Share News

రేసింగ్‌.. నేరం, ప్రాణాంతకం

ABN , Publish Date - May 25 , 2026 | 05:29 AM

స్ట్రీట్‌ రేసింగ్‌, వీకెండ్‌ రేసింగ్‌ పేరు ఏదైనా అనధికార రేసింగ్‌ అనేది హైదరాబాద్‌కో.. మనదేశానికో మాత్ర మే పరిమితమైన సమస్య కాదు.

రేసింగ్‌.. నేరం, ప్రాణాంతకం

  • దాదాపు అన్ని దేశాల్లో స్ట్రీట్‌ రేసింగ్‌పై నిషేధం

  • రేసుల అడ్డుకట్టకు అమెరికాలో ప్రత్యేక టాస్క్‌ఫోర్స్‌

  • యూకేలో వాహనాల జప్తు, ఆస్ట్రేలియాలో వాహనాల ధ్వంసం

  • భారత్‌లో లైసెన్స్‌ రద్దు, జైలు శిక్షలు

హైదరాబాద్‌ సిటీ, మే 24 (ఆంధ్రజ్యోతి): స్ట్రీట్‌ రేసింగ్‌, వీకెండ్‌ రేసింగ్‌ పేరు ఏదైనా అనధికార రేసింగ్‌ అనేది హైదరాబాద్‌కో.. మనదేశానికో మాత్ర మే పరిమితమైన సమస్య కాదు. ప్రపంచ దేశాలను వేధిస్తున్న సమస్య. వారాంతం వచ్చిందంటే చాలు.. నగరాలు, పట్టణ శివారుల్లోని విశాలమైన రహదారుల్లో స్పోర్ట్స్‌ బైక్‌లతో స్ట్రీట్‌ రేసింగ్‌లకు, కార్‌ క్రూజింగ్‌లతో యువత చెలరేగిపోతున్నారు. ఈ రేసులు ఎంత ప్రమాదకరమంటే.. రేసులో పాల్గొనేవారితోపాటు పోటీని తిలకరించే వారు, అసలు ఈ పోటీలకు సంబంధం లేకుండా రోడ్లపై వెళ్లే వారు అందరి ప్రాణాలకు ముప్పే. ప్రాణాంతకమైన ఈ రేసులకు అడ్డుకట్ట వేసేందుకు ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాలు తమ వంతు ప్రయత్నాలు చేస్తున్నా యి డ్రైవింగ్‌ లైసెన్సుల రద్దు, భారీ జరిమానాలు, వాహనాల సీజ్‌, ధ్వంసం, జైలు శిక్షలు విధించడం వంటి చర్యలు తీసుకుంటున్నాయి. కానీ, పూర్తిగా నియంత్రిచలేకపోతున్నాయి. హైదరాబాద్‌లో రేసింగ్‌కు పాల్పడి ఎవరైనా పట్టుబడితే వారి డ్రైవింగ్‌ లైసెన్స్‌ సీజ్‌ చేయడం, తల్లిదండ్రులను పిలిపించి హెచ్చరించడం, వాహనాలను సీజ్‌చేయడం(అనూ హ్య సంఘటనలలో మాత్రమే) వంటి చర్యలను పో లీసులు తీసుకుంటున్నారు. కొన్ని విదేశాల్లో మాత్రం రేసింగ్‌కు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటున్నారు. మన దేశంలోనూ మరింత కఠినంగా చట్టాలను అమలు చేయాలనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.


అమెరికాలో రేసర్లతోపాటు ప్రేక్షకులు కూడా కటకటాల్లోకే..

