ప్రైవేటులో ఫీజుల నియంత్రణకు ప్రత్యేక వ్యవస్థ
ABN , Publish Date - Feb 27 , 2026 | 04:53 AM
ఫీజుల పేరిట రాష్ట్రంలో ప్రైవేటు పాఠశాలలు భారీగా దోచుకుంటున్నాయని తెలంగాణ విద్యా కమిషన్ తెలిపింది. దేశంలోని ఏ రాష్ట్రంలో లేనివిధంగా అత్యధికంగా ఫీజులు తెలంగాణలోనే.....
తల్లిదండ్రులపై భారం పడకుండా చర్యలు
అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు
పదేళ్లలో అధికంగా పెంచింది రాష్ట్రంలోనే
సీఎంతో ఆకునూరి మురళి వ్యాఖ్య
హైదరాబాద్, ఫిబ్రవరి 26 (ఆంధ్రజ్యోతి): ఫీజుల పేరిట రాష్ట్రంలో ప్రైవేటు పాఠశాలలు భారీగా దోచుకుంటున్నాయని తెలంగాణ విద్యా కమిషన్ తెలిపింది. దేశంలోని ఏ రాష్ట్రంలో లేనివిధంగా అత్యధికంగా ఫీజులు తెలంగాణలోనే ఉన్నాయని తాను అధ్యయనం చేసిన గణాంకాలతో సహా వివరించింది. విద్యా శాఖపై గురువారం సీఎం సమీక్ష సందర్భంగా.. ఈ అంశాన్ని తెలంగాణ విద్యా కమిషన్ చైర్మన్ ఆకునూరి మురళి లేవనెత్తారు. ‘‘పదేళ్ల కిందట తెలంగాణలోని ప్రైవేటు పాఠశాలల్లో సరాసరి వార్షిక ఫీజు రూ.50 వేలు. ఇప్పుడు అది రూ.1.90 లక్షలకు చేరింది. రాష్ట్రంలో ఏటా ప్రైవేటు విద్యా సంస్థలు 10-30 శాతం ఫీజులు పెంచుకుంటూ పోతున్నాయి’’ అని వివరించారు. ఫీజులపై కమిషన్ వివిధ రాష్ట్రాల్లో పర్యటించి అక్కడి విధానాన్ని అధ్యయనం చేసిందంటూ.. ఆ వివరాలను సీఎం రేవంత్‌కు సమర్పించింది. 2015-16లో తెలంగాణలో సరాసరి ఫీజు రూ.50 వేలు ఉంటే.. ఉత్తరప్రదేశ్‌లో రూ.35 వేలు, తమిళనాడులో రూ.40 వేలు, ఆంధ్రప్రదేశ్‌లో రూ.38 వేలు, ఢిల్లీలో అత్యధికంగా రూ.60 వేలు ఉండేదని వివరించారు. పదేళ్ల కిందట ఢిల్లీ ప్రథమ స్థానంలో ఉండగా.. ఇప్పుడు తెలంగాణ ఉందని తెలిపారు. 2025-26లో ఉత్తరప్రదేశ్‌లో ఫీజు రూ.95 వేలు ఉంటే.. తమిళనాడులో లక్ష, ఆంధ్రప్రదేశ్‌లో రూ.1.05 లక్షలు, ఢిల్లీలో రూ.1.60 లక్షలు ఉందని, తెలంగాణలో మాత్రం రూ.1.90 లక్షలుగా ఉందని కమిషన్ తెలిపింది. ప్రైవేటు విద్యా సంస్థల ఫీజు దోపిడీకి ప్రభుత్వం అడ్డుకట్ట వేయాలని, ఇందుకు ఇంజినీరింగ్ తరహాలో ప్రత్యేకంగా ఫీజు నియంత్రణ కమిటీ ఉండాలని సూచించింది. రవాణా, బోర్డింగ్, భోజనం, విహార యాత్రలు, క్యాపిటేషన్ ఫీజు, పాఠ్య పుస్తకాలు, ఏకరూప దుస్తులు, స్టేషనరీ పేరుతో ప్రైవేటు విద్యా సంస్థలు విచ్చలవిడి దోపిడీకి పాల్పడుతున్నాయని కమిషన్ తెలిపింది. ప్రైవేటు పాఠశాలల్లో ఫీజులు ఇతర రాష్ట్రాలతో పోలిస్తే రాష్ట్రంలోనే ఎక్కువగా ఉన్నాయని కమిషన్ తెలపగా.. సీఎం రేవంత్ రెడ్డి ఆశ్చర్యం వ్యక్తం చేశారు. తల్లిదండ్రులపై ఫీజుల భారం పడకుండా ప్రత్యేక చర్యలు తీసుకోవాలని, ఫీజుల నియంత్రణకు ప్రత్యేక వ్యవస్థ ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. జిల్లా స్థాయిలో కలెక్టర్, డీఈవోల నేతృత్వంలో పాఠశాలలను పరిశీలించి ఫీజుల నిర్ణయంపై నివేదిక సమర్పించాలని చెప్పారు. రాష్ట్ర స్థాయిలో విశ్రాంత జడ్జి లేదా విశ్రాంత సీఎస్ స్థాయి కమిటీ నిర్ణయాలు తీసుకుంటుందని తెలిపారు. ఫీజు నియంత్రణపై తల్లిదండ్రులు, మేధావుల అభిప్రాయ సేకరణకు ముసాయిదాను ప్రజలకు అందుబాటులో ఉంచాలన్నారు.’