విద్యుత్ ఉత్పత్తిలో శ్రీశైలం ఎడమగట్టు సరికొత్త రికార్డు
ABN , Publish Date - Feb 07 , 2026 | 04:16 AM
శ్రీశైలం ఎడమగట్టు భూగర్భ జల విద్యుత్ కేంద్రం సరికొత్త రికార్డు నెలకొల్పింది. విద్యుత్ కేంద్రం 24 ఏళ్ల చరిత్రలో 5 యూనిట్లతోనే ఈ ఏడాది అత్యధికంగా 2544.763 మిలియన్ యూనిట్ల విద్యుత్‌ను ఉత్పత్తి చేసి రికార్డు సృష్టించింది.
10 నెలల్లోనే 2544.763 మిలియన్ యూనిట్ల ఉత్పతి
24 ఏళ్ల చరిత్రలోనే అత్యధికం
బ్రహ్మగిరి, ఫిబ్రవరి 6 (ఆంధ్రజ్యోతి): శ్రీశైలం ఎడమగట్టు భూగర్భ జల విద్యుత్ కేంద్రం సరికొత్త రికార్డు నెలకొల్పింది. విద్యుత్ కేంద్రం 24 ఏళ్ల చరిత్రలో 5 యూనిట్లతోనే ఈ ఏడాది అత్యధికంగా 2544.763 మిలియన్ యూనిట్ల విద్యుత్‌ను ఉత్పత్తి చేసి రికార్డు సృష్టించింది. జపాన్ సాంకేతిక పరిజ్ఞానంతో ఏర్పాటైన ఎడమగట్టు జల విద్యుత్ కేంద్రంలో ఒక్కో యూనిట్ 150 మెగావాట్ల సామర్థ్యంతో నిర్మించిన 6 యూనిట్లు 2007-08లో 2544.007 మిలియన్ల యూనిట్ల విద్యుత్ ఉత్పత్తి జరిగింది. ఈ ఆర్థిక సంవత్సరం (2025-26)లో కేవలం 5 యూనిట్లతోనే శుక్రవారం (ఫిబ్రవరి 6) నాటికే 2544.763 మిలియన్ యూనిట్ల విద్యుత్ ఉత్పత్తి లక్ష్యాన్ని అధిగమించింది శ్రీశైలం ఎడమగట్టు భూగర్భ జల విద్యుత్ కేంద్రం. ఈ నేపథ్యంలో శుక్రవారం భూగర్భ జల విద్యుత్ కేంద్రంలో తెలంగాణ జెన్‌కో సీఈ కేవీవీ సత్యనారాయణ, ఎస్‌ఈలు ఆదినారాయణ, రవీంద్రకుమార్, ఇంజనీర్లు, ఉద్యోగులు కేక్ కట్ చేసి సంబురాలు చేసుకున్నారు. ఈ సందర్భంగా సీఈ కేవీవీ సత్యనారాయణ మాట్లాడుతూ.. విద్యుత్ కేంద్రం నిర్మాణం పూర్తయిన 24 ఏళ్ల చరిత్రలోనే రికార్డుస్థాయిలో విద్యుత్ ఉత్పత్తి చేయడం ఎంతో గర్వంగా ఉందన్నారు. ఇంజనీర్లు, ఉద్యోగుల సమష్టి కృషితోనే ఈ రికార్డు సాధ్యమైందని చెప్పారు.