NIMS: నిమ్స్‌లో మూలకణ పరిశోధన కేంద్రం
ABN , Publish Date - Jan 19 , 2026 | 05:00 AM
నిమ్స్‌లో మూలకణ చికిత్స (స్టెమ్ సెల్ థెరపీ) అందించే దిశగా అడుగుపడింది. ఈ ఆస్పత్రిలో స్టెమ్ సెల్ పరిశోధన కేంద్రం ప్రారంభంకానుంది.
నేడు ప్రారంభం.. త్వరలో వ్యాధులకు మూలకణ చికిత్స.. మోకాళ్ల మార్పిడికి గుడ్‌బై!
హైదరాబాద్ సిటీ, జనవరి 18(ఆంధ్రజ్యోతి): నిమ్స్‌లో మూలకణ చికిత్స (స్టెమ్ సెల్ థెరపీ) అందించే దిశగా అడుగుపడింది. ఈ ఆస్పత్రిలో స్టెమ్ సెల్ పరిశోధన కేంద్రం ప్రారంభంకానుంది. హైదరాబాద్‌కు చెందిన బయోటెక్ స్టార్టప్ సంస్థ తులసి థెరప్యూటిక్స్ భాగస్వామ్యంతో ఏర్పాటు చేసిన ఈ కేంద్రాన్ని సోమవారం వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ ప్రారంభించనున్నారు. ఇక్కడ పరిశోధనలు విజయవంతమైతే ఎథిక్ కమిటీ అనుమతి లభించిన తర్వాత రోగులకు పూర్తిస్థాయిలో మూలకణ చికిత్స అందించనున్నారు. ఇది అందుబాటులోకి వస్తే పలు వ్యాధులకు చికిత్సా విధానం మారుతుందని వైద్యులు పేర్కొంటున్నారు. ఉదాహరణకు మోకాళ్ల మార్పిడి అవసరం లేకుండా మూలకణ చికిత్సతో రోగులకు ఉపశమనం లభిస్తుందని చెబుతున్నారు.
మూలకణ చికిత్స అంటే..
ఇవి మానవ శరీరంలో ఉండే ప్రత్యేకమైన కణాలు. ఇవి మరిన్ని మూలకణాలుగా విడిపోగలవు. అలాగే ఇతర కణాలుగా అంటే.. నిర్దిష్ట పనులు చేసే రక్తకణాలు, మెదడు కణాలు, గుండె కణాలు, ఎముక కణాలు, కాలేయ కణాలు రూపొందడానికి ఉపయోగపడగలవు. ఈ చికిత్సను రీ-జనరేటివ్ మెడిసిన్ అని కూడా వ్యవహరిస్తారు. వ్యాధి మూలకారణాన్ని గుర్తించి.. దెబ్బతిన్న కణాలను మూలకణాలను ఉపయోగించి మరమ్మతు, భర్తీ చేయడమే మూలకణ చికిత్స. రోగి, దాత శరీరం నుంచి మూలకణాలు సేకరిస్తారు. ఎము క మజ్జ, బొడ్డు తాడు, కొవ్వు కణజాలం నుంచి సేకరించి, వా టిని ప్రయోగశాలలో పెంచి, అవసరమైన ప్రత్యేక కణాలుగా మారుస్తారు. ముఖ్యమైన మూలకణాలను రోగికి దెబ్బతిన్న, వ్యాధిగ్రస్థ ప్రాంతంలో నేరుగా ఇంజెక్ట్ చేస్తారు. రక్తనాళాల్లోకి ఇన్ఫ్యూషన్ ద్వారా కూడా ఇస్తారు. ఈ కొత్త కణాలు దెబ్బతిన్న కణాలను మరమ్మతు చేయడం, వాటి స్థానాన్ని భర్తీ చేయడం ద్వారా అవయవ పనితీరును పునరుద్ధరిస్తాయి.
ఈ వ్యాధులకు చికిత్స..!
లుకేమియా, లింఫోమా, మైలొమా, ఎముక మజ్జ వైఫల్యంతో పాటు ఇతర రక్త రుగ్మతలకు మూలకణ చికిత్స చేస్తారు. భవిష్యత్తులో గుండె జబ్బులతో దెబ్బతిన్న గుండె కణాల మరమ్మతు, పార్కిన్సన్, అల్జీమర్స్, బ్రెయిన్ స్ట్రోక్, వెన్నెముక గాయాలు, మధుమేహం, ఆస్టియో ఆర్థరైటిస్, ఆటల్లో తగిలిన గాయాలు, ఇతర ఆర్థోపెడిక్ సమస్యలు, కాలేయ వైఫల్యం, ఇంకా వివిధ వ్యాధులను మూలకణ చికిత్సతో నయం చేయగల అవకాశాలు ఉన్నాయి.
పేదలకు ఆశాకిరణం
మూలకణ చికిత్స పేద ప్రజలకు ఒక ఆశాకిరణం. ప్రైవేటు ఆస్పత్రుల్లో లక్షల రూపాయలు వెచ్చించి చికిత్స చేయించుకోలేని వారికి నిమ్స్‌లో అతి తక్కువ ధరకు అందించే అవకాశముంది. మూలకణ చికిత్స పూర్తిస్థాయిలో అందుబాటులోకి వస్తే మోకాలు మార్పిడి చికిత్స అవసరం ఉండదు. అమెరికా నుంచి అత్యాధునిక, ప్రపంచస్థాయి స్టెమ్ సెల్ సాంకేతికతను అందించడంలో తులసి సంస్థ సహకారం అందించనుంది.
- డాక్టర్ బీరప్ప నగరి, డైరెక్టర్, నిమ్స్