Share News

పారిశ్రామిక వేత్తలు ప్రగతిలో భాగస్వాములు

ABN , Publish Date - Jun 10 , 2026 | 04:25 AM

పారిశ్రామికవేత్తలు రాష్ట్ర ప్రగతిలో కీలక భాగస్వాములని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు అన్నారు. భవిష్యత్తు తరాలకు మేలు జరిగేలా రాష్ట్రంలో...

పారిశ్రామిక వేత్తలు ప్రగతిలో భాగస్వాములు

  • ఎఫ్‌టీసీసీఐ ఎక్స్‌లెన్స్‌ అవార్డ్స్‌ 2026

  • ప్రదానోత్సవంలో మంత్రి శ్రీధర్‌బాబు

హైదరాబాద్‌, జూన్‌ 9 (ఆంధ్ర జ్యోతి): పారిశ్రామికవేత్తలు రాష్ట్ర ప్రగతిలో కీలక భాగస్వాములని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు అన్నారు. భవిష్యత్తు తరాలకు మేలు జరిగేలా రాష్ట్రంలో స్థిరమైన, పర్యావరణహిత పారిశ్రామిక వృద్ధికి చిత్తశుద్ధితో రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తోందని చెప్పారు. ఫెడరేషన్‌ ఆఫ్‌ తెలంగాణ చాంబర్స్‌ ఆఫ్‌ కామర్స్‌ అండ్‌ ఇండస్ట్రీ (ఎఫ్‌టీసీసీఐ) ఆధ్వర్యంలో మంగళవారం హైదరాబాద్‌ జేఆర్సీ కన్వెన్షన్‌ సెంటర్‌లో నిర్వహించిన ఎఫ్‌టీసీసీఐ ఎక్స్‌లెన్స్‌ అవార్డ్స్‌-2026 ప్రధానోత్సవంలో మంత్రి పాల్గొని మాట్లాడారు. ఐటీ, లైఫ్‌ సైన్సెస్‌ నుంచి తయారీ రంగం, డీప్‌ టెక్‌ వరకు తెలంగాణను దేశంలో అత్యంత అకర్షణీయమైన వృద్ధి కేంద్రంగా తీర్చిదిద్దేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. రాబోయే రోజుల్లో పారిశ్రామిక అభివృద్ధి కేవలం భూమి, మూలధనంపైనే కాకుండా.. మేథో సంపత్తి, నాలెడ్జ్‌ ఎకానమీ ఆధారంగానే సాధ్యమవుతుందని పేర్కొన్నారు. పారిశ్రామిక ప్రగతి కేవలం హైదరాబాద్‌కే పరిమితం కాకుండా అన్ని ప్రాంతాలకు విస్తరిస్తున్నామని చెప్పారు. ఈ సందర్భంగా నవ లిమిటెడ్‌ సంస్థకు సామాజిక బాధ్యత విభాగంలో విశిష్ట సేవలు, సమాజ అభివృద్ధికి నిబంద్ధతతో పనిచేస్తున్నందుకు ఎఫ్‌టీసీసీఐ ఎక్స్‌లెన్స్‌ అవార్డును మంత్రి అందజేశారు.

అవార్డులు అందుకున్న సంస్థలు.. వ్యక్తులు

  • పెద్ద పరిశ్రమలకు సంబంధించి సమగ్ర పారిశ్రామిక ప్రతిభ విభాగంలో మహీంద్రా అండ్‌ మహీంద్రాకు ఫార్మా డివిజన్‌లో.

  • చిన్న, మధ్యతరహా పరిశ్రమల విభాగంలో అవాంటెల్‌ లిమిటెడ్‌కు సమగ్ర పారిశ్రామిక ప్రతిభా అవార్డు.

  • పెద్ద పరిశ్రమల ఎగుమతి ప్రతిభా అవార్డును రవి ఫుడ్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌కు దక్కింది

  • చిన్న, మధ్య తరహా పరిశ్రమల విభాగంలో ఎగుమతి ప్రతిభా అవార్డు బటర్‌ఫ్లై ఎడ్యుఫీల్డ్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌కు వచ్చింది.

  • ఏరో స్పేస్‌, రక్షణ రంగంలో నిమ్రా సెర్గ్లాస్‌ టెక్నిక్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌కు అవార్డు ఇచ్చారు.

  • పర్యాటక రంగంలో అవిలా టూర్స్‌, పెద్ద పరిశ్రమల ఉత్పత్తి ఆవిష్కరణలో ఇండియన్‌ ఇమ్యునో లాజికల్‌ లిమిటెడ్‌, చిన్న, మధ్యతరహా పరిశ్రమల ఉత్పత్తి విభాగంలో యూనిస్ట్రింగ్‌ టెక్‌ సొల్యూషన్స్‌, స్టార్టప్‌ ప్రతిభా అవార్డు అసాన్‌ విల్‌ సంస్థకు దక్కాయి.

  • సైన్స్‌, ఇంజనీరింగ్‌ రంగంలో వ్యక్తిగత ప్రతిభా అవార్డు మారోజు శరత్‌చంద్రకు, మహిళా పారిశ్రామిక వేత్త క్యాటగిరిలో డా. రజనికుమారి చామల, వికలాంగుల స్వయం సమర్థతకు కృషి చేసిన విభాగంలో రఘుదత్‌ దిగాలా, సామాజిక పారిశ్రామికవేత్త విభాగంలో పసుపులేటి హనుమంతరావు అవార్డులను దక్కించుకున్నారు.

Updated Date - Jun 10 , 2026 | 04:25 AM