Share News

‘ఆగండి.. ఆలోచించండి.. అడుగేయండి’

ABN , Publish Date - Oct 02 , 2026 | 06:26 AM

సైబర్‌ మోసాలపై ప్రజల్లో అవగాహన కల్పిస్తూ తెలంగాణ సైబర్‌ సెక్యూరిటీ బ్యూరో ఆధ్వర్యంలో హైదరాబాద్‌ నెక్లెస్‌ రోడ్‌లో ప్రారంభించిన సైబర్‌ సెక్యూరిటీ ఫ్లాష్‌ కార్యక్రమం విజయవంతమైంది.

‘ఆగండి.. ఆలోచించండి.. అడుగేయండి’
awarness

  • సైబర్‌ మోసాలపై అవగాహనకు ‘పాజ్‌ ఫర్‌ సేఫ్టీ’

  • నెక్లెస్‌రోడ్‌లో కోలాహలంగా సాగిన 2కి.మీ. నైట్‌ వాక్‌

  • ప్రారంభించిన డీజీపీ సీవీ ఆనంద్‌, సినీ హీరో అడివి శేష్‌

  • వేలాదిగా పాల్గొన్న యువత, విద్యార్థులు

హైదరాబాద్‌, అక్టోబరు 1 (ఆంధ్రజ్యోతి): సైబర్‌ మోసాలపై ప్రజల్లో అవగాహన కల్పిస్తూ తెలంగాణ సైబర్‌ సెక్యూరిటీ బ్యూరో ఆధ్వర్యంలో హైదరాబాద్‌ నెక్లెస్‌ రోడ్‌లో ప్రారంభించిన సైబర్‌ సెక్యూరిటీ ఫ్లాష్‌ కార్యక్రమం విజయవంతమైంది. ‘పాజ్‌ ఫర్‌ సేఫ్టీ’ థీమ్‌ పేరిట గురువారం జరిగిన నైట్‌ వాక్‌ ప్రొగ్రాంకు విశేష స్పందన వచ్చింది. సైబర్‌ సెక్యూరిటీ బ్యూరో డైరెక్టర్‌ శిఖా గోయల్‌ పర్యవేక్షణలో జరిగిన ఈ రెండు కిలోమీటర్ల వాక్‌ను డీజీపీ సీవీ ఆనంద్‌ జెండా ఊపి ప్రారంభించారు. సినీ హీరో అడివి శేష్‌ ప్రత్యేక అతిథిగా హాజరయ్యారు. ‘ఆగండి. ఆలోచించండి. అడుగు వేయండి’ అనే నినాదంతో సాగిన ఈ కార్యక్రమంలో వేలాది మంది విద్యార్థులు, యువత ఉత్సాహంగా పాల్గొన్నారు. తమ మొబైల్‌ ఫోన్లలోని ఫ్లాష్‌లైట్లు, రిస్ట్‌బ్యాండ్లను వెలిగిస్తూ నడిచిన తీరు సైబర్‌ భద్రతపై అప్రమత్తత, ఐక్యతకు ప్రతీకగా నిలిచింది. సైబర్‌ భద్రత, మాదక ద్రవ్యాల నివారణ, మహిళల రక్షణ, ట్రాఫిక్‌, అగ్ని ప్రమాదాల భద్రతపై ఏర్పాటు చేసిన ఐదు అవగాహన స్టాళ్లు ఆకట్టుకున్నాయి. సైబర్‌ సెక్యూరిటీ బ్యూరో ఆధ్వర్యంలో నెలరోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఈ అవగాహన కార్యక్రమాలు నిర్వహించనున్నారు.


అప్రమత్తతే ఆయుధం: అడివి శేష్‌

ఈ సందర్భంగా అడివి శేష్‌ మాట్లాడుతూ.. ఇటీవల తనకు తెలిసిన వ్యక్తి ఒకరు డిజిటల్‌ అరెస్ట్‌ బెదిరింపులకు గురై భయాందోళనలను గురయ్యాడని గుర్తు చేసుకున్నారు. ఇలాంటి మోసాల బారిన ఎవరూ పడకూడదనే ఉద్దేశంతోనే తాను ఈ కార్యక్రమంలో భాగస్వామిని అయ్యానని చెప్పారు. అపరిచిత వ్యక్తుల నుంచి ఎలాంటి లింకులు వచ్చినా క్లిక్‌ చేసేముందు ఆలోచించాలని ఆయన సూచించారు. ప్రస్తుతం సమాజంలో డ్రగ్స్‌, సైబర్‌ క్రైం సమస్యలు ప్రధాన సవాళ్లుగా మారాయని, వీటిపై అవగాహన పెంచుకోవడమే సరైన పరిష్కారమని డీజీపీ సీవీ ఆనంద్‌ స్పష్టం చేశారు. గతేడాది రాష్ట్రంలో సైబర్‌ నేరగాళ్లు రూ.1,800కోట్లు కొట్టేశారని, ఈ ఏడాది ఇప్పటి వరకు 45,000 ఫిర్యాదులు వచ్చాయని తెలిపారు. బ్యాంకు అధికారులు ఎప్పుడూ వ్యక్తిగత వివరాలు, ఓటీపీలు అడగరని స్పష్టం చేశారు. కార్యక్రమంలో హైదరాబాద్‌, సైబరాబాద్‌, మల్కాజిగిరి, ఫ్యూచర్‌ సిటీ కమిషనర్లతో పాటు ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

Updated Date - Oct 02 , 2026 | 06:26 AM