kumaram bheem asifabad- చేప పిల్లల పంపిణీకి రంగం సిద్ధం
ABN , Publish Date - Sep 29 , 2026 | 10:45 PM
మత్స్యకారుల అభ్యున్నతి కోసం ప్రభుత్వం ఉచితంగా పంపిణీ చేసే చేపపిల్లల పంపిణీ కార్యక్రమానికి ప్రభుత్వం నిర్ణయించింది. ఈ ఏడాది చేపపిల్లల పంపిణీకి సంబంధించి టెండర్ల ప్రక్రియ పూర్తయింది. ఈ మేరకు అక్టోబరు మొదటి వారంలో చేప పిల్లలను వదిలేందుకు మత్స్యశాఖ సిద్ధ మైంది.
- ముగిసిన టెండర్ల ప్రక్రియ
- 276 చెరువుల్లో 1.44 కోట్ల చేప పిల్లలు
ఆసిఫాబాద్‌రూరల్, సెప్టెంబరు 29 (ఆంధ్రజ్యోతి): మత్స్యకారుల అభ్యున్నతి కోసం ప్రభుత్వం ఉచితంగా పంపిణీ చేసే చేపపిల్లల పంపిణీ కార్యక్రమానికి ప్రభుత్వం నిర్ణయించింది. ఈ ఏడాది చేపపిల్లల పంపిణీకి సంబంధించి టెండర్ల ప్రక్రియ పూర్తయింది. ఈ మేరకు అక్టోబరు మొదటి వారంలో చేప పిల్లలను వదిలేందుకు మత్స్యశాఖ సిద్ధ మైంది. జిల్లాలో 76 మత్స్య పారిశ్రామిక సహకార సంఘాలు ఉండగా ఇందులో 3400 మంది మత్స్యకారులున్నారు. ఈ కుటుంబాలకు చేపలు, రొయ్యలు విక్రయించడమే జీవనాధారం. జిల్లాలో 261 చెరువులు, 4 ప్రాజెక్టులు, 11 పెద్ద చెరువులు ఉన్నాయి. వీటిలో ప్రతి ఏటా 1.44 కోట్ల వరకు సీడ్‌ను వదలనున్నారు. వీటిలో ఏటా మత్స్యశాఖ అందించే చేపల, రొయ్యల సీడ్‌ను వదిలి పెంచుతున్నారు. ప్రాజెక్టులు, పెద్ద చెరువుల్లో 80 ఎంఎం నుంచి 100 ఎంఎం వరకు, చిన్న చెరువుల్లో 35 ఎంఎం నుంచి 40 ఎంఎం వరకు చేప పిల్లలను వదలనున్నారు.
ఈ ఏడాది ఆలస్యం..
ఈ ఏడాది చెరువుల్లో చేపల విడుదల అలస్యంకానుంది. గతంలో టెండర్లు దక్కిం చుకొని చేప పిల్లలు పంపిణీ చేసిన పలువురు కాంట్రాక్టర్లకు ప్రభుత్వం రూ. 2.10 కోట్ల బకాయిలు చెల్లించాల్సి ఉంది. బకాయిలు చెల్లించకపోవడంతో చేపపిల్లలను సరఫరా చేయడానికి కాంట్రాక్టర్లు ముందుకు రావడంలేదు. సాధారణంగా ఏప్రిల్ మేలో టెండర్లు పిలువాల్సి ఈ ఏడాది సెప్టెంబరు మొదటి వారంలో టెండర్లు పిలిచారు. ఈసారి ఎల్‌నినో నేపథ్యంలో వర్షాలు సకాలంలో కురవలేదు. ఈ క్రమంలో పూర్తిగా నిండిన చెరువుల్లో మాత్రమే చేపపిల్లలను వదలాలని నిర్ణయించారు. అందులోనూ త్వరగా పెరిగే బొత్స, రవు వంటి రకాలకు ప్రాధాన్యం ఇస్తున్నారు. ఈసారి చేపపిల్లల ఎంపికలో అచితూచి అడుగులు వేస్తున్నారు. గతంలో నాణ్యతలేని చేపపిల్లలను సరఫరా చేశారని, పిల్లలు కూడా సరిగ్గా రాలేదని మత్స్యకార సంఘాల నుంచి ఆరోపణలు రావడంతో ప్రభుత్వం తాజాగా చేపపిల్లలను తూకం వేయాలని నిర్ణయించింది. చెరువు విస్తీర్ణం, నీటి సామర్థ్యాన్ని బట్టి ఎకరానికి దాదాపు 2వేల నుంచి 3వేల చేప పిల్లలను వదిలే అవకాశం ఉంది. ప్రభుత్వ ఆదేశాల మేరకు ఏడాది పొడవున నీరు ఉండే పెద్ద చెరువుల్లో లక్షకు పైగా చేప పిల్లలను వదిలే అవకాశం ఉంది.
రెండు, మూడు రోజుల్లో విడుదల..
- సాంబశివరావు, జిల్లా మత్స్యశాఖ అఽధికారి
ప్రాజెక్టులు, చెరువులలోకి రెండు, మూడు రోజుల్లో చేప పిల్లల విడుదల కార్యక్రమం నిర్వహిస్తాం. 261 చెరువుల్లో 1.44 కోట్ల చేప పిల్లలను వదులుతాం. ఏప్రిల్, మే మసాల్లో టెండరు ప్రక్రియ పూర్తి కావాల్సి ఉండగా ఈ ఏడాది సెప్టెంబరు మాసంలో టెండర్ ప్రక్రియ జరిగింది. ఈ మేరకు చర్యలు తీసుకుటున్నాం.