Share News

kumaram bheem asifabad- డంప్‌యార్డుతో కంపు

ABN , Publish Date - Aug 07 , 2026 | 11:04 PM

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొని మైనారిటీ విద్యార్థులకు విద్యను అందిస్తున్నప్పటికీ కాగజ్‌నగర్‌లోని మైనారిటీ విద్యాలయాలకు మాత్రం డంపు యార్డు కంపుతో ఇబ్బందులు తప్పడం లేదు. మండలంలోని బలగల, చింతగూడ కోయవాగు సమీపంలో ఆరేళ్ల కితం రూ. 18 కోట్లతో బాలురు-1 పాఠశాల భవనం నిర్మించారు. పక్కనే అంతే వ్యయంతో బాలురు-2 పాఠశాల ఉంది.

kumaram bheem asifabad- డంప్‌యార్డుతో కంపు
లోగో

- పట్టించుకోని అధికారులు

కాగజ్‌నగర్‌ టౌన్‌, ఆగస్టు 7 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొని మైనారిటీ విద్యార్థులకు విద్యను అందిస్తున్నప్పటికీ కాగజ్‌నగర్‌లోని మైనారిటీ విద్యాలయాలకు మాత్రం డంపు యార్డు కంపుతో ఇబ్బందులు తప్పడం లేదు. మండలంలోని బలగల, చింతగూడ కోయవాగు సమీపంలో ఆరేళ్ల కితం రూ. 18 కోట్లతో బాలురు-1 పాఠశాల భవనం నిర్మించారు. పక్కనే అంతే వ్యయంతో బాలురు-2 పాఠశాల ఉంది. ఈ రెండు పాఠశాల/కళాశాలల్లో కలిపి సుమారు 1000 మందికి పైగా విద్యార్థులుంటారు. ప్రస్తుతం ఈ భవనంలో 5 నుంచి ఇంటర్‌ కళాశాల కూడా కొనసాగుతోంది. బాలురు-1, బాలురు-2 హాస్టళ్లతో పాటు మధ్యలో ప్రభుత్వం మరి కొన్ని భవనాలు నిర్మించింది. వీటిలో ఖాళీగా ఉన్న ఒక భవనంలోకి మరో హాస్టళ్‌ను షిఫ్టు చేయగా ప్రస్తుతం మూడు హాస్టళ్లు ఒకే రోడ్డులో ఉన్నాయి. వీటిలో సుమారు 1,200 మందికిపైగా విద్యార్థులున్నప్పటికీ పక్కనే డంపు యార్డు ఉండడంతో గదుల్లోకి ఈగలు, దోమలు వస్తుండడంతో నరక యాతన పడుతున్నారు. మరో పక్క కోట్లాది రూపాయలు వెచ్చించి నిర్మించిన ఈ భవనాలకు రోడ్డు సౌకర్యం కల్పించ లేదు. వర్షాకాలం వస్తే చాలు రోడ్డు బురదమయంగా మారుతోంది. దీంతో విద్యార్థులు, తల్లిదండ్రులు, టీచింగ్‌, నాన్‌ టీచింగ్‌ స్టాఫ్‌ బాధలు వర్ణణాతీతంగా ఉన్నాయి. రోడ్లుపైనే డంపు యార్డు కుప్పలు, మరో వైపు వర్షాలకు బురదమయంగా మారిన రోడ్డుపై ఇప్పటికే ఎంతో మంది వాహనాలు జారి పడిపోయిన సంఘటనలున్నాయి. నడక కూడా నరకప్రాయంగా మారి పడరాని పాట్లు పడుతున్నామని అంటున్నారు. బురద రోడ్డులో వాహనాలు కూరుకుపోవడంతో పాటు పలువురు ప్రతీ యేట గాయాల పాలవుతున్నారు. ఏళ్ల్ల తరబడి డంపు యార్డు తొలగించి రోడ్డు నిర్మాణం చేపట్టాలని మొర పెట్టుకుంటున్నా ఎవరూ పట్టించుకోవడం లేదని వాపోతున్నారు.

- సరైన దారి లేక ..

కోట్లాది రూపాయలు వెచ్చించి నిర్మించిన ఈ భవనాలకు సరైన రోడ్డు సౌకర్యం లేకపోవడంతో పాటు పక్కనే ఉన్న డంపు యార్డు తొలగించకపోవడంతో ప్రతీ యేట విద్యార్థుల సంఖ్య తగ్గుతోందని ఆందోళన చెందుతున్నారు. ఒక్కో విద్యార్థిపై ప్రభుత్వం లక్షల రూపాయలు వెచ్చిస్తుంది. అలాగే ఎకరాల విస్తీర్ణంలో పాఠశాలతో పాటు డార్మెటరీ, తరగతి గదులు, కిచెన్‌, గ్రౌండు సౌకర్యాలు కూడా ఉన్నాయి. అయినా కూడా పాఠశాల/కళాశాలలో విద్యార్థులను పంపించేందుకు తల్లిదండ్రులు జంకుతున్నారు. విపరీతమైన ఈగలు, దోమలకు ఆలవాలమై విద్యార్థులు జ్వరాల బారిన పడే అవకాశం ఉందని ఆందోళనతోనే తలిదండ్రులు పాఠశాలలో విద్యార్థులను చేర్పించేందుకు నిరాశక్తత వ్యక్తం చేస్తున్నారు. డంపు యార్డు, బురదమయంగా మారుతున్న రోడ్డు, చుట్టు ఉన్న పిచ్చి మొక్కలకు తోడు వర్షం పడితే చాలు హాస్టళ్లలో రాత్రి పూట డ్యూటీ చేయాలంటేనే దేవుడిపై భారం వేయాల్సి దీన స్థితి అంటూ ఉపాధ్యాయులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాగా బలగల మైనారిటీ రెసిడెన్షియల్‌ పాఠశా లల పక్కనే మరిన్ని భవనాలు ప్రభుత్వం నిర్మించింది. ఈ భవనాలు కూడా ఖాళీగా ఉండడంతో ఒక భవనంలోకి సిర్పూర్‌(టి)లోని సోషల్‌ వెల్ఫేర్‌ పాఠశాల బాలురును ఇటీవల తరలించారు. ప్రభుత్వ భవనాలు ఖాళీగా ఉన్న చోటకు అద్దెపై కొనసాగుతున్న ప్రభుత్వ కార్యాలయాలు తరలించాలని ఆదేశాలు రావడంతో సిర్పూర్‌(టి) నుంచి ఈ పాఠశాలను ఇక్కడికి తరలించారు. అయితే ఈ పాఠశాల విద్యార్థులకు, ఉపాధ్యాయులకు కూడా ఇవే తిప్పలు తప్పడం లేదు. కోట్లాది రూపాయలు వెచ్చించి పాఠశాల భవనాలు నిర్మాణం జరిగినా కనీసం మట్టి రోడ్డు కూడా వేయక పోవడంతో రోడ్డు బురదమయంగా మారుతున్నాయి. ఇతర ప్రాంతాల నుంచి వచ్చే విద్యార్థుల పేరెంట్స్‌కు నడుము లోతున్న గుంతలు చిత్తడిగా ఉండే రోడ్డులో ఆటోలు, బెక్‌లు బురదలో కూరుకుపోతున్నాయని వాపోతున్నారు.

Updated Date - Aug 07 , 2026 | 11:04 PM