వెలవెలబోతున్న ఎస్సారెస్పీ
ABN , Publish Date - Jul 24 , 2026 | 12:42 AM
ఉత్తర తెలంగాణ వరప్రదాయిని.. నెర్రెలు బారిన బీడు భూముల్లో అమృతదారలు కురిపించిన శ్రీరాంసాగర్ ప్రాజెక్టు ఎల్‌నినోతో వెలవెలబోతోంది. ఆయకట్టు సాగు గండంలో పడింది. ప్రతీ సంవత్సరం ఇప్పటికే ఎగువన మహారాష్ట్రలో వర్షాలు కురిసి గోదావరి
జగిత్యాల, జూలై 23 (ఆంధ్రజ్యోతి): ఉత్తర తెలంగాణ వరప్రదాయిని.. నెర్రెలు బారిన బీడు భూముల్లో అమృతదారలు కురిపించిన శ్రీరాంసాగర్ ప్రాజెక్టు ఎల్‌నినోతో వెలవెలబోతోంది. ఆయకట్టు సాగు గండంలో పడింది. ప్రతీ సంవత్సరం ఇప్పటికే ఎగువన మహారాష్ట్రలో వర్షాలు కురిసి గోదావరి పరవళ్లతో జలాశయం కళను సంతరించుకునేది. జూలై చివరి వారంలో అడుగిడినప్పటికీ నాందేడ్, పరిసర ప్రాంతాల్లో వరణుడి జాడేలేకుండా పోయింది. బాబ్లీ ప్రాజెక్టు గేట్లు ఎత్తి ఉంచినా దిగువకు నీటి ప్రవాహం కరువైంది.
అక్టోబరు వరకు..
మహారాష్ట్ర సరిహద్దులో 2.74టీఎంసీల సామర్థ్యంతో నిర్మించిన బాబ్లీ ప్రాజెక్టు ఎస్సారెస్పీ పూర్తి స్థాయి నీటిమట్టం పరిధిలోకి (ఎఫ్‌ఆర్‌ఎల్) వస్తుంది. అంటే శ్రీరాంసాగర్ నిండితే వెనుక జలాలు ఆ ప్రాజెక్టు వరకు వెళ్తాయి. కాబట్టి సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం బాబ్లీ 14గేట్లను జూలై 1వ తేదీ నుంచి అక్టోబరు 28వతేదీ వరకు ఎత్తి ఉంచుతారు. గోదావరికి వచ్చిన వరద వచ్చినట్లే దిగువన శ్రీరాంసాగర్‌కు చేరుతుంది.
ఎగువ నుంచి స్వల్పంగా.. వరద చేరిక
నాందేడ్ జిల్లా ధర్మాబాద్ తాలుకా బాబ్లీ గ్రామం వద్ద గోదావరి నదిపై బాబ్లీ ప్రాజెక్టు నిర్మించారు. అక్కడి నుంచి సుమారు 80కిలోమీటర్ల దూరం ప్రవహించి నిజామాబాద్ జిల్లా పోచంపాడ్‌లోని శ్రీరాంసాగర్‌కు గోదావరి నదీజలాలు చేరుతాయి. మహారాష్ట్ర మెట్టప్రాంతంలో ఉంటుంది. ఏ అడ్డంకులు లేకుండా సహజంగానే దిగువకు నీళ్లు ప్రవహిస్తాయి. గతంలో మహారాష్ట్రలో జూన్‌లోనే వర్షాలు కురిసి ఎస్సారెస్పీకి వరద వచ్చేంది. ఇప్పుడు జూలై ముగియవస్తున్నా అరకొర ప్రవహమే దిక్కవుతోంది. 2022నుంచి పరిశీలిస్తే.. గతంలో లేని విధంగా ఈ యేడాది నీటిమట్టం పడిపోయింది. ఇదే నెలలో నిరుడు కూడా వర్షపాతం తక్కువగా ఉంది. కానీ ఆగస్టు, సెప్టెంబరులో భారీ వర్షాలొచ్చి శ్రీరాంసాగర్ నిండుకుండా తొణికిసలాడింది. ఈసారి ఎల్‌నినో ప్రభావంతో వర్షాలు అంతలా రావని వాతావరణ శాఖ చెబుతుండడం.. ఆయకట్టు రైతుల్లో ఆందోళన కలిగిస్తోంది. స్ర్తుతం ప్రాజక్టుకు 2,662 క్యూసెక్కుల స్వల్ప వరద వస్తోంది. జూన్ నుంచి ఇప్పటివరకు ఎగువ నుంచి సుమారు 3.221 టీఎంసీల నీరు వచ్చి చేరింది. ప్రాజెక్టులోని నిల్వలను తొలుత తాగు అవసరాలకు, తర్వాత పంటల తడులకు ఇవ్వడానికి అధికారులు యత్నిస్తున్నారు.
