శ్రీశైలం డ్యాంలో తగ్గుతున్న నీటి నిల్వలు
ABN , Publish Date - May 29 , 2026 | 03:44 AM
శ్రీశైలం డ్యాంలో క్రమంగా నీటి నిల్వలు తగ్గుముఖం పడుతున్నాయి. గురువారం లెక్కల ప్రకారం.. పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం 215.8070...
39 టీఎంసీలకు చేరిన జలాలు
తాగు నీటి అవసరాలకే వినియోగం
బ్రహ్మగిరి, మే 28 (ఆంధ్రజ్యోతి) : శ్రీశైలం డ్యాంలో క్రమంగా నీటి నిల్వలు తగ్గుముఖం పడుతున్నాయి. గురువారం లెక్కల ప్రకారం.. పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం 215.8070 టీఎంసీలు కాగా ప్రస్తుతం 39.0875 టీఎంసీలకు... పూర్తి స్థాయి నీటిమట్టం 885 అడుగులకు గాను 817.60 అడుగులకు నీటి నిల్వలు చేరాయి. ప్రస్తుతం ఉన్న నీటిని తెలుగు రాష్ట్రాలు తాగునీటి అవసరాలకు మాత్రమే వినియోగించుకోవాలని కృష్ణా రివర్ మేనేజ్‌మెంట్ బోర్డు (కేఆర్‌ఎంబీ) ఆదేశించడంతో.. కుడి, ఎడమగట్ల విద్యుత్ కేంద్రాలలో నెల క్రితమే విద్యుదుత్పత్తిని నిలిపివేశారు. ప్రస్తుతం 817 నుంచి 800 అడుగుల వరకు విద్యుదుత్పాదన చేసుకునే అవకాశం ఉన్నప్పటికీ డ్యాంలో రోజురోజుకు నీటినిల్వలు తగ్గుతుండటంతో కేఆర్‌ఎంబీ అనుమతించ లేదని డ్యాం అధికారులు తెలిపారు. గత ఏడాది జూన్ మొదటి వారంలో 37 టీఎంసీల నీరు ఉన్నప్పటికీ రెండో వారం నుంచి కృష్ణానది ఎగువ పరివాహక ప్రాంతం నుంచి స్వల్పంగా వరద చేరిక ప్రారంభమైంది. జులై 12 నాటికి శ్రీశైలం డ్యాంలో నీటి నిల్వలు పూర్తిస్థాయికి చేరుకోవడంతో గేట్లను ఎత్తివేశారు. ప్రస్తుతం డ్యాంలోకి వరద వచ్చే అవకాశం కనిపించడం లేదని అధికారులు చెబుతున్నారు.