పునర్విభజనను నిలిపివేయండి ఇందిర, వాజపేయిలా వ్యవహరించండి
ABN , Publish Date - Apr 19 , 2026 | 06:31 AM
లోక్‌సభ సీట్ల శాతాన్ని పెంచడం వల్ల సమస్య పరిష్కారం కాదని, పైగా దక్షిణాది, ఉత్తరాది రాష్ట్రాల మధ్య ఉన్న సీట్ల వ్యత్యాసం మరింత పెరుగుతుందని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు.
దక్షిణాది ప్రయోజనాలకు విరుద్ధంగా.. వ్యవహరిస్తే దేశవ్యాప్తంగా నిరసనలు
రైతు వ్యతిరేక చట్టాల్లాంటి పరిస్థితులొస్తాయి
దాదాపు 12 ఏళ్ల తరువాత పార్లమెంటులో.. మోదీ ప్రభుత్వాన్ని విపక్షాలు ఓడించగలిగాయి
రాబోయే రోజుల్లో మరిన్ని మార్పులు
కేంద్రంతో వైరం నా ఉద్దేశం కాదు
రాష్ట్ర ప్రయోజనాల విషయంలో రాజీ పడను
రాజ్‌దీప్ సర్దేశాయ్‌తో ఇంటర్వూలో సీఎం రేవంత్
న్యూఢిల్లీ, ఏప్రిల్ 18 (ఆంధ్రజ్యోతి): లోక్‌సభ సీట్ల శాతాన్ని పెంచడం వల్ల సమస్య పరిష్కారం కాదని, పైగా దక్షిణాది, ఉత్తరాది రాష్ట్రాల మధ్య ఉన్న సీట్ల వ్యత్యాసం మరింత పెరుగుతుందని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. దీంతో దక్షిణాది రాష్ట్రాల ప్రాతినిధ్యం, ప్రభావం తగ్గుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ పరిస్థితులు తలెత్తకుండా నియోజకవర్గాల పునర్విభజనను నిలిపివేయాలన్నారు. 1976లో ఇందిరాగాంధీ, 2001లో వాజపేయి.. దక్షిణాది రాష్ట్రాల జనాభా నియంత్రణ ప్రయత్నాలను గుర్తించి, ఆ సమతుల్యత దెబ్బతినకుండా నియోజకవర్గాల పునర్విభజనను తాత్కాలికంగా నిలిపివేశారని గుర్తుచేశారు. శనివారం ప్రముఖ జర్నలిస్టు రాజ్‌దీప్ సర్దేశాయ్‌తో జరిగిన ఇంటర్వ్యూలో రేవంత్ మాట్లాడుతూ ఈ విషయం పేర్కొన్నారు. మోదీ ప్రభుత్వం ఒకవేళ దక్షిణాది రాష్ట్రాల ప్రయోజనాలకు విరుద్ధంగా వ్యవహరిస్తే దేశవ్యాప్తంగా నిరసనలు తప్పవని, రైతు వ్యతిరేక చట్టాల సమయంలో జరిగినట్లుగానే ప్రభుత్వం వెనక్కి తగ్గాల్సి వస్తుందని హెచ్చరించారు. 2008లో ఉన్న ఫార్ములా ప్రకారమే డీలిమిటేషన్ చేపట్టాలన్నారు. లోక్‌సభ నియోజకవర్గం పరిధిలో ఎక్కువ మంది ప్రజలు ఉండడమన్నది సమస్యే కాదని రేవంత్ అన్నారు. ఎంపీల బాధ్యత చట్టాలు చేయడమని, చిన్న నియోజకవర్గాలకు ఎంపీలై గల్లీల్లో సమస్యలను పరిష్కరించడం వారి పని కాదని పేర్కొన్నారు.
తనకు 2034 వరకు తెలంగాణలో పూర్తి స్థాయి బాధ్యతలు ఉన్నాయని తెలిపారు. దేశవ్యాప్త సమస్యలపై పోరాడే విషయంలో.. పార్టీ ఆదేశిస్తే ఢిల్లీకి వచ్చి గళం విప్పుతానన్నారు. దాదాపు 12 ఏళ్ల తరువాత పార్లమెంటులో మోదీ ప్రభుత్వాన్ని విపక్షాలు ఓడించగలిగాయని, ఇది ప్రజాస్వామ్యానికి దక్కిన విజయమని అన్నారు. రాబోయే రోజుల్లో మరిన్ని మార్పులు వస్తాయన్నారు. కేంద్రం అన్ని నిర్ణయాలనూ ఢిల్లీ నుంచే తీసుకోవడం సరైన పద్ధతి కాదని రేవంత్ పేర్కొన్నారు. రాష్ట్రాల అవసరాలను, అక్కడి ప్రజల ఆకాంక్షలను గుర్తించి, నిర్ణయాధికారాల్లో రాష్ట్రాలకు ప్రాధాన్యం ఇవ్వాలని అన్నారు. కేంద్రంతో వైరం పెట్టుకోవడం తన ఉద్దేశం కాదని, కానీ.. రాష్ట్ర ప్రయోజనాలను కాపాడటంలో రాజీ పడే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు.