ఆ ఐదు గ్రామాలను తెలంగాణలో కలపండి
ABN , Publish Date - Apr 06 , 2026 | 04:58 AM
భద్రాచలానికి ఆనుకొని ఉన్న 5 గ్రామాలను ఏపీ నుంచి వేరుచేసి తెలంగాణలో కలపాలని కేంద్ర మంత్రి అమిత్‌షాకు రాష్ట్ర మంత్రి తుమ్మల నాగేశ్వరరావు విజ్ఞప్తి చేశారు.
భద్రాచలంను ఆనుకొని ఉన్న గ్రామాల విషయమై కేంద్ర మంత్రి అమిత్‌షాకు రాష్ట్ర మంత్రి తుమ్మల లేఖ
హైదరాబాద్, ఏప్రిల్ 5 (ఆంధ్రజ్యోతి): భద్రాచలానికి ఆనుకొని ఉన్న 5 గ్రామాలను ఏపీ నుంచి వేరుచేసి తెలంగాణలో కలపాలని కేంద్ర మంత్రి అమిత్‌షాకు రాష్ట్ర మంత్రి తుమ్మల నాగేశ్వరరావు విజ్ఞప్తి చేశారు. ప్రస్తుతం పార్లమెంటు సమావేశాలు జరుగుతున్న నేపథ్యంలో.. ఇప్పుడే నిర్ణయం తీసుకోవాలని కోరారు. ఈ మేరకు కేంద్ర మంత్రికి ఆదివారం ఆయన ఓ లేఖ రాశారు. ఆ ఐదు గ్రామాల సమస్యను ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఇదివరకే ఏపీ సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లారని ఆ లేఖలో పేర్కొన్నారు. పరిపాలన సౌలభ్యం కోసం ఆ ఐదు గ్రామాలను తెలంగాణలో విలీనం చేసి గిరిజనుల ఇబ్బందులు తొలగించాలని తుమ్మల కోరారు. రాష్ట్ర విభజన సమయంలో ఏపీలో కలిపిన యాటపాక, కన్నాయిగూడెం, పిచ్చికలపాడు, పురుషోత్తపట్నం, గుండాల గ్రామ పంచాయతీలు పరిపాలనపరంగా ఎదుర్కొంటున్న ఇబ్బందులను లేఖలో వివరించారు. ఆ ఐదు గ్రామ పంచాయతీల పరిధిలో 19 రెవెన్యూ గ్రామాలు ఉండగా.. తెలంగాణలోని రెండు భాగాల మధ్య ప్రత్యేక పరిస్థితుల్లో ఉన్నాయని వివరించారు. మిగిలిన సరిహద్దులు గోదావరి నది, రిజర్వు ఫారెస్టు ప్రాంతాలతో చుట్టుముట్టు ఉన్నట్లు తెలిపారు. దీంతో పరిపాలనపరమైన సమస్య లు ఎదురవుతున్నాయని, ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని తుమ్మల వివరించారు. ఈ గ్రామ పంచాయతీలకు పోలవరం ముంపు సమస్యతో ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. కానీ పరిపాలన, జీవనోపాధి, ప్రజాసేవల కోసం ఆ గ్రామాల ప్రజలు భద్రాచలంపైనే పూర్తిగా ఆధారపడి ఉన్నా.. ఏపీలో కొనసాగటం వల్ల ఇబ్బంది పడుతున్నారని తెలిపారు.
ఈ గ్రామాల్లోని గిరిజనులు తమ ఊళ్లను తెలంగాణలోనే కలపాలని ఎప్పటి నుంచో కోరుతున్నారని వెల్లడించారు. ఇక, ఆ గ్రామాల ప్రజలు ఏపీలోని అల్లూరి సీతారామరాజు జిల్లా కేంద్రానికి వెళ్లాలంటే 282 కిమీల దూరం ప్రయాణించాలని ఇందు కు 8 గంటల సమయం పడుతుందని పేర్కొన్నారు. మరోపక్క, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకేంద్రం కేవలం 40 కిమీల దూరంలో ఉన్నదని, గంటలో జిల్లా కేంద్రానికి చేరుకోవచ్చని వివరించారు. ప్రస్తుత సరిహద్దుల కారణంగా వ్యవసాయ ఉత్పత్తులు, అటవీ ఉత్పత్తులు, అవసరమైన సరుకులు తరలించేటప్పుడు తరుచుగా తనిఖీలు, అడ్డంకులు ఎదురవుతున్నట్లు లేఖలో పేర్కొన్నారు. ఈ ప్రాంతం ఛత్తీస్‌గఢ్- ఒడిసా రాష్ట్రాలకు సమీపంలో ఉండటంతో పోలీసింగ్, శాంతిభద్రతల సమస్యలు కూడా తలెత్తుతున్నాయని తెలిపారు. శ్రీ సీతారామచంద్రస్వామి దేవాలయం తెలంగాణలో ఉన్నదని, ఈ ఆలయానికి సంబంధించిన కొన్ని భూ ములు ప్రస్తుతం పురుషోత్తపట్నం ప్రాంతంలో ఉన్నాయని, దేవాలయ నిర్వహణ సులభంగా ఉండేందుకు ఈ భూభాగాలను తిరిగి తెలంగాణలో కలపటం అత్యవసరమని లేఖలో ప్రస్తావించారు. ఈ భౌగోళిక సమస్య కొనసాగితే భద్రాచలం దేవాలయం అభివృద్ధి ప్రణాళికకు ఆటంకం ఏర్పడుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. అంతేకాక, ఆ ఐదు గ్రామాలు ఐదో షెడ్యూలులో ఉండటంతో ప్రభుత్వ సేవలు, సంక్షేమ పథకాలు గిరిజనులకు అందటం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలోనే ఆ ఐదు గ్రామ పంచాయతీలు, 19 రెవెన్యూ గ్రామాలు తిరిగి తెలంగాణలోని భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోకి కలపాలని కోరుతున్నామని తుమ్మల విజ్ఞప్తి చేశారు.