ప్రమాదంలో రాష్ట్ర డేటా సెంటర్
ABN , Publish Date - Feb 23 , 2026 | 02:40 AM
పకడ్బందీ నిఘా, మూడు-నాలుగంచెల భద్రతా వ్యవస్థతో అత్యంత పటిష్ఠంగా ఉండాల్సిన రాష్ట్ర డేటా సెంటర్ (ఎస్‌డీసీ) పరిస్థితి దారుణంగా ఉంది.
భూమిలో ఉండాల్సిన డీజిల్ ట్యాంక్.. బహిరంగంగా!.. జనరేటర్, ట్రాన్స్‌ఫార్మర్‌లకు దగ్గర్లోనే డీజిల్ డ్రమ్ములు
విద్యుత్ తీగలకు అల్లుకుని దట్టంగా పెరిగిన పొదలు
భూగర్భంలో ఉండాల్సిన నెట్, పవర్ కేబుళ్లు డ్రైనేజీలో
భూభారతి, ఫించన్లు సహా సర్కారీ సర్వర్లన్నీ ఇక్కడే
ప్రమాదం జరిగితే రికవరీ చేసే పరిస్థితి లేని వైనం
2011లో ప్రారంభం.. పట్టించుకోని పాలకులు
హైదరాబాద్, ఫిబ్రవరి 22 (ఆంధ్రజ్యోతి): పకడ్బందీ నిఘా, మూడు-నాలుగంచెల భద్రతా వ్యవస్థతో అత్యంత పటిష్ఠంగా ఉండాల్సిన రాష్ట్ర డేటా సెంటర్ (ఎస్‌డీసీ) పరిస్థితి దారుణంగా ఉంది. వాస్తవంగా అయితే.. ఈ భవనానికి దాదాపు అర కిలోమీటర్ దూరం నుంచే గట్టి భద్రతా ఏర్పాట్లు చేయాలి. కానీ కనీస స్థాయిలోనూ ఆ రకమైన ఏర్పాట్లే లేని పరిస్థితి నెలకొంది. హైదరాబాద్‌లోని గచ్చిబౌలి ప్రాంతంలో ఉన్న ‘తెలంగాణ డేటా సెంటర్’ దుస్థితి ఇది!! ‘నేషనల్ ఈ - గవర్నెన్స్ ప్రోగ్రామ్ (ఎన్‌ఈజీపీ) కింద కేంద్ర ప్రభుత్వం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు ఈ డేటా సెంటర్‌ను మంజూరు చేయగా.. 2011 ఏడాదిలో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం 2,500 చదరపు అడుగుల విస్తీర్ణంలో నెలకొల్పింది. తెలంగాణ ప్రభుత్వం అమలుచేస్తున్న పలు పథకాలు, పింఛన్లు, రాష్ట్ర ప్రజలకు సంబంధించిన భూముల వివరాలు (భూభారతి సర్వర్), మీ-సేవ సహా ప్రభుత్వ పోర్టల్స్, ఇతరత్రా వెబ్ సర్వర్లన్నింటినీ ప్రభుత్వ పరిధిలో ఉన్న ఈ స్టేట్ డేటా సెంటర్ నుంచే నిర్వహిస్తున్నారు. ఇంత ముఖ్యమైన వ్యవహారాలను పర్యవేక్షిస్తున్న డేటా సెంటర్ విషయంలో ప్రభుత్వంతో పాటు, అధికారులు చాలా అప్రమత్తంగా వ్యవహారించాల్సి ఉంది. కానీ అక్కడ ఉండాల్సిన నిఘా, రక్షణ, భద్రత.. ఏవీ సరిగా లేకపోవడం గమనార్హం. సాధారణంగా.. డేటా సెంటర్లు ఉన్నచోట వేరే ఏ ఇతర కార్యాలయాల ఏర్పాటుకూ అవకాశం ఇవ్వకూడదు. కానీ రాష్ట్ర డేటా సెంటర్ ఉన్న దగ్గరే మరో ప్రభుత్వ కార్యాలయం ఉన్నది. డేటా సెంటర్‌కు సంబంధించిన ఇంటర్‌నెట్ కేబుళ్లు, కరెంటువైర్లన్నీ భవనం బయటి వైపు ఉన్న డ్రైనేజీ లైన్ గుండా వెళ్తుండడం గమనార్హం.
ఆ వైర్లు సర్వర్ రూమ్‌కు వెళ్లే మార్గంలో దట్టంగా పొదలు ఉండగా.. పైపైకి తీగలు అల్లుకున్నాయి. ఇక.. అత్యంత సురక్షిత వాతావరణంలో ఉండాల్సిన ట్రాన్స్‌ఫార్మర్, జనరేటర్, డీజీల్ ట్యాంకర్లన్నీ పక్కపక్కనే ఉన్నాయి. భూగర్భంలో ఉండాల్సిన డీజిల్ ట్యాంకర్... భూమి పైభాగంలోనే, కంటికి కనిపించే విధంగా ఉంది. దానికి జనరేటర్‌కు మధ్యలో డీజిల్ డ్రమ్ములున్నాయి. ఏదైనా తేడా వచ్చి అగ్గిరాజుకుంటే.. పరిస్థితి చెయ్యి దాటిపోయినట్టే! ఆ మంటలను అదుపులోకి తేవడం చాలా కష్టం. అలాంటి అనుకోని విపత్తులు సంభవించినప్పుడు పూర్తిగా నష్టపోకుండా.. ముందు జాగ్రత్త చర్యగా ప్రత్యామ్నాయ డేటా సెంటర్లను ఏర్పాటు చేస్తారు. సాంకేతిక పరిభాషలో దీన్ని డిజాస్టర్ రికవరీ అంటారు. ప్రైవేటు డేటాసెంటర్ల నిర్వాహకులు విదేశాల్లో, ఇతర ఖండాల్లో సముద్రాలు దాటి వెళ్లి మరీ ఇలాంటి ప్రత్యామ్నాయ కేంద్రాలను ఏర్పాటు చేస్తారు. కానీ.. రాష్ట్ర డేటా సెంటర్‌కు అలాంటి ప్రత్యామ్నామ వ్యవస్థ ఏదైనా ఉన్నదా లేదా అనేదానిపై స్పష్టతలేదు. అలాంటిదేదీ లేకపోతేగనక.. ఇటీవల నాంపల్లి ఫోరెన్సిక్ ల్యాబ్‌లో జరిగినట్టుగా అనుకోని ఘటన ఏదైనా జరిగితే సమాచారం మొత్తం బుగ్గిపాలైపోతుందని సాంకేతిక నిపుణులు హెచ్చరిస్తున్నారు.
సెక్యూరిటీ చెక్ ఏదీ?
ప్రైవేటు డేటాసెంటర్లకు పటిష్ఠభద్రత ఉంటుంది. ఎవరు పడితే వారు లోపలికి వెళ్లడానికి వీలుండదు. రెండు, మూడు స్థాయుల్లో సెక్యురిటీ పరిశీలన తరువాతే అనుమతి ఉంటుంది. కానీ రాష్ట్ర డేటా సెంటర్‌లోకి ఎవరు పడితే వారు వెళ్లే పరిస్థితి కనిపిస్తోంది. ఇక.. ప్రైవేటు సంస్థలు అత్యంత వేగవంతంగా నాణ్యమైన సేవలను అందిస్తుండగా రాష్ట్ర పరిధిలోని డేటా సెంటర్ మాత్రం అతి తక్కువ సామర్థ్యంతో తక్కువ వేగంతో పని చేస్తుండడం గమనార్హం. 2011లో ఏర్పాటైన ఈ డేటా సెంటర్ విషయంలో.. గత ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించిందన్న విమర్శలున్నాయి. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వమైనా రాష్ట్ర డేటా సెంటర్ పరిస్థితిని మెరుగుపరచాలని.. అప్పుడే ప్రభుత్వ సర్వర్లు, డేటా సురక్షితమనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కాగా డేటా సెంటర్ భద్రత, సామర్ధ్యత అంశంపై సంబంధిత అధికారులను ఫోన్ ద్వారా ‘ఆంధ్రజ్యోతి’ ప్రతినిధి సంప్రదించగా ఎవరూ అందుబాటులోకి రాలేదు.

