Share News

Damodar Raja Narasimha: మూలకణాలపై విస్తృత పరిశోధనలు: దామోదర

ABN , Publish Date - Jan 20 , 2026 | 02:23 AM

నిమ్స్‌ ల్యాబ్‌లో మూల కణాలపై వైద్యులు, శాస్త్రవేత్తలు లోతైన పరిశోధనలు చేస్తారని.. ఆ పరిశోధనల ఫలితంగా భవిష్యత్తులో పేద రోగులకు అతి తక్కువ ఖర్చుతో స్టెమ్‌సెల్‌ థెరపీ చికిత్స అందించగలమని వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ పేర్కొన్నారు. నిమ్స్‌లో ఏర్పాటు చేసిన స్టెమ్‌ సెల్‌ ల్యాబ్‌ను మంత్రి సోమవారం సాయంత్రం ప్రారంభించారు.

Damodar Raja Narasimha: మూలకణాలపై విస్తృత పరిశోధనలు: దామోదర

  • నిమ్స్‌ ఆస్పత్రిలో స్టెమ్‌సెల్‌ థెరపీ సెంటర్‌ ప్రారంభం

నిమ్స్‌/హైదరాబాద్‌ సిటీ, జనవరి 19 (ఆంధ్రజ్యోతి) : నిమ్స్‌ ల్యాబ్‌లో మూల కణాలపై వైద్యులు, శాస్త్రవేత్తలు లోతైన పరిశోధనలు చేస్తారని.. ఆ పరిశోధనల ఫలితంగా భవిష్యత్తులో పేద రోగులకు అతి తక్కువ ఖర్చుతో స్టెమ్‌సెల్‌ థెరపీ చికిత్స అందించగలమని వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ పేర్కొన్నారు. నిమ్స్‌లో ఏర్పాటు చేసిన స్టెమ్‌ సెల్‌ ల్యాబ్‌ను మంత్రి సోమవారం సాయంత్రం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. త్వరలోనే ఈ ల్యాబ్‌ పరిశోధన ఫలాలు ప్రజలకు అందుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. పేద ప్రజలకు అత్యాధునిక వైద్యాన్ని అందించాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని, ఈ నేపథ్యంలోనే స్టెమ్‌సెల్‌ ల్యాబ్‌ ప్రారంభించుకున్నామన్నారు. బయో టెక్నాలజీ సంస్థ అమెరికాకు చెందిన తులసి థెరప్యూటిక్స్‌ సహకారంతో ఈ ల్యాబ్‌ను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. మన శరీరంలో ఏదైనా భాగం దెబ్బతిన్నప్పుడు లేదా దానికి జబ్బు చేసినప్పుడు దానికి మరమ్మతు చేసే అద్భుతమైన శక్తి మూలకణాలకు ఉంటుందన్నారు. మందులతో నయం కాని మొండి వ్యాధులను కూడా నయం చేయగలిగే శక్తి స్టెమ్‌సెల్స్‌కు ఉందని వివరించారు. పేద వర్గాలకు మెరుగైన, అత్యాధునిక వైద్య సేవలు అందించాలనే ఉద్దేశంతో నిమ్స్‌లో స్టెమ్‌సెల్‌ ల్యాబ్‌ను అందుబాటులోకి తెచ్చినట్లు ఆయన చెప్పారు. ఈ కార్యక్రమంలో నిమ్స్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ బీరప్ప నగరి, వైద్య ఆరోగ్యశాఖ కార్యదర్శి క్రిస్టినా జెడ్‌.చొంగ్తు, తులసి థెరప్యూటిక్స్‌ సీఈవో సాయిరాం అట్లూరి పాల్గొన్నారు.

Updated Date - Jan 20 , 2026 | 02:23 AM