kumaram bheem asifabad-నేలకు బలం
ABN , Publish Date - Jul 04 , 2026 | 10:53 PM
రైతులు జీలుగ సాదు చేస్తే మంచి ఫలితాలు సాధించవచ్చు. రైతులు మోతాదుకు మించి రసాయన ఎరువులు వాడడంతో భూసారం కోల్పోతుంది. దీంతో పంట దిగుబడులు తగ్గుతున్నాయి. నేల, వాయు, కాలుష్యం పెరుగుతున్నాయని అంతా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ సమస్యలను అధిగమించేందుకు ప్రభుత్వం రాయితీపై పచ్చిరొట్ట ఎరువులను అందిస్తోంది. వీ
- రైతులు సద్వినియోగం చేసుకోవాలని అధికారుల సూచన
రెబ్బెన, జూలై 4 (ఆంధ్రజ్యోతి): రైతులు జీలుగ సాదు చేస్తే మంచి ఫలితాలు సాధించవచ్చు. రైతులు మోతాదుకు మించి రసాయన ఎరువులు వాడడంతో భూసారం కోల్పోతుంది. దీంతో పంట దిగుబడులు తగ్గుతున్నాయి. నేల, వాయు, కాలుష్యం పెరుగుతున్నాయని అంతా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ సమస్యలను అధిగమించేందుకు ప్రభుత్వం రాయితీపై పచ్చిరొట్ట ఎరువులను అందిస్తోంది. వీటి వాడకంతో భూసారం పెరుగడంతో పాటు దిగుబడులు ఆశించిన మేర వస్తాయని శాస్త్రవేత్తలు, వ్యవసాయాధికారులు సూచిస్తున్నారు. వానాకాలం సాగుకు రైతులు సన్నద్దమవుతున్న తరుణంలో 50 శాతం రాయితీపై జిల్లాలో పచ్చి రొట్ట, జీలుగు, జనుము విత్తనాలు అందుబాటులోకి తెచ్చారు.
జిల్లా వ్యాప్తంగా..
జిల్లా వ్యాప్తంగా అడపాదడపా వర్షాలు పడుతుండడంతో రైతులు దుక్కులు దున్నుతున్నారు. ఇందుకు అనుగుణంగా వ్యవసాయాధికారులు జీలుగు, జనుము విత్తనాలను అందుబాటులో ఉంచారు. జిల్లాలోని 15 మండలాలకు 120 క్వింటాళ్ల జీలుగు విత్తనాలు మాత్రమే వచ్చాయి. ఆయా మండల కేంద్రాల్లో అన్నదాతలకు విత్తనాలను అందుబాటులో ఉంచి గత ఐదు రోజుల నుంచి విత్తనాలు సరఫరా చేస్తున్నారు. మార్కెట్‌లో జీలుగు విత్తనం కిలో రూ.163.50 ఉండగా, ప్రభుత్వం రాయితీపై రూ.81.75కు అందజేస్తున్నారు. జనుము విత్తనం మార్కెట్‌లో రూ.155.50 ఉంది. రాయితీపై రూ.77.75, జీలుగు విత్తనాలు 30 కిలోల బస్తాకు రూ.2452.50, జనుము 40 కిలోల బస్తాకు రూ.3110 ధరను నిర్ణయించారు. హెక్టార్‌కు ఒక బస్తా సరి పోతోందని వ్యవసాధికారులు చెబుతున్నారు. ఈ విత్తనాలు వాడడంతో భూమిలో సేంద్రియ పదార్థం పెరిగి, నేల సారవంతమవుతుంది. నేలలో నైట్రోజన్ స్థాయి కూడా పెరుగుతుంది. నేల గుల్లబారి వానపాముల సంఖ్య అధికమవుతోంది. భూసారం పెరుగటం ద్వారా రసాయనిక ఎరువుల వాడకం తగ్గుతుంది. పెట్టుబడి ఖర్చులు తగ్గిపోతాయి. పర్యావరణ హితంగా మారి సుస్థిర వ్యవసాయానికి దోహదపడుతుంది.
భూసారం పెరుగుతుంది..
- దిలీప్‌కుమార్, వ్యవసాయాఽధికారి, రెబ్బెన
జీలుగు, జనుము, పచ్చిరొట్ట ఎరువుల వాడడంతో భూసారం పెరుగుతుంది. జిల్లాలో జీలుగు విత్తనాలు అందుబాటులో ఉన్నాయి. నేలలో కర్భనశాతం పెరగడంతో పంట ఏపుగా పెరుగుతోంది. దీంతో రసాయన ఎరువుల వాడకం తగ్గి అన్నదాతకు ఆర్థిక ప్రయోజనం కలుగుతుంది. ప్రభుత్వం రాయితీపై అందిస్తున్న విత్తనాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలి.