Share News

సమాచార లోపంతోనే గందరగోళం

ABN , Publish Date - Mar 02 , 2026 | 01:48 AM

హైదరాబాద్‌ కోకాపేలలోని శారదా పీఠం భూముల వ్యవహారంలో సమాచార లోపం వల్లే గందరగోళం తలెత్తిందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌ బాబు స్పష్టం చేశారు....

సమాచార లోపంతోనే గందరగోళం

  • ఆ భూములు శారదా పీఠానికే చెందుతాయి

  • మాపై విపక్షాల దుష్ప్రచారం

  • ‘బాపు ఘాట్‌’ విషయంలో ప్రజాభీష్టం మేరకే ముందుకు: మంత్రి శ్రీధర్‌ బాబు

హైదరాబాద్‌/నార్సింగి, మార్చి 1(ఆంధ్రజ్యోతి): హైదరాబాద్‌ కోకాపేలలోని శారదా పీఠం భూముల వ్యవహారంలో సమాచార లోపం వల్లే గందరగోళం తలెత్తిందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌ బాబు స్పష్టం చేశారు. ఆ భూములు పీఠానికే చెందుతాయని, ఇందులో ఎలాంటి సందేహం లేదన్నారు. పీఠం అభివృద్ధి, ఆధ్యాత్మిక కార్యక్రమాలకు ప్రభుత్వం తరఫున అన్ని రకాలుగా అండగా ఉంటామన్నారు. ఆదివారం కోకాపేటలోని శ్రీ శారదా పీఠాన్ని సందర్శించి.. అక్కడి రాజశ్యామల అమ్మవారి ఆలయం, ఇతర నిర్మాణాలను పరిశీలించారు. అనంతరం ఉత్తర పీఠాధిపతులు స్వాత్మానందేంద్ర సరస్వతీ స్వామీజీతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్‌ బాబు మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం అన్ని మతాలను సమానంగా గౌరవిస్తోందని అన్నారు. తమ ప్రభుత్వానికి భేషజాలు లేవని, తప్పులు దొర్లితే ఎప్పటికప్పుడు సరిదిద్దుకునేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు. శారదా పీఠం భూముల విషయంలో జరిగిన పొరపాటును వెంటనే సరిదిద్దుకున్నామన్నారు. రాబోయే రోజుల్లో ఇలాంటివి పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. మతాన్ని అడ్డుపెట్టుకొని కొందరు బీజేపీ, బీఆర్‌ఎస్‌ నాయకులు నీచ రాజకీయాలకు పాల్పడుతున్నారని విమర్శించారు. వారి రాజకీయ ఉనికి కోసం ప్రభుత్వంపై దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. తమది బుల్డోజర్‌ సంస్కృతి కాదని, కబ్జాకోరుల నుంచి ప్రభుత్వ భూములను కాపాడటం చూసి ఓర్వలేకే కొందరూ రాష్ట్ర ప్రభుత్వంపై కావాలనే బురద చల్లుతున్నారని విమర్శించారు. బాపుఘాట్‌ అభివృద్ధి విషయంలో ప్రజాభీష్టం మేరకే ముందుకెళ్తామని, తప్పుడు ప్రచారాన్ని నమ్మొద్దని స్థానికులకు మంత్రి శ్రీధర్‌ బాబు విజ్ఞప్తి చేశారు.

ప్రాణదాతలుగా మారండి

రక్తదానంపై అపోహలు వీడి ప్రాణదాతలుగా నిలవాలని మంత్రి శ్రీధర్‌ బాబు అన్నారు. ఆపదలో ఉన్న వారికి చేసే రక్తదానం ప్రాణదానంతో సమానమని పేర్కొన్నారు. ఆదివారం జూబ్లీహిల్స్‌లోని చిరంజీవి బ్లడ్‌ బ్యాంక్‌లో ఎస్‌ఎస్ఎస్ యువసేన ఆధ్వర్యంలో ఉమ్మడి ఏపీ మాజీ స్పీకర్‌ దుద్దిళ్ల శ్రీపాదరావు 89వ జయంతిని పురస్కరించుకొని ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని ఆయన ప్రారంభించి మాట్లాడారు. రక్తం ఇచ్చేటప్పుడు ఎవరూ కులం, మతం, ప్రాంతం చూడరని.. ఇది మనుషులందరినీ కలిపే గొప్ప మానవత్వమన్నారు.

Updated Date - Mar 02 , 2026 | 01:48 AM