అమెరికాలో రేసులు, కార్‌ క్రూజింగ్‌పై నిషేధం ఉంది. రేసులకు అడ్డుకట్ట వేసేందుకు లాస్‌ ఏంజెల్స్‌, అట్లాంటా లాంటి నగరాల్లో స్ట్రీట్‌ రేసింగ్‌ టాస్క్‌ఫోర్స్‌లను పోలీస్‌ శాఖ ఏర్పాటు చేసింది. అమెరికాలో రేసర్లతోపాటు రేసులను చూడడానికి వచ్చే ప్రేక్షకులను కూడా అరెస్టు చేసి శిక్షలు పడేలా చేస్తున్నారు. పట్టుబడిన వాహనాలను కనీసం నెల రోజులు జప్తు చేస్తున్నారు. యునైటెడ్‌ కింగ్‌డమ్‌(యూకే)లో బైక్‌లు, కార్లతో స్టంట్‌లు చేయడం చట్టవిరుద్ధం. నిబంధనలు ఉల్లంఘిస్తే జైలు శిక్ష, భారీ జరిమానాలు విధించడంతో పాటు వాహనాలు స్వాధీనం చేసుకుంటారు. పట్టుబడిన వాహనాలను రెండు రోజుల్లోపే ధ్వంసం చేసే అధికారం కూడా పోలీసులకు ఉంది. ఆస్ట్రేలియాలో ప్రమాదకరంగా వాహనాలను నడపటాన్ని హూనింగ్‌ అంటారు. హూనింగ్‌ చేస్తే మొదటి తప్పుకు 3-6 నెలల పాటు వాహనాలను సీజ్‌ చేస్తారు. పదేపదే తప్పు చేస్తూ పట్టుబడితే వాహనాన్ని వేలం వేయడం లేదా ధ్వంసం చేస్తారు. జర్మనీలో రేసులను నిర్వహించడం, పాల్గొనడం నేరం. ఇక్కడ రెండేళ్ల వరకూ జైలు శిక్ష పడుతుంది. రేసింగ్‌ వల్ల ఎవరి ప్రాణం అయినా పోతే హత్యానేరం కింద కఠిన శిక్షలు విధిస్తారు. స్విట్జర్లాండ్‌లో నిందితుడి ఆదాయాన్ని బట్టి జరిమానా విధిస్తారు.

ముంబైలో డ్రోన్‌ నిఘా..

హైదరాబాద్‌తోపాటు బెంగళూరు, విజయవాడ, చెన్నై, ఢిల్లీ, ముంబై సహా దేశంలోని పలు నగరాల్లోని పోలీసులు స్ట్రీట్‌ రేసింగ్‌ల విషయంలో కఠినంగానే ఉంటున్నారు. రేసింగ్‌ చేస్తూ పట్టుబడే వారిలో ఎక్కువ మంది విద్యార్థులే ఉంటారు. దీంతో పోలీసులు తొలుత విద్యార్థుల తల్లిదండ్రులను పిలిచి కౌన్సిలింగ్‌ ఇచ్చి, లిఖితపూర్వక హామీ తీసుకుని పం పిస్తుంటారు. ముంబైలో అయితే రేసింగ్‌పై నిఘా కోసం డ్రోన్లు వాడుతున్నారు. బెంగళూరులో రేస్‌లు చేస్తూ పట్టుబడితే లైసెన్స్‌ రద్దు చేస్తున్నారు. దేశంలోని ఇతర నగరాల్లోని పోలీసులు కూడా రేసర్లును పట్టుకొని భారీ జరిమానాలు విధించడం, లైసెన్సుల రద్దు చేయడం వంటివి చేస్తున్నారు. కేసు తీవ్రత దృష్ట్యా క్రిమినల్‌ కేసులు నమోదు చేస్తున్నారు. కాగా, భారత న్యాయ సంహిత కింద వచ్చిన నిబంధనల ప్రకారం రేసింగ్‌ చేసే వారే కాదు, వారిని ప్రోత్సహించే వారు.. అంటే ప్రేక్షకులపై కూడా కేసులు పెట్టవచ్చు. రేసింగ్‌ వల్ల మరణం సంభవిస్తే లేదంటే డ్రైవర్‌ ఘటనా స్థలం నుంచి పారిపోతే 10 ఏళ్ల జైలు శిక్ష, జరిమానా విధిస్తారు.

Updated Date - May 25 , 2026 | 05:29 AM