జిల్లాలో ఆయకట్టు ఇలా..
జిల్లాలో ప్రస్తుత సీజన్‌లో 4,38,054ఎకరాల్లో వివిధ పంటలు సాగు అవనున్నట్లు అధికారులు అంచనా వేశారు. ఇందులో ఎస్సారెస్పీ కాలువ కింద 1,51,746ఎకరాలు, చెరువులు, కుంటల కింద 74,457ఎకరాలు, బోర్లు, బావులకింద 1,92,151ఎకరాలు, వర్షదార భూములు 19,700ఎకరాలున్నాయి. ఇందులో ఇప్పటివరకు 75,447ఎకరాల్లో మాత్రమే వివిధ పంటలు సాగవుతున్నాయి. ప్రధానంగా వరి 15,024 ఎకరాలు, మొక్కజొన్న 31,394ఎకరాలు, పత్తి 17,145ఎకరాలు, సోయా 740ఎకరాలు, రెడ్ గ్రామ్ 949 ఎకరాలు, గ్రీన్‌గ్రామ్ 245ఎకరాలు, చెరుకు 106ఎకరాలు, అనుములు 246ఎకరాలు, పసుపు 9,148ఎకరాలు, మిరప 89ఎకరాలు, వివిధ రకాల కూరగాయల పంటలు 349ఎకరాల్లో సాగు అవుతున్నాయి.
వర్షాలపైనే రైతుల ఆశలు..
మహారాష్ట్ర ఎగువ క్యాచ్‌మెంట్ ప్రాంతాల్లో విస్తారంగా వర్షాలు కురిసి గోదావరిలో భారీ వరదలు వస్తేనే ఎస్సారెస్పీకి మళ్లీ జలకళ వచ్చే పరిస్థితి ఉంది. ఉత్తర తెలంగాణ రైతుల చూపంతా ఇప్పుడు గోదావరి వరదలపైనే నిలిచింది. భారీవర్షాలు కురిసి ప్రాజెక్టు నిండితేనే ఈ యేడాది వానాకాలం సీజన్‌పై నెలకొన్న అనిశ్చితి తొలగే అవకాశం ఉందని రైతులు ఆశాభావంతో ఎదురుచూస్తున్నారు.
మిషన్ భగీరథకు కీలకమే...
ఎస్సారెస్పీ కేవలం సాగునీటి ప్రాజెక్టు మాత్రమే కాదు. ఉమ్మడి కరీంనగర్, నిజామాబాద్, అదిలాబాద్ జిల్లాలోని అనేక గ్రామాలు, పట్టణాలకు మిషన్‌భగీరథ ద్వారా తాగునీరు కూడా ఈ ప్రాజెక్టు నుంచే సరఫరా అవుతోంది. దీంతో నిల్వలు తగ్గడం వ్యవసాయంతో పాటు తాగునీటి నిర్వహణపైనా ప్రభావం చూపే అవకాశాలు ఉన్నాయని అధికారులు చెబుతున్నారు.
ఎస్సారెస్పీ ప్రాజెక్టు వివరాలు..
పూర్తి నిల్వ సామర్థ్యం..80.5 టీఎంసీలు
ప్రస్తుత నీటి నిల్వ...15.671 టీఎంసీలు
గత యేడాది ఇదే సమయానికి నీటీ నిల్వ..21.199టీఎంసీలు
24గంటల్లో ఇన్‌ఫ్లో...2,662 క్యూసెక్కులు
24గంటల్లో అవుట్ ఫ్లో...751 క్యూసెక్కులు
ఈ యేడాది జూన్ 1 నుంచి మొత్తం ఇన్ ఫ్లో...3.221 టీఎంసీలు
ఈ యేడాది జూన్ 1 నుంచి మొత్తం అవుట్ ఫ్లో...3.833 టీఎంసీలు
-----------------------------------------------------------------------------
జూలై 19వ తేదీ నాటికి శ్రీరాం సాగర్ ప్రాజెక్టు నీటి మట్టం
సంవత్సరం.. నీటి మట్టం అడుగుల్లో.. నిల్వ టీఎంసీల్లో
2022 - 1084 - 64.677
2023 - 1076 - 42.452
2024 - 1069 - 22.436
2025 - 1068 - 21.029
2026 - 1064 - 15.049