జైళ్లశాఖలో అస్తవ్యస్తంగా సిబ్బంది కేటాయింపులు
ABN , Publish Date - May 23 , 2026 | 05:19 AM
రాష్ట్ర జైళ్ల శాఖలో ఖైదీల సంఖ్యకు, రక్షణ విధుల్లో ఉండే సిబ్బందికి పొంతన లేకుండా పోయింది. కొన్ని జైళ్లలో ఖైదీల సంఖ్య భారీగా ఉండి, సిబ్బంది కొరత ఉంటే..
సంగారెడ్డిలో 600 మంది ఖైదీలకు.. 30 మందే సిబ్బంది
14 మంది ఖైదీలున్న వరంగల్ జైలులో.. 50మందితో విధులు
ఖైదీల సంఖ్యకు సిబ్బందికి పొంతనలేని వైనం
అటాచ్‌మెంట్ పైరవీల వల్లే ఈ దుస్థితి?
హైదరాబాద్, మే 22 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర జైళ్ల శాఖలో ఖైదీల సంఖ్యకు, రక్షణ విధుల్లో ఉండే సిబ్బందికి పొంతన లేకుండా పోయింది. కొన్ని జైళ్లలో ఖైదీల సంఖ్య భారీగా ఉండి, సిబ్బంది కొరత ఉంటే.. మరికొన్ని చోట్ల ఖైదీలు తక్కువగా ఉన్నా, సిబ్బంది మాత్రం అవసరానికి మించి విధుల్లో కొనసాగుతున్నారు. ముఖ్యంగా సంగారెడ్డి జిల్లా కేంద్ర కారాగారంలో.. ప్రస్తుతం 600 మంది ఖైదీలు ఉండగా, వారికి కాపలా ఉన్నది సుమారు 30మంది మాత్రమే. దీనికి పూర్తి భిన్నంగా వరంగల్ సెంట్రల్ జైలులో ఖైదీలు 14మంది ఉంటే.. వారి కోసం కేటాయించిన సిబ్బంది మాత్రం 50 మంది. కరీంనగర్ జైలులో 200మంది ఖైదీలకు నిబంధనల ప్రకారం 30మంది సిబ్బంది ఉంటే సరిపోతుంది. కానీ, ఇక్కడ 70మంది విధుల్లో ఉండటం గమనార్హం. ఇక, నిజామాబాద్ జైల్‌లో పనిచేసేందుకు ఎవరూ ఆసక్తి చూపకపోవడంతో సిబ్బంది కొరత తీవ్రంగా ఉంది. దీంతో ఉన్న కొద్ది సిబ్బందితోనే వంతులవారీగా డ్యూటీలు వేస్తున్నారు. కొందరు సిబ్బంది అధికారులను ప్రసన్నం చేసుకుని.. చర్లపల్లి, చంచల్‌గూడ వంటి అనుకూల ప్రాంతాల్లో ఏళ్ల తరబడి తిష్ట వేయడమే ఈ అస్తవ్యస్త పరిస్థితికి కారణమని ఆరోపణలు వినిపిస్తున్నాయి.
10ఏళ్ల తర్వాత బదిలీల జాతర
సిబ్బంది కేటాయింపులో అసమానతల నేపథ్యంలో, జైళ్లశాఖలో పదేళ్ల విరామం తర్వాత బదిలీల జాతర మొదలైంది. గత ప్రభుత్వ హయాంలో బదిలీలపై నిషేధం విధించడం.. ఎప్పుడైనా సడలించినా 40శాతం మందిని మాత్రమే మార్చడానికి అనుమతించడంతో దశాబ్ద కాలంగా సిబ్బంది ఒకేచోట ఉండిపోయారు. కొన్నేళ్లుగా జైళ్ళ శాఖకు పూర్తిస్థాయి డీజీ లేకపోవడంతో అధికారులు ఇష్టానుసారంగా వ్యవహరించారనే విమర్శలు రాగా, ప్రస్తుత డీజీ సౌమ్యా మిశ్రా పాత పద్ధతులకు స్వస్తి పలికి, ప్రక్రియను స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. సిబ్బంది నుంచి ఆప్షన్లు స్వీకరించి.. నెలాఖరు నాటికి పోస్టింగ్‌లు ఇవ్వనున్నారు. అయితే, గతంలో ‘పోస్టింగ్ ప్రాంతాన్ని’ ప్రాతిపదికగా తీసుకుని బదిలీ చేసేవారని సిబ్బంది చెబుతున్నారు. అంటే, ఓ వ్యక్తికి వరంగల్ జైల్లో పోస్టింగ్ ఉండి, తాత్కాలికంగా(అటాచ్‌మెంట్‌పై) మరో జైల్లో విధులు నిర్వహిస్తుంటే.. అప్పుడు ఆయన సర్వీసును వరంగల్ ఖాతాలోనే వేసేవారు. ఈసారి మాత్రం.. ‘వాస్తవంగా ఎక్కడ పనిచేస్తున్నారో’ ఆ ప్రాంతాన్నే ప్రామాణికంగా తీసుకుంటున్నారని.. దీనివల్ల బదిలీల జాబితాలో అనూహ్య మార్పులు వస్తాయని సిబ్బంది చెబుతున్నారు.
ఎస్పీల బదిలీలకు ప్రభుత్వ అనుమతి
జైళ్ల శాఖలో ఆరుగురు ఎస్పీ స్థాయి అధికారులుండగా, చంచల్‌గూడ జైలు సూపరింటెండెంట్ శివకుమార్‌గౌడ్ మినహా మిగతా వారెవ్వరికి నాలుగేళ్ల సర్వీస్ పూర్తి కాలేదు. హోంశాఖ అనుమతితో త్వరలోనే ఇద్దరు, ముగ్గురు ఎస్పీ స్థాయి అధికారుల్ని మార్చే అవకాశం ఉందని సమాచారం. ఇందుకు సంబంధించిన ఫైళ్లను జైళ్ల శాఖ త్వరలోనే హోం శాఖకు పంపించనుంది. కాగా, సీనియర్ ఐజీ రాజేష్ బాధ్యతల మార్పు ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. పరిపాలన విభాగాన్ని చూసిన ఆయనను.. కొద్ది రోజుల క్రితం సంక్షేమ విభాగానికి మార్చారు. ఆయన పర్యవేక్షణలో పెట్రోల్ బంకులు వంటి కీలక విభాగాలు ఉన్నప్పటికీ.. ప్రతినెలా నివేదిక ఇచ్చేలా ఓ కమిటీని ఏర్పాటు చేశారు. శాఖపరమైన కార్యక్రమాలకూ దూరంగా ఉంచారు.
ఉత్తర్వులకు లోబడే బదిలీలు: డీజీ
ప్రభుత్వ ఉత్తర్వులకు లోబడే సిబ్బంది బదిలీలు చేపడుతున్నట్లు సౌమ్యా మిశ్రా స్పష్టం చేశారు. గతంలో కొందరు సిబ్బంది పలుకుబడితో బదిలీలు ఆపించుకున్న విషయం తన దృష్టికి వచ్చిందని, ఈ సారి అలా జరగకుండా పారదర్శకత పాటిస్తామని అన్నారు. అనారోగ్యం, పిల్లల చదువులు, వైకల్యం ఉన్న వారికి మొదటి ప్రాధాన్యం ఇస్తామని, ఈ అంశంపై దుష్ప్రచారం తగదని పేర్కొన్నారు.