Share News

సృష్టి ఫెర్టిలిటీ కేసులో మరో మలుపు

ABN , Publish Date - Feb 14 , 2026 | 03:30 AM

సృష్టి ఫెర్టిలిటీ సెంటర్‌ సరగసి కేసు మరో మలుపు తిరిగింది. ఈ కేసులో విచారణ చేపట్టిన ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌(ఈడీ) అధికారులు సృష్టి ఫెర్టిలిటీ సెంటర్‌ అధినేత డాక్టర్‌ నమ్రతను అరెస్టు చేసి న్యాయస్ధానంలో ...

సృష్టి ఫెర్టిలిటీ కేసులో మరో మలుపు

  • డాక్టర్‌ నమ్రతను అరెస్టు చేసిన ఈడీ

హైదరాబాద్‌, ఫిబ్రవరి13 (ఆంధ్రజ్యోతి): సృష్టి ఫెర్టిలిటీ సెంటర్‌ సరగసి కేసు మరో మలుపు తిరిగింది. ఈ కేసులో విచారణ చేపట్టిన ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌(ఈడీ) అధికారులు సృష్టి ఫెర్టిలిటీ సెంటర్‌ అధినేత డాక్టర్‌ నమ్రతను అరెస్టు చేసి న్యాయస్ధానంలో హజరుపరిచారు. కోర్టు ఆమెకు ఈ నెల 26వ తేదీ వరకు జ్యూడిషియల్‌ రిమాండ్‌ విధించింది. నిజానికి, డాక్టర్‌ నమ్రత రెండ్రోజులుగా ఈడీ కార్యాలయంలో విచారణ ఎదుర్కొంటున్నారు. అయితే, నమ్రత విచారణకు సహకరించడం లేదని గురువారం సాయంత్రం ఆమెను అరెస్టు చేశామని ఈడీ అధికారులు ప్రకటించారు. గత ఏడాది వెలుగులోకి వచ్చిన సృష్టి ఫెర్టిలిటీ సెంటర్‌ కేసులో గోపాలపురం పోలీసులు తొలుత కేసు నమోదు చేసి పలువురు డాక్టర్లు, ఏజంట్లతో సహ 26మందిని అరెస్టు చేశారు. సరగసీ కోసం నమ్రత రూ.30లక్షలు నుంచి రూ.40లక్షలు దాకా వసూలు చేసేవారని, ఆ తర్వాత తమ వద్దకు వచ్చిన దంపతులకు వేరే వారి పిల్లలను అప్పగించేదని, దీనికి సంబంధించి నకిలీ డీఎన్‌ఏ నివేదికలు, వైద్య రికార్డులు సృష్టించేదని పోలీసుల విచారణలో వెల్లడైంది. రాజస్ధాన్‌కు చెందిన ఒక జంట నమ్రతను ఆశ్రయించి సరగసీ విధానంలో బిడ్డను పొందారు. తర్వాత వారు ప్రైవేటుగా డీఎన్‌ఏ పరీక్షలు చేయించుకోగా నమ్రత తమకు ఇచ్చిన బిడ్డకు తమకు సంబంధం లేదని తేలడంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దాంతో సృష్టి ఫెర్టిలిటీ సెంటర్‌ బాగోతం బయటపడింది. నమ్రత ఈడీ విచారణలో తాను మనీలాండరింగ్‌కు పాల్పడలేదని, తన ఆదాయం అంతా చట్టబద్ధమేనని అడ్డం తిరిగినట్లు సమాచారం.

Updated Date - Feb 14 , 2026 | 03:30 AM