Share News

మీడియా అక్రిడిటేషన్‌ కార్డుల గడువు 2 నెలలు పొడిగించాం

ABN , Publish Date - Feb 27 , 2026 | 05:06 AM

రాష్ట్రంలోని జర్నలిస్టులకు ఉన్న మీడియా అక్రిడిటేషన్‌ కార్డుల గడువు ఈనెల 28తో ముగిసిపోతోందన్న వాదనలో వాస్తవం లేదని..

మీడియా అక్రిడిటేషన్‌ కార్డుల గడువు 2 నెలలు పొడిగించాం

  • హైకోర్టుకు తెలిపిన రాష్ట్ర ప్రభుత్వం

హైదరాబాద్‌, ఫిబ్రవరి 26 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలోని జర్నలిస్టులకు ఉన్న మీడియా అక్రిడిటేషన్‌ కార్డుల గడువు ఈనెల 28తో ముగిసిపోతోందన్న వాదనలో వాస్తవం లేదని.. మరో రెండు నెలల పాటు ఆ కార్డుల చెల్లుబాటు గడువును పొడిగించినట్లు రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టుకు నివేదించింది. అయితే ఏప్రిల్‌ 30 వరకు అక్రిడిటేషన్‌ కార్డుల గడువున్నందున ప్రభుత్వం కౌంటర్‌ దాఖలు చేయాలని ఈ సందర్భంగా హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ప్రభుత్వం మీడియా గుర్తింపు కార్డులకు సంబంధించి జారీ చేసిన జీవో 252 చట్టబద్ధతను సవాల్‌ చేస్తూ ఉర్దూ వర్కింగ్‌ జర్నలిస్టుల సమాఖ్య హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేసింది. దీనిపై చీఫ్‌ జస్టిస్‌ అపరేశ్‌కుమార్‌ సింగ్‌, జస్టిస్‌ మొహియుద్దీన్‌ ధర్మాసనం విచారణ చేపట్టింది. పిటిషనర్ల తరఫున న్యాయవాది బర్కత్‌ అలీఖాన్‌ వాదిస్తూ.. ఈ పిటిషన్‌ విచారణలో ఉండగానే గుర్తింపు కార్డుల గడువు ముగుస్తుందని.. దీనివల్ల పిటిషనర్లు ఇబ్బంది పడతారన్నారు. ప్రభుత్వ న్యాయవాది వాదిస్తూ.. ప్రస్తుతమున్న గుర్తింపు కార్డుల గడువును మరో రెండు నెలలు ప్రభుత్వం పొడిగించిందని.. ఈ నేపథ్యంలో జర్నలిస్టులు వృత్తిపరమైన విధులు నిర్వహించడంలో, కార్యక్రమాలకు హాజరు కావడంలో ఎలాంటి ఇబ్బందులు ఉండవని చెప్పారు. వాదనల అనంతరం విచారణ నాలుగు వారాలకు వాయిదా పడింది.

ఇబ్రహీంపట్నం మునిసిపల్‌ చైర్మన్‌ను ప్రకటించాలని పిటిషన్‌

ఇబ్రహీంపట్నం మునిసిపల్‌ చైర్మన్‌ ఎన్నిక ఇప్పటికే నిర్వహించారని.. అయితే ఫలితం ప్రకటించలేదంటూ టేకుల సుదర్శన్‌రెడ్డి హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. ఇప్పటికే తాను చైర్మన్‌గా ఎన్నికయ్యాయనని.. ఫలితాలు ప్రకటించేలా రిటర్నింగ్‌ అధికారికి ఆదేశాలు జారీ చేయాలని కోరారు. ఆ వెంటనే వైస్‌ చైర్మన్‌ ఎన్నిక నిర్వహించేలా ఆదేశాలివ్వాలన్నారు. దీనిపై విచారణ చేపట్టిన హైకోర్టు.. రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ వైఖరి తెలపాలని కోరుతూ విచారణను శుక్రవారానికి వాయిదా వేసింది.

Updated Date - Feb 27 , 2026 | 05:06 AM