Starlink Internet: తెలంగాణలో ‘స్టార్‌లింక్’ ఇంటర్‌నెట్!
ABN , Publish Date - Jan 01 , 2026 | 07:23 AM
రాష్ట్రంలో వేగవంతమైన, నాణ్యమైన ఇంటర్‌నెట్ సేవలందించేందుకు తెలంగాణ వ్యాప్తంగా వైర్‌లెస్ విధానంలో 5జీ నెట్‌ను అందుబాటులోకి తీసుకురావాలని ప్రభుత్వం నిర్ణయించింది.
మస్క్ కంపెనీతో సంప్రదింపులు
అటవీ ప్రాంతాల్లోని గ్రామాల్లో ఇంటర్‌నెట్ కల్పించేందుకే..
రాష్ట్రవ్యాప్తంగా 5జీ వైర్‌లెస్ నెట్
పైలట్ ప్రాజెక్టుగా ఖమ్మం జిల్లా రామకృష్ణాపురంలో అమలు
సంక్రాంతికి షురూ.. 5 కోట్ల ఖర్చు
టీఫైబర్- ఐఐటీ హైదరాబాద్ పర్యవేక్షణ, నిర్వహణ
దేశంలోనే తొలిసారిగా అమలు
హైదరాబాద్, డిసెంబరు 31 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో వేగవంతమైన, నాణ్యమైన ఇంటర్‌నెట్ సేవలందించేందుకు తెలంగాణ వ్యాప్తంగా వైర్‌లెస్ విధానంలో 5జీ నెట్‌ను అందుబాటులోకి తీసుకురావాలని ప్రభుత్వం నిర్ణయించింది. కేబుల్ వ్యవస్థ లేకుండా వైఫై విధానంలో ఇంటర్‌నెట్‌ను అందుబాటులోకి తేనుంది. అయితే.. అటు కేబుల్‌తోపాటు ఇటు వైర్‌లెస్ విధానంలోనూ ఇంటర్‌నెట్ అందించలేని ప్రాంతాల్లో ఈ సౌకర్యం కల్పించేందుకు అమెరికాలోని ఎలన్‌మ్‌స్కకు చెందిన ‘స్టార్‌లింక్’ కంపెనీ సేవలను వినియోగించుకోవాలని నిర్ణయించింది. రాష్ట్రంలోని 690 గ్రామాలకు అటవీ ప్రాంతాల కారణంగా, మరికొన్ని గ్రామాలకు మైనింగ్ వంటి కారణాలతో ఇంటర్‌నెట్‌ను అందించలేని పరిస్థితి ఉండడంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. స్టార్‌లింక్ కంపెనీ శాటిలైట్ ద్వారా ఇంటర్‌నెట్ సేవలు అందిస్తుండడమే ఇందుకు కారణం. ఈ మేరకు స్టార్‌లింక్ కంపెనీ ప్రతినిధులు, తెలంగాణ ఫైబర్ గ్రిడ్ కార్పొరేషన్ (టీ-ఫైబర్) మధ్య రెండుసార్లు సమావేశం కూడా జరిగింది. రాష్ట్రంలో ఏయే ప్రాంతాల్లో ఇంటర్‌నెట్ అందించాలి, అక్కడ ఉన్న ప్రతికూల పరిస్థితులు సహా అన్ని వివరాలను స్టార్‌లింక్ ప్రతినిధులకు టీ-ఫైబర్ అధికారులు వివరించారు. దీంతో స్టార్‌లింక్ తమ సేవలు అందించేందుకు ప్రాఽథమికంగా సుముఖత వ్యక్తం చేసినట్టు తెలిసింది. ఇందుకు సంబంధించి త్వరలో మరో కీలక సమావేశం జరగనుంది. స్టార్‌లింక్, రాష్ట్ర ప్రభుత్వం మధ్య ఒప్పందం కూడా జరిగే అవకాశం ఉందని తెలిసింది. ఇదే జరిగితే రాష్ట్రంలోని మారుమూల గ్రామాలు, తండాలు, ఏజెన్సీ, అటవీ ప్రాంతాల్లోని గ్రామాలకూ ఇంటర్‌నెట్ సేవలు అందుబాటులోకి వస్తాయి.
వైర్‌లెస్ 5జీ సేవలకు శ్రీకారం..
వాస్తవానికి తెలంగాణ ఫైబర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో ఆఫ్టికల్ ఫైబర్ కేబుల్ (ఓఎ్‌ఫసీ) విధానంలో ఇంటర్‌నెట్‌ను అందించేందుకు రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటివరకు 42 వేల కిలోమీటర్ల పరిధిలో భూగర్భ కేబుల్ వేశారు. దీనిద్వారా మొదటి విడతలో రాష్ట్రంలోని 9,662 గ్రామాల్లో ఇంటర్‌నెట్ అందనుంది. అయితే ఓవైపు ఈ కేబుల్ ప్రాజెక్టు నడుస్తుండగానే.. రాష్ట్ర వ్యాప్తంగా వైర్‌లెస్ విధానంలో 5జీ ఇంటర్‌నెట్‌ను అందించేందుకు ప్రభుత్వం ప్రయత్నాలు ప్రారంభించింది. ఖమ్మం జిల్లా మధిర నియోజకవర్గం చింతకాని మండలంలోని రామకృష్ణాపురం గ్రామంలో వైర్‌లెస్ 5జీ వైఫై సేవలను పైలట్ ప్రాజెక్టు కింద అమలు చేయనుంది. ఇందుకు కేంద్ర ప్రభుత్వం తాజాగా అనుమతులు జారీ చేసింది. సంక్రాంతి సందర్భంగా రామకృష్ణాపురంలో ఈ ప్రాజెక్టును ప్రారంభించనున్నట్టు విశ్వసనీయంగా తెలిసింది. పైలట్ ప్రాజెక్టు అమలు కోసం రూ.5 కోట్ల వరకు వెచ్చించనున్నారు. ఇప్పటికే హైదరాబాద్‌లోని నిమ్స్ ఆస్పత్రిలో 5 నెలల నుంచి వైర్‌లెస్ 5జీ సర్వీసులను రాష్ట్ర ప్రభుత్వం పైలట్‌గా అమలు చేస్తోంది. అక్కడ వినియోగిస్తున్న సాంకేతికత, ఈ ఐదు నెలలు అంతరాయం లేని సేవలను అందించిన వివరాలను కేంద్రానికి నివేదించింది. దీనిపై స్పందించిన కేంద్రం.. పట్టణ ప్రాంతంలో కాకుండా ఏదైనా గ్రామీణ ప్రాంతంలో అమలు చేయాలని సూచించింది.
