ఆర్టీసీ బస్సు, కారు ఢీ.. ఇద్దరి మృతి
ABN , Publish Date - May 04 , 2026 | 04:22 AM
నాగర్‌కర్నూల్ జిల్లాలోని శ్రీశైలం ఘాట్ రోడ్డులో ఆదివారం ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. మూల మలుపు వద్ద ఆర్టీసీ బస్సు, కారు ఢీకొనడంతో కారులో ప్రయాణిస్తున్న ....
ఆరుగురికి గాయాలు.. శ్రీశైలం ఘాట్ రోడ్డులో ప్రమాదం
బ్రహ్మగిరి, మే 3 (ఆంధ్రజ్యోతి): నాగర్‌కర్నూల్ జిల్లాలోని శ్రీశైలం ఘాట్ రోడ్డులో ఆదివారం ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. మూల మలుపు వద్ద ఆర్టీసీ బస్సు, కారు ఢీకొనడంతో కారులో ప్రయాణిస్తున్న ఇద్దరు మృతి చెందగా, మరో ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. తండ్రి అస్థికలను కృష్ణానదిలో కలిపేందుకు హైదరాబాద్‌లోని ఎల్‌బీనగర్‌కు చెందిన రక్షిత్ (40) తన కుటుంబ సభ్యులతో కలిసి శనివారం రాత్రి కారులో శ్రీశైలానికి వచ్చారు. ఆదివారం మల్లన్న దర్శనం అనంతరం తిరిగి హైదరాబాద్‌కు ప్రయాణమయ్యారు. బ్రహ్మగిరికి 12 కిలోమీటర్ల దూరంలో తవిసిపెంట గ్రామంలో ఉన్న మూల మలుపు వద్ద వారు ప్రయాణిస్తున్న కారు, ఎదురుగా వచ్చిన పికెట్ డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో జగదాంబ (55) అనే మహిళ అక్కడికక్కడే మృతి చెందగా, కారు నడుపుతున్న రక్షిత్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ చనిపోయారు. వారితో పాటు కారులో ఉన్న పృథ్వి, పుష్పవతి, హర్ష, ఇందు, నిత్య, సంహితలకు తీవ్ర గాయాలయ్యాయి. వారిని అచ్చంపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. బాధిత బంధువుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు బ్రహ్మగిరి ఎస్సై జయన్న తెలిపారు.