Share News

రాష్ట్రం కోసం ఎన్నిసార్లయినా ఢిల్లీ వెళ్తాం!

ABN , Publish Date - Mar 18 , 2026 | 05:15 AM

రాష్ట్ర ప్రయోజనాల కోసం ఎన్ని సార్లయినా ఢిల్లీకి వెళ్తామని మంత్రి శ్రీధర్‌బాబు చెప్పారు. అవసరమైతే తల ఒగ్గి నిధులు తీసుకొస్తామన్నారు.

రాష్ట్రం కోసం ఎన్నిసార్లయినా ఢిల్లీ వెళ్తాం!

  • అవసరమైతే తల ఒగ్గి, నిధులు తీసుకొస్తాం.. ఎవరో రాసిచ్చిన స్ర్కిప్టును కేటీఆర్‌ చదువుతున్నారు

  • శాసనసభలో మంత్రి దుద్దిళ్ల వ్యాఖ్యలు

  • జీవన్‌రెడ్డితో టీపీసీసీ చీఫ్‌ మాట్లాడాలి

  • బ్రాహ్మణులపై సామేల్‌ వ్యాఖ్యలు దురదృష్టకరం.. మీడియాతో శ్రీధర్‌బాబు

హైదరాబాద్‌, మార్చి 17 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ప్రయోజనాల కోసం ఎన్ని సార్లయినా ఢిల్లీకి వెళ్తామని మంత్రి శ్రీధర్‌బాబు చెప్పారు. అవసరమైతే తల ఒగ్గి నిధులు తీసుకొస్తామన్నారు. రాష్ట్రానికి నిధులు రాబట్టేందుకు ఢిల్లీ వెళ్లి, ప్రధాని మోదీని ఎన్నిసార్లయినా కలుస్తామని తెలిపారు. శాసనసభలో ఆయన మాట్లాడుతూ.. తమది జాతీయ పార్టీ అని, అధినేతలను కలవడానికి ఢిల్లీ వెళ్తే తప్పేంటని ప్రశ్నించారు. కేసీఆర్‌ పదేళ్లు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఢిల్లీకి చక్కర్లు కొట్టలేదా? తన ముఖ్యమంత్రి పదవిని కాపాడుకోవడానికి మోదీ వద్ద మోకరిల్లలేదా? అని నిలదీశారు. అసెంబ్లీకి ఎవరో రాసిచ్చిన స్ర్కిప్టును తీసుకొచ్చి చదువుతున్నారని, కేటీఆర్‌ది ఊకదంపుడు ఉపన్యాసమని ఎద్దేవా చేశారు. 2023 నుంచి వరస ఎన్నికల్లో ఫ్లాప్‌ అవుతున్న బీఆర్‌ఎస్‌ నేతలు.. వరస విజయాలు సాధిస్తున్న కాంగ్రె్‌సను ఫ్లాప్‌ అయ్యిందని ఎలా అంటారని ప్రశ్నించారు. ఇప్పటికైనా కేటీఆర్‌ పంథా మార్చుకోవాలని శ్రీధర్‌బాబు హితవు పలికారు. మహిళా సాధికారితపై అడ్డగోలుగా విమర్శలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. గోబెల్స్‌ ప్రచారం, సోషల్‌ మీడియాలో విష ప్రచారం, ప్రకటనలు ఇవ్వడంలో కేటీఆర్‌ను మించినోళ్లు లేరని ఎద్దేవా చేశారు. తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన ఘనత సోనియాగాంధీకే దక్కుతుందని, అలాంటి మహా నాయకురాలిపై కూడా వ్యంగ్యంగా మాట్లాడడం సరికాదని శ్రీధర్‌ బాబు అన్నారు. ఎంవోయూలు కుదుర్చుకున్న కంపెనీల్లో 30-40 శాతం మాత్రమే గ్రౌండింగ్‌ అవుతాయనే విషయం ఐటీ శాఖ మంత్రిగా పనిచేసిన కేటీఆర్‌కు తెలియదా? అని ప్రశ్నించారు. అనంతరం శ్రీధర్‌బాబు అసెంబ్లీ లాబీలో మీడియాతో ఇష్టాగోష్ఠిగా మాట్లాడారు. కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నేత జీవన్‌రెడ్డి పార్టీ మారే అవకాశం లేదని చెప్పారు. టీపీసీసీ చీఫ్‌ మహేశ్‌గౌడ్‌ వెళ్లి ఆయనతో మాట్లాడాలన్నారు. జీవన్‌రెడ్డికి తమ సంపూర్ణ మద్దతు ఉంటుందని ప్రకటించారు. ‘జీవన్‌రెడ్డి కష్టకాలంలో పార్టీతో ఉన్నారు. టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌గౌడ్‌ బాధ్యత తీసుకొని ఆయనతో మాట్లాడాలి. ఎవరో కార్యకర్తలు ఆయన ఇంటివద్ద జెండాలు తొలగించి ఉంటారు’ అని శ్రీధర్‌బాబు పేర్కొన్నారు. రాష్ట్రంలో జిల్లాల పునర్విభజన ఉండబోదన్నారు. దేశంలో ఎక్కడ ఎన్నికలు జరిగినా తెలంగాణ నుంచే డబ్బులు వెళుతున్నాయని, కాంగ్రెస్‌ నాయకత్వానికి 1000 కోట్లు ఇస్తున్నారన్న కేటీఆర్‌ ఆరోపణలపై స్పందిస్తూ.. అలా (బీజేపీకి) ఇచ్చిన అలవాటు బీఆర్‌ఎ్‌సకే ఉందన్నారు.


ఆ పార్టీని ప్రసన్నం చేసుకోవడానికి బీఆర్‌ఎస్‌ డబ్బులు ఇచ్చిందని శ్రీధర్‌బాబు ఆరోపించారు. రెండు, మూడు రోజుల్లో అసెంబ్లీ కమిటీలను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. సింగరేణికి రాష్ట్ర ప్రభుత్వం వేల కోట్ల బకాయిలున్నట్లు కిషన్‌రెడ్డి చేసిన వ్యాఖ్యపై స్పందిస్తూ.. కోల్‌ ఇండియాకు కూడా భారీగా బకాయిలు లేవా?అని నిలదీశారు. రెడ్డి అయినా, రావు అయినా తమ వద్దకు రావాలంటూ మజ్లిస్‌ నేతలు చేసిన వ్యాఖ్యలపై స్పందిస్తూ.. ఒకరిని గౌరవించాలని వారికి మనం ఎలా చెబుతామని అన్నారు. సీఎంగా ఉన్నవారు మరో ఐదేళ్లు ఉండాలని కోరుకోవడంలో తప్పేముందని శ్రీధర్‌బాబు అన్నారు.

సామేల్‌ వ్యాఖ్యలు దురదృష్టకరం

బ్రాహ్మణులపై ఎమ్మెల్యే సామేల్‌ చేసిన వ్యాఖ్యలు దురదృష్టకరమని శ్రీధర్‌బాబు అన్నారు. ‘హిందూ సమాజానికి ఆయన ఇప్పటికే వివరణ ఇచ్చారు. అయితే, మరింత స్పష్టత ఇవ్వాలన్న డిమాండ్‌ దృష్ట్యా ఆయన అందుకు అనుగుణంగా స్పందించాలి. ఎవరూ కూడా అలాంటి మాటలు మాట్లాడవద్దు’ అని మంత్రి స్పష్టం చేశారు.

Updated Date - Mar 18 , 2026 | 05:15 AM