గ్రామీణ ప్రాంతంలో దేశంలోనే మొదటిసారి
కేంద్రం సూచన మేరకు మధిర నియోజకవర్గంలోని రామకృష్ణాపురంలో పైలట్ ప్రాజెక్టును అమలు చేయాలని తెలంగాణ సర్కారు నిర్ణయించింది. ఇందుకు సంబంధించి కేంద్రానికి వివరాలు సమర్పించగా.. ఇటీవల అనుమతినిచ్చింది. ఇలా వైర్‌లెస్ 5జీ సర్వీసులను గ్రామీణ ప్రాంతంలో అమలు చేసేందుకు కేంద్రం అనుమతినివ్వడం దేశంలో ఇదే మొట్ట మొదటిది కావడం గమనార్హం. కాగా, ఈ పైలట్ ప్రాజెక్టు అమలు, నిర్వహణ బాధ్యతలను టీ-ఫైబర్, ఐఐటీ-హైదరాబాద్ సంయుక్తంగా పర్యవేక్షించనున్నాయి. రాష్ట్రంలోని ప్రతి ఇంటికీ 5జీ వైర్‌లెస్ ఇంటర్‌నెట్‌ను అందించేందుకు టీ-ఫైబర్, ఐఐటీ-హైదరాబాద్ మధ్య ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన గ్లోబల్ సమ్మిట్‌లో ఒప్పందం కుదిరింది. పైగా 5జీ వైర్‌లెస్ సేవలను 2026లోనే ప్రజలకు అందించాలని కూడా ఆ ఒప్పందంలో లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టును సీఎం రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టివిక్రమార్క, ఐటీ మంత్రి శ్రీధర్‌బాబు ప్రత్యేకంగా పర్యవేక్షిస్తున్నారు.
గ్రామంలో ఎక్కడున్నా వైఫై..
పైలట్ ప్రాజెక్టు విధానంలో వైర్‌లెస్ 5జీ సేవలందించేందుకు టీ-ఫైబర్, ఐఐటీ-హైదరాబాద్ బృందం రంగం సిద్ధం చేసింది. ఫిక్స్‌డ్ వైర్‌లెస్ యాక్సెస్ (ఎఫ్‌డబ్యూఏ) విధానంలో దీనిని అమలు చేయనున్నారు. ఖమ్మంలోని సమీకృత జిల్లా కలెక్టరేట్ కార్యాలయంపై ఒక యాంటెనాను ఏర్పాటు చేస్తారు. అక్కడి నుంచి వైర్‌లెస్ విధానంలో ఇంటర్‌నెట్‌ను అందించాలనుకునే గ్రామంలో ఒక మెయిన్ రిసీవర్‌ను ఉంచుతారు. దీంతో కలెక్టరేట్ నుంచి నిర్దేశిత గ్రామానికి వైర్‌లెస్ ఇంటర్‌నెట్ అందుబాటులోకి వస్తుంది. ఆ తరువాత గ్రామంలో కొంత దూరంలో ఉన్న విద్యుత్ స్థంబాలకు మినీ రిసీవర్స్ (ఐపీవీ6-వైఫై-7 హై సెక్యూరిటీ రూటర్స్)ను అమర్చుతారు. మెయిన్ రిసీవర్ నుంచి ఈ మినీ రిసీవర్స్‌కు వైర్‌లెస్ ఇంటర్‌నెట్ అందుతుంది. గ్రామంలో ఉన్నవారికి పాస్‌వర్డ్, యూజర్ ఐడీ కేటాయిస్తారు. దాని ద్వారా గ్రామంలో స్మార్ట్‌ఫోన్, టీవీ, ల్యాప్‌టాప్, కంప్యూటర్లకు వైర్‌లెస్ విధానంలో వైఫై సేవలను పొందవచ్చు. మరోవైపు టీ-ఫైబర్ అందిస్తున్న సెటప్ బాక్స్‌కు ఈ వైర్‌లెస్ 5జీ వైఫైని కనెక్ట్ చేసుకోవడం ద్వారా ఓటీటీలు సహా గూగుల్ సేవలు తదితర సేవలన్నీ అందుబాటులోకి వస్తాయి. తుఫాన్లు వచ్చినప్పుడు కూడా వైర్‌లెస్ సేవల్లో అంతరాయం కలగకుండా హైసెక్యూరిటీ విధానాన్ని అవలంబించనున్నారు.