని తేలింది. దీంతో వాటిని తయారుచేస్తున్నకంపెనీలపై అధికారులు కఠిన చర్యలు చేపట్టారు. నిబంధనలు ఉల్లఘించిన 34 యూనిట్లకు స్టాప్‌ ప్రొడక్షన్‌ ఆదేశాలు జారీ చేశారు. అలాగే 27 కంపెనీల ప్రొడక్టు లైసెన్స్‌లను, 16 సంస్థల లైసెన్స్‌లను రద్దు చేశారు. 18 రకాల ఔషధాల ఉత్పత్తిని నిలిపివేశారు. 59 సంస్థలకు హెచ్చరిక లేఖలు పంపారు. ఎక్సైజ్‌ శాఖతో కలిసి జరిపిన దాడుల్లో భారీగా ఆల్ర్పాజోలం ట్యాబ్లెట్స్‌(1.2 లక్షలు), కోడీన్‌ సిర్‌పలను పట్టుకున్నారు. బాడీ బిల్డింగ్‌ పేరుతో జిమ్‌లలో విక్రయిస్తున్న మెఫంటర్‌మైన్‌ సల్ఫేట్‌ ఇంజెక్షన్లను పెద్దమొత్తంలో సీజ్‌ చేశారు. ప్రజలను తప్పుదోవ పట్టించే వ్యాపార ప్రకటనలపై కూడా దృష్టి సారించి.. డ్రగ్స్‌ అండ్‌ మ్యాజిక్‌ రెమెడీస్‌ యాక్ట్‌ కింద అత్యధికంగా 140 కేసులను నమోదు చేశారు. లైసెన్స్‌లు లేకుండా ఔషధాలు విక్రయిస్తున్న 38 దుకాణాలను మూసివేయించారు.

Updated Date - Jan 01 , 2026 | 07:49